ఇయ్యాల బీపీ మండల్​ జయంతి

దేశంలో 52 శాతానికి పైగా జనాభా కలిగిన ఓబీసీలకు విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో సమాన వాటా కోసం కృషి చేసిన దార్శనికుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్(బీపీ మండల్). బీహార్ లోని ఓ కుగ్రామంలో 1918 ఆగస్టు 25న పుట్టిన ఆయన పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా ఎన్నికవడంతోపాటు బీహార్​రాష్ట్ర సీఎంగా కొంతకాలం సేవలందించారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ పరిస్థితి లేకుండె. కేంద్ర ప్రభుత్వం1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్15(4)ను రాజ్యాంగంలో పొందుపరిచి ఓబీసీల రిజర్వేషన్ల కల్పనకు బీజం వేసింది. జనతా ప్రభుత్వంలో  మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్టికల్ 340 ప్రకారం కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పనపై బీపీ మండల్​అధ్యక్షతన ప్రభుత్వం రెండో జాతీయ బీసీ కమిషన్​ను నియమించింది.

41 సిఫార్సులతో రిపోర్టు

కేంద్రస్థాయిలో 1947 నుంచి 1978 వరకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరగలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి రాజ్యాంగ సవరణ తరువాత ఓబీసీల రిజర్వేషన్ల కల్పనకు ప్రయత్నాలు చేశాయి. కానీ పలు హైకోర్టులు ఓబీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ కొన్ని అంశాలను కారణంగా చూపాయి. వర్టికల్ రిజర్వేషన్లు 50% మించ వద్దని, ఓబీసీ జాబితాల్లో కులాలను చేరుస్తున్నారు కాబట్టి ఓబీసీ రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు కావని తెలుపుతూ కోర్టు తీర్పు ఇచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్15(4), 16(4) ద్వారా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు అనేక అంశాలను, కోర్టు తీర్పులను పరిగణనలోనికి తీసుకొని శాస్త్రీయంగా న్యాయస్థానాల్లో ఓబీసీ రిజర్వేషన్లు వీగిపోకుండా బీపీ మండల్ నివేదికను రూపొందించారు. దేశంలో ఒక కులం ఓబీసీ జాబితాలో చేర్చాలంటే మూడు ప్రమాణాలను అర్హతగా నిర్దేశించారు. సామాజిక వెనుకబాటుకు12 పాయింట్లు, విద్యా వెనుకబాటుకు 4 పాయింట్లు, ఆర్థిక వెనుకబాటుకు 4 పాయింట్లను కేటాయిస్తూ మొత్తం 20 పాయింట్లను వెయిటేజిగా నిర్ధారించారు. మొత్తం ఓబీసీల జనాభాను 52 శాతంగా తేల్చి 3,743 కులాలను ఓబీసీలుగా గుర్తించారు. వీరి జనాభా 52% ఉన్నప్పటికీ న్యాయస్థానాల తీర్పులు దృష్ట్యా వర్టికల్ రిజర్వేషన్లు 50% మించకుండా అప్పటికే అమలుచేస్తున్న ఎస్సీలకు15%, ఎస్టీలకు 7.5% కలిపి మొత్తం రిజర్వేషన్లను 49.5% గా నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ల అమలుతో కలిపి 41 సిఫార్సులు చేస్తూ తుది నివేదికను31 డిసెంబర్ 1980న రాష్ట్రపతికి సమర్పించారు. 

సుప్రీంకోర్టు తీర్పు మండల్ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలని 1980 నుంచి జాతీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కానీ ప్రభుత్వాలు నివేదిక అమలుకు ముందుకు రాలేదు.1989లో జనతాదళ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ 1990 ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. వాటికి బదులుగా మండల్ నివేదికను అమలు చేయాలని ఓబీసీలు కూడా ఉద్యమించారు. చివరికి సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆ ఉత్తర్వును నిలిపివేస్తూ 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఈ కేసును 1992 నవంబర్16న తుది తీర్పు ఇచ్చింది. 27% ఓబీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ అందులో సంపన్నశ్రేణి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు1993 నుంచి అమలవుతున్నాయి. మండల్ కమిషన్ నివేదికలోని మరో సిఫార్సు అయిన కేంద్రీయ విద్యాసంస్థల్లో 27% ఓబీసీ రిజర్వేషన్లను2008 నుంచి అమలు చేస్తున్నారు. మండల్ కమిషన్ నివేదికపై సుప్రీం వెలువరించిన తీర్పు చరిత్రాత్మక మైంది. ఇలా ఓబీసీల రిజర్వేషన్ల కల్పనలో బీపీ మండల్​చేసిన కృషి అనిర్వచనీయమైనది.

- కోడెపాక కుమార స్వామి,
రాష్ట్ర అధ్యక్షులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం