చంద్రమోహన్ .. ఇంకాస్త హైటు ఉంటే.. ఫేటే మారిపోయేది

తెలుగు చిత్రసీమలో తనదైన అభినయంతో అలరించి, నాటి మేటి నటుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన దర్శకుల హీరో, కథల హీరో. కామెడీ, ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్. ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 932 చిత్రాల్లో నటించారు. హీరోగా, సైడ్ హీరోగా, కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా తనకు లభించిన ప్రతీపాత్రకు న్యాయం చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు. బాపట్లలో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేసిన ఆయన.. అగ్రి కల్చరల్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఎఇవోగా కొంతకాలం ఉద్యోగం చేసి.. సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. దిగ్గజ దర్శకుడు బి.యన్.రెడ్డి ‘రంగులరాట్నం’ చిత్రంతో ఆయన్ను హీరోగా పరిచయం చేశారు. చంద్రశేఖర రావు అనే పేరును మార్చి.. చంద్రమోహన్ అనే పేరు పెట్టింది కూడా ఆయనే. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో సరైన ప్రోత్సాహం లేకపోతే తిరిగి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేయాలనుకున్నారు చంద్రమోహన్. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నందిని కూడా అందుకుంది. దాంతో చంద్రమోహన్‌‌కు మొదటి సినిమాతోనే రావాల్సిన గుర్తింపు వచ్చింది. బాపు దర్శకత్వంలో నటించిన ‘బంగారు పిచుక’తో మరో హిట్ అందుకున్నారు. హీరోగా గుర్తింపు లభించినప్పటికీ, అందివచ్చిన ప్రతిపాత్రలోనూ ఒదిగిపోతూ ముందుకు సాగారు చంద్రమోహన్. 1974లో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ఆయన కెరీర్‌‌‌‌లో మైలురాయిగా నిలిచింది. 1978లో కెరీర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లింది. అదే ఏడాది సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు చంద్రమోహన్.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. 

మొదటి నుంచి జాగ్రత్తపరుడైన చంద్రమోహన్.. కొంతకాలం తర్వాత క్యారెక్టర్ రోల్స్‌‌కు షిప్ట్ అయ్యారు. దాంతో నటుడిగా మరింత బిజీ అయ్యారు. హీరోలకు అన్నగా, బావగా, తండ్రిగా, మామగా నటించి ఆకట్టుకున్నారు. ‘అల్లుడు గారు’ చిత్రంతో కంప్లీట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా మారిన ఆయన.. ఆదిత్య 369, ఆఖరి పోరాటం, కలికాలం, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్యం, ఆమె, కూతురు, పెద్దరికం, గులాబి, చంద్రలేఖ, ఇద్దరు మిత్రులు, నిన్నే పెళ్లాడతా, మన్మథుడు, అతనొక్కడే, 7/జీ బృందావన కాలనీ, మనసంతా నువ్వే, ఢీ, దేశముదురు, పౌర్ణమి, దూకుడు, కింగ్, లౌఖ్యం  లాంటి ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.  నటుడిగా ఆయన చివరి చిత్రం ‘ఆక్సిజన్‌‌’. శరీరం సహకరించినన్ని రోజులు నటించిన ఆయన తరువాత నటనకు దూరంగా ఉన్నారు.

విలక్షణ పాత్రలతో..

హీరోగా నటిస్తూనే.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు చంద్రమోహన్. పదహారేళ్ల వయసు చిత్రంలో నటనకు గాను అనేక ప్రశంసలు అందుకున్నారు. చంద్రం పాత్రలో ఆయన పోషించిన హావభావాలు, శారీరక భాషతో, అద్భుతమైన అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు. పైగా హీరోగా లైమ్‌‌ లైట్‌‌లో ఉన్న సమయంలో ఇలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం సాహసమే.  ‘శుభోదయం’లో పనిదొంగగా, బద్దకానికి నిలువెత్తు నిర్వచనంలా కనిపించే పాత్రలో చంద్రమోహన్ నటనకు పేరొచ్చింది.  ‘బంగారు పిచుక’లో చంద్రమోహన్ చేసిన బంగార్రాజు పాత్ర అప్పటి కుర్రహీరోలకే కాదు.. ఇప్పటి వారికీ ఛాలెంజే. చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో.. మూగ చెవిటి పనివాడిగా చంద్రమోహన్ నటన ఉన్నత శిఖరాలకు ఎక్కింది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే  ‘శంకరాభరణం’ చిత్రంలో చంద్రమోహన్ నటన ఆకట్టుకుంది. ఆమె, 7/జీ బృందావన కాలనీ లాంటి చిత్రాల్లో మధ్యతరగతి తండ్రిగానూ మెప్పించారు.  

కామెడీకి కేరాఫ్‌‌
 
దాదాపుగా 175 చిత్రాల్లో హీరోగా నటించారు చంద్రమోహన్. ఆత్మీయులు, సంబరాల రాంబాబు, తల్లిదండ్రులు, గంగ మంగ, జీవన తరంగాలు, సీతా కల్యాణం, రాధా కల్యాణం, పక్కింటి అమ్మాయి, ఇంటి గుట్టు లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. సోలో హీరోగా చేస్తూనే ఇతర హీరోలతోనూ కలసి పలు చిత్రాల్లో నటించారు. సహాయనటుడిగానూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా కామెడీ క్యారెక్టర్స్ చేయడంలో తనదైన శైలితో మెప్పించారు. రాజేంద్రప్రసాద్‌‌తో కలిసి ఎన్నో కామెడీ చిత్రాల్లో నవ్వులు పూయించారాయన.  ఒకానొక సమయంలో  కామెడీ, ఫ్యామిలీ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచారు. 

స్టార్స్‌‌తో అనుబంధం

కృష్ణ, చంద్రమోహన్ మంచి స్నేహితులు. కెరీర్‌‌‌‌ ప్రారంభంలో ఒకే గదిలో లేకపోయినా తరచుగా కలుస్తుండేవారు. ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే శోభన్ బాబు కూడా మంచి స్నేహితుడు. ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ శోభన్ బాబు సెంటిమెంట్‌‌ కొద్దీ.. కొత్త ఆస్తులు కొన్న ప్రతిసారీ తన దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత ఇచ్చేవారని చంద్రమోహన్ చెప్పేవారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాదాపు 40 సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి యుగపురుషులు, నిండు దంపతులు, ధనమా.. దైవమా లాంటి చిత్రాల్లో నటించారు. 

విశ్వనాథ్, బాలుతో బంధుత్వం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌‌తో పాటు మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా చంద్రమోహన్‌‌కు సమీపబంధువు. వరుసకు ముగ్గురూ అన్నదమ్ములు అవుతారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌‌లో వచ్చిన ‘శంకరాభరణం’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే విశ్వనాథ్ తెరకెక్కించిన సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, ఓ సీతకథ లాంటి చిత్రాలు నటుడిగా చంద్రమోహన్‌‌కు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. తనలోని ప్రతభను బయటకు తీసి అద్భుత నటుడిగా తీర్చిదిద్దింది విశ్వనాథ్ అని గతంలో చెప్పారు చంద్రమోహన్. 1966లో ‘ఆత్మగౌరవం’తో విశ్వనాథ్‌‌ దర్శకుడు అవ్వగా అదే ఏడాది ‘రంగులరాట్నం’తో హీరోగా పరిచయం అయ్యారు చంద్రమోహన్. అంతేకాదు మద్రాసులో పక్కపక్కనే ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విశ్వనాథ్ కన్నుమూయగా, ఇదే ఏడాది చంద్రమోహన్ కూడా వెళ్లిపోయారు. ఇక ‘శ్రీదేవి మూవీస్’ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చంద్రమోహన్‌‌కు మేనల్లుడు. ఆయన నిర్మించిన మొదటి చిత్రం ‘చిన్నోడు పెద్దోడు’లో హీరోగా నటించిన చంద్రమోహన్.. ఆ తర్వాత నిర్మించిన ‘ఆదిత్య 369’లో తెనాలి రామకృష్ణ పాత్రతో ఆకట్టుకున్నారు.

అవార్డులు కంటే ఆదరణ ఎక్కువ 

సిరిసిరి మువ్వ, పదహారేళ్ల వయసు చిత్రాల్లో ఆయన నటనకు  ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడియన్‌‌గా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. తనకు 75 ఏళ్లు వచ్చే వరకు నటనలో కొనసాగాలనుకున్న కోరిక తీరడం తృప్తిగా ఉందని ఇటీవల ఆయన చెప్పారు. ‘పేరు, డబ్బు, రిలేషన్స్ ఏవీ శాశ్వతం కాదు. ఆర్థికంగా జాగ్రత్త పడకపోతే ఎన్నో ఇబ్బందులు పడతాం. పద్మ అవార్డులు, గౌరవ డాక్టరేట్లు వంటివి నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న నటీనటులకే రాలేదు కనుక వాటిపై నాకు ఆసక్తి లేదు. వాటికంటే ప్రేక్షకుల నుంచి ఎనలేని ఆదరణ పొందాననే ఆనందమే ఎక్కువ తృప్తినిచ్చింది’ అని అన్నారు చంద్రమోహన్. ఆయన లేరన్న వార్త  ఆయనను అభిమానించేవారికి తీరని వేదన కలిగించింది. ఆయన నటించిన చిత్రాలు, పోషించిన పాత్రలు చంద్రమోహన్‌‌ను ప్రేక్షకులకు సదా గుర్తు చేస్తూనే ఉంటాయి

లక్కీ ‘మోహన్’

ఇండ్రస్ట్రీలో లక్కీ హీరోగా పేరున్న చంద్రమోహన్‌‌ను జనం లక్కీ మోహన్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనకు జంటగా నటించిన హీరోయిన్స్‌‌ అందరూ ఆ తర్వాత స్టార్‌‌‌‌ హీరోయిన్స్‌‌గా రాణించారు. వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన ఫస్ట్ హీరోయిన్ వాణిశ్రీ.  చంద్రమోహన్ సరసన నటించిన తర్వాత ఆమెకు స్టార్స్‌‌ సరసన అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే చంద్రకళ కూడా.  జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న జయప్రద, 'సహజనటి'గా పేరొందిన జయసుధ, ఆల్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్ గా పేరొందిన శ్రీదేవి, లేడీ అమితాబ్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, స్టార్ హీరోయిన్స్‌‌గా ఆకట్టుకున్న రాధిక, మాధవి లాంటి వాళ్లందరూ.. చంద్రమోహన్‌‌కు జంటగా నటించిన తర్వాతే కెరీర్‌‌‌‌లో స్టార్‌‌‌‌డమ్‌‌ను అందుకున్నారు. వీరిలో జయసుధతో కలిసి 34 చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. 

తమిళంలోనూ.. 

తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ చంద్రమోహన్ నటించారు. అలనాటి తమిళ సూపర్ స్టార్ ఎమ్జీఆర్‌‌‌‌తో కలసి ‘నాలై నమదే’ అనే చిత్రంలో నటించారు. హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన ‘యాదోంకీ బారాత్’కి ఇది రీమేక్. తన కెరీర్‌‌‌‌లోనే ఇది మరపురాని చిత్రం అని ఆయన చెప్పేవారు. అలాగే అప్పటి తమిళ హీరోల్లో శివాజీ గణేషన్ తన ఫేవరేట్ స్టార్ అనే చెప్పేవారు  చంద్రమోహన్‌‌. ఇక తమిళంలో శివకుమార్, భాగ్యరాజా హీరోలుగా నటించిన చిత్రాలు తెలుగులో చంద్రమోహన్ హీరోగా తెరకెక్కాయి.

ఇంకాస్త హైటు ఉంటే..  ఫేటే మారిపోయేది

పొట్టివాడయినా మహా గట్టివాడు అని సినిమా ఇండస్ట్రీలో పేరుపొందారు చంద్రమోహన్. ఇంకాస్త హైటు ఉండి ఉంటే ఆయన ఫేటే మారిపోయేదని ఆయన సమకాలికులు అంటుండేవారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఓ సందర్భంలో ‘చంద్రమోహన్ ఓ ఇంచు ఎత్తుగా ఉన్నా, మమ్మల్నందరినీ అధిగమించేసేవాడు’ అని కితాబునిచ్చారు.