రాష్ట్ర సాధనలోనే కాదు రాష్ట్ర అభివృద్ధిలో సైతం తనదైన పాత్ర పోషిస్తూ తెలంగాణలోనే పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగుతోంది సింగరేణి. దాదాపుగా 40 వేల మందికి పైగా పర్మినెంట్ ఉద్యోగులు, సుమారు 30 వేల కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధిని కల్పిస్తున్నది సింగరేణి మాత్రమే. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది.
కార్మికులకు బోనస్
సింగరేణి సంస్థ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎనలేని గౌరవం. అందులో భాగంగానే ఈసారి లాభాల బోనస్లో ఉద్యోగుల పట్ల ప్రేమను చాటుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ఏడాది 32 శాతం లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్‌గా ప్రకటించి అందజేయగా... ఈసారి అంతకంటే ఎక్కువగా 33 శాతం అది కూడా దసరా పండుగకు ముందుగానే కార్మికులకు అందించేలా ప్రకటన చేశారు. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున ఒక లక్షా 90 వేల రూపాయలు బోనస్ అక్టోబర్ 9న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలలో జమకానుంది. భూగర్భంలో డ్యూటీలు ఎక్కువగా చేసిన కేటగిరి ఉద్యోగులకు దాదాపుగా 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రగతిలో సింగరేణి కీలక పాత్ర
రాష్ట్ర ప్రగతిలో తనదైన కీలకపాత్ర పోషిస్తున్నది సింగరేణి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం. సివిల్స్ పరీక్షల్లో మన తెలంగాణ బిడ్డలు సత్తా చాటేలా దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్హత కలిగిన అభ్యర్థులకు లక్ష రూపాయలు ఆర్థికసాయం అందించి వసతి కల్పించడం, మెటీరియల్, ప్రిపరేషన్‌కి ఎలాంటి ఆటంకాలు లేకుండా మెయిన్స్ లోనూ ప్రతిభ కనబరిచి సివిల్స్ లో ర్యాంకు సాధించే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమ అమలుకు సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగానే 135 మందికి సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధుల సమక్షంలో ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను 26 ఆగస్టు 2024న అందజేశారు.
సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహకారం
ఆర్థిక ఆటంకాలు లేకుండా పెద్దసంఖ్యలో తెలంగాణ బిడ్డలు సివిల్ సర్వెంట్స్‌గా ఎంపికై భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేద కుటుంబంలో పుట్టి చదువు కోసం కూలిపని చేస్తూ ఎంతో కష్టపడి తాను స్వయంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు పడ్డ కష్టాలు అనుభవంగా అలాంటి కష్టం మరెవరికీ రావద్దని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం నాయక్ ఆకాంక్షించారు. ఎక్కువ మంది సివిల్స్‌లో విజయం సాధించేలా ప్రోత్సహించే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో సింగరేణి భాగస్వామిగా ఉండటం గర్వించదగిన విషయం.
సామాజిక బాధ్యతగా నిధుల వితరణ
ఇటీవల భారీవర్షాల కారణంగా సంభవించిన వరదలు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలో పంటలు నీట మునగటమేకాక వేలాదిమంది వరదకారణంగా సర్వం కోల్పోయారు. ఎప్పుడు ఎలాంటి విపత్తు జరిగినా అది మన రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడైనా అందరికంటే ముందే ఆదుకునేందుకు నేనున్నానంటూ సింగరేణి సంస్థ ముందుకు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, యూనియన్ ల ప్రతినిధుల సమక్షంలో ఉద్యోగుల తరఫున రూ.10 కోట్ల 25 లక్షలు చెక్కును అందజేసి రాష్ట్రం పట్ల ఉద్యోగుల సామాజిక బాధ్యతను చాటారు సీఎండీ బలరాం నాయక్.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సింగరేణి సామాజిక అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. భద్రాచలం వరదలకు ఫండ్ , రామగుండం మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ. 500 కోట్ల కేటాయింపు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రభుత్వరంగ సంస్థల ప్రాధాన్యతను చాటుతోంది సింగరేణి సంస్థ.
పది నెలల్లోనే 1100 మందికి పర్మినెంట్ ఉద్యోగాలు
ప్రజా ప్రభుత్వ ఏర్పాటు తరువాత మొట్టమొదటగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది సింగరేణి సంస్థ. ఫిబ్రవరి 7, 2024న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావ్ ఇతర సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధుల సమక్షంలో 441 మందికి డిపెండెంట్ ఉద్యోగాల నియామకపత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. నాటి నుంచి నేటివరకు మరో 615 మంది సింగరేణి వారసులకు కారుణ్య నియామకాలు కల్పించింది.
మొత్తంగా 10 నెలల కాలంలోనే దాదాపుగా 1100 మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వారసత్వ విధానంలో కల్పించింది సింగరేణి సంస్థ. కేవలం వారసత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు పెద్దసంఖ్యలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇంటర్నల్ విధానంలో మరిన్ని నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. 599 ఎక్స్టర్నల్ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి చేసి ఫైనల్ సెలెక్టెడ్ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. 1086 మందికి ఇంటర్నల్ విధానంలో పదోన్నతులు కల్పించింది.
- ప్రదీప్ రావ్, సింగరేణి ఉద్యోగి