ఫార్మా పరిష్కారాలు భ్రమలేనా?

ఫార్మా పరిష్కారాలు భ్రమలేనా?

ఫార్మా కాలుష్యం  తెలంగాణాలో  పల్లెలను,  వ్యవసాయాన్ని,  రైతులను, ఇంకా అనేక కుటుంబాలను పట్టి పీడిస్తున్నది.  పర్యావరణం మీద దీర్ఘకాలికంగా దుష్ప్రభావం చూపుతున్నది.  ఫార్మా కాలుష్య మలినాలు పొరలు పొరలుగా నక్క వాగులో,  అనేక  చెరువులలో, భూగర్భ జలాలలో,  మూసీ,  మంజీరా,  గోదావరి,  కృష్ణా నదులలో పేరుకుపోతున్నది. 

 ఫార్మా కాలుష్యం కొనసాగడానికి అధికారులు,  రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తల  అవినీతి,  నిర్లక్ష్యంతోపాటు  టెక్నాలజీ పేరిట జరిగిన మోసం పాత్ర కూడా ఉన్నది. మనదేశంలో శాస్త్రవేత్తలు ప్రజల తరఫున మాట్లాడకపోవటం కూడా ఒక కారణం. విషయ జ్ఞానులు వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పకపోవడం దుర్మార్గం. పైగా, కాలుష్య నియంత్రణ చట్టాల పరిధిలో ఏర్పాటు చేసిన కమిటీలలో సభ్యులుగా నియమితులు అవుతున్నశాస్త్రవేత్తలు ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా ‘నిశ్శబ్దంగా’ ఉంటున్నారు.

కాలుష్యం సాధారణంగా వివిధ రసాయన చర్యలు, కనపడని వాయువులు వల్ల జరుగుతుంది. రంగులేని వ్యర్థ జలాల వల్ల కూడా కాలుష్యం ఉంటుంది. కానీ, కనపడదు.  కాలుష్యం ఉన్నది అని రుజువు చెయ్యాలంటే శాస్త్రవేత్తలు, వారి పరిజ్ఞానం, తగిన పరికరాలు, పరిశోధనశాలలు అవసరం. అవి లేకుంటే కాలుష్యం నిర్ధారించే అవకాశం లేదు.  కనుక వాటిని ప్రజల దగ్గరి నుంచి తీసివేసి ప్రభుత్వ శాఖ కింద,  ప్రైవేటు పెట్టుబడిదారుల చేతిలో ఉంచారు.

ALSO READ | ప్రజాపాలనలో.. సింగరేణి వెలుగులు

 దరిమిలా, ఈ పరిశోధన వ్యవస్థను, పరిశోధనను తమ గుప్పిట్లోకి తీసుకుని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పారిశ్రామికవేత్తలు  కాలుష్యం ఉన్నదా లేదా అని విశ్లేషణలు చేయడం లేదు. చేసిన విశ్లేషణలు అసంపూర్తిగా చేయడం, చేసిన పరీక్షలు ప్రజల ముందు పెట్టకపోవటం వంటి చర్యల ద్వారా ప్రజా వ్యతిరేకతను గందరగోళానికి గురి చేస్తూ  కోర్టులలో నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు.

పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై అనుమానాలు

ఉమ్మడి కాలుష్య శుద్ధి కేంద్రం అని ఒక పరిష్కారం 1990లలో ప్రజలకు, ప్రభుత్వానికి, కోర్టులలో చెప్పి తమ మీద భారం పడకుండా చూసుకున్నారు. కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (CETP) ఒకటి దేశంలో మొట్టమొదటిసారిగా 1994లో  పటాన్​చెరులో మొదలుపెట్టారు. పారిశ్రామిక అభివృద్ధి కొనసాగించడానికి,  ప్రజల వ్యతిరేకతను దారి మళ్ళించడానికి, పటాన్‌చెరు ప్రాంతం కాలుష్య సమస్యను అధిగమించడానికి పటాన్​చెరు ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్ (PETL) మొదలు పెట్టారు.  రోజుకు 7500 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో,  రూ.5.70 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో ఈ CETP స్థాపించబడింది.  మొదటి నుంచి మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి.  ఒక ఫార్మా పరిశ్రమతో అనేక రకాల మందులు తయారుచేస్తారు. 

వాటికోసం రకరకాల ముడి రసాయనాలు వాడతారు. ఫలితంగా, ప్రతి పరిశ్రమ వ్యర్థాలలో వివిధ రకాల రసాయనాలు, రసాయన సమ్మిళితాలు ఉంటాయి. అటువంటి వ్యర్థ జలాలను శుద్ధి చేయడమే కష్టం అని అప్పటికే భావిస్తుండగా, అనేక పరిశ్రమల వ్యర్థాలను కలిపి శుద్ధి ఎట్లా చేస్తారు అనే ప్రశ్న సాధారణంగా వస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి కాలుష్య శుద్ధి వెనుక ఉండే శాస్త్రం బయటపెట్టలేదు. శుద్ధి ఎట్లా జరుగుతుంది అని మేం అడిగితే సహేతుక సమాధానం ఇవ్వలేదు.  ఇక్కడే కాకుండా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇంకోటి ఏర్పాటు చేశారు. ఆశ్చర్యంగా, ఈ మధ్య పాశమైలారం పారిశ్రామికవాడలో 2024లో ఇంకొకటి ప్రారంభించారు.

మురికి నీటిలోకి వ్యర్థాలు

దేశంలోని కాలుష్య శుద్ధి కేంద్రాల వాస్తవ అవసరాన్ని అంచనా వేయడానికి  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2011–-12లో CETPల మీద అధ్యయనం చేసింది.  దేశంలో 193 కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (సీఈటీపీ) ఏర్పాటు అయ్యాయని, ఇవి 212 పారిశ్రామిక ప్రాంతాలు/ ఎస్టేట్‌లకు సేవలు అందిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. అయితే, ఈ అధ్యయనం వీటి పని తీరు మెరుగు కావాలని ఆకాంక్షించింది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి విడుదల అవుతున్న శుద్ధి చేసిన నీటి పరీక్షలు చేయలేదు.  

ఆ నీటిలో కాలుష్యం ఉందా లేదా తెలుసుకోవాలి కదా.  పరిశ్రమ నుంచి విడుదల చేసే వ్యర్థ జలాలకు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి విడుదల అయ్యే జలాలకు ప్రమాణాలు చాలాకాలం నిర్ధారించలేదు. నిర్ధారించిన ప్రమాణాల మేరకు ఈ వ్యర్థాలు ఉన్నాయా లేదా కూడా పరీక్షించే అవకాశం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కూడా 1990 దశాబ్దంలో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఒక పరిష్కారంగా ఎట్లా నమ్మినదో ఇప్పటివరకు తెలియదు.

 అయితే, 1998 నాటికి ఇది పనిచేయడం లేదని అర్థం అయ్యింది. అందుకేనేమో, PETL నుంచి వ్యర్థాలను హైదరాబాద్ మురికి నీటితో కలపాలని సరి కొత్త ఆలోచన కాలుష్య కారకులు తెస్తే, సుప్రీంకోర్టు ఒప్పుకుని పటాన్​చెరు నుంచి 18 కిలోమీటర్ల  పైపులైన్ వేయడానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి కూడా పటాన్​చెరు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనితీరు ఇంకా దిగజారింది. 

పీఈటీఎల్ వ్యర్థాలపై పరీక్షలు

ఒక విదేశీ పరిశోధక బృందం PETL నుంచి బయటకు వచ్చే వ్యర్థాలను 59 మందుల (ఫార్మాస్యూటికల్స్) కోసం పరీక్షించింది. ఈ బృందం ఈ వ్యర్థాలలో 11 రకాల ఔషధాలను అధిక పరిమాణంలో కనుగొంది. వాటిలో ఆరు యాంటీబయాటిక్స్. ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే  కనుగొన్న యాంటీబయాటిక్స్ పరిమాణం చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఇండ్లు, ఆసుపత్రుల నుంచి వచ్చే మురుగునీటిలో  ఔషధాల సాధారణ కొలతలు లీటరుకు మైక్రోగ్రామ్‌లలో ఉండగా, PETL వ్యర్థాలలో లీటరుకు 31,000 మైక్రోగ్రాముల చొప్పున సిప్రోఫ్లోక్సాసిన్‌ను కనుగొన్నారు. 

ఈ ఔషధంతో చికిత్స పొందే వ్యక్తుల రక్తంలో గాఢత కంటే ఎక్కువ సిప్రోఫ్లోక్సాసిన్ ‘శుద్ధి’ చేసిన వ్యర్థ జలాలలో  కనుగొనడం విస్మయానికి గురి చేసింది. ఒక రోజులో విడుదల అయ్యే వ్యర్థ జలాలలో దాదాపు 45 కిలోలు.  ఇది స్వీడన్ దేశ జనాభా మొత్తంగా ఐదు రోజులలో వినియోగించే సిప్రోఫ్లోక్సాసిన్ మొత్తానికి సమానం. ఈ శాస్త్రీయ పరిశోధన ఫలితాలు వచ్చిన తరువాత కూడా కాలుష్య నియంత్రణ అధికారులకు, కుబేరులు అవుతున్న పారిశ్రామికవేత్తలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. దాదాపు 18 ఏండ్ల తరువాత కూడా కాలుష్య నియంత్రణ చర్యలు శూన్యం. 

కాలుష్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి

IIT హైదరాబాద్ పరిశోధకులు ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి ప్రారంభించి, కృష్ణానది సముద్రంలో కలిసే చోటవరకు మూసీ నది నుంచి 16 చోట్ల నుంచి నీరు, అవశేషాలను  సేకరించి పరీక్షించారు. నగరానికి పశ్చిమాన ఉన్న ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్‌లో తక్కువ మొత్తంలో యాంటీబయాటిక్స్ ఉన్నట్లు వారు కనుగొన్నారు.  నగరం మధ్యలో ఉన్న ముసారాంబాగ్‌కు దగ్గర మూసీనదిలో వీటి సాంద్రత విపరీతంగా పెరిగిపోయాయి.  ముసారాంబాగ్ హైదరాబాద్‌లోని ఫార్మాస్యూటికల్  క్లస్టర్‌లకు దూరంగా ఉంది. సమీపంలో పరిశ్రమలు లేవు.

 PETL,  ఇతర ఫార్మా వ్యర్థాలు చేరుతున్న అంబర్‌పేట్ శుద్ధి కేంద్రంలోకి చేరుతున్న వ్యర్ధాలలో వీటి సాంద్రత మరీ ఎక్కువగా ఉంది. ఇందులో, సిప్రోఫ్లోక్సాసిన్ లీటరుకు దాదాపు 5,528 మైక్రోగ్రాములు. దీనిని బట్టి PETL, ఇతర శుద్ధి కేంద్రాలు, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఫార్మా  కంపెనీలు పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్‌, ఇంకా ఇతర రసాయనాలను వదులుతున్నాయని ఈ పరిశోధనల నుంచి స్పష్టంగా తెలుస్తుంది.  మూసీలోకి కంపెనీలు నేరుగా అక్రమంగా వ్యర్థాలను పడేస్తున్నాయని కూడా స్పష్టమైంది.  

పీసీబీ పనితీరుపై దృష్టి ఏది?

ఇటీవల తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పనితీరు మీద ఒకసారి జాతీయ హరిత ట్రిబ్యునల్,  తెలంగాణ హైకోర్టు ఇంకొకసారి అసహనం వ్యక్తం చేశాయి.  తెలంగాణ  ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది.  ఇంకా ఫార్మా పరిశ్రమ అభివృద్ధి కాంక్షిస్తున్నది.  ఇటువంటి వైఖరి పూర్తిగా ప్రజా వ్యతిరేకం. ఇకనైనా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. 

డా. దొంతి నరసింహారెడ్డి