అడవుల నరికివేత వల్ల జీవవైవిధ్యం క్షీణించడం, జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల గిరిజనులు నిరాశ్రయులు కావడం, వారి సంస్కృతి దెబ్బతినడం, అణు విద్యుత్ కేంద్రాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం, సెజ్‌ల వల్ల పంట భూములు క్షీణించి ఆహార కొరత ఏర్పడటం, పారిశ్రామికీకరణ వల్ల నీరు, నేల, గాలి కలుషితం కావడం పర్యావరణ ఉద్యమాలకు కారణాలయ్యాయి.
సైలెంట్ వ్యాలీ రక్షణ ఉద్యమం
ఈ ఉద్యమం కూడా 1973లో ప్రారంభమైంది. సైలెంట్ వ్యాలీ అనేది కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న సతతహరిత ఉష్ణమండల అటవీ ప్రాంతం. పెరియార్ నదికి ఉపనది అయిన కథిపుజాపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల అనేక అరుదైన మొక్కలు, జంతు జాతులు అంతరించిపోతాయని, పర్యావరణ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ప్రాంతాన్ని 1985లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌గా ప్రకటించారు. అయినా ఉద్యమం, వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
బలియాపాల్ ఉద్యమం
ఇది ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో నేషనల్ టెస్టింగ్ రేంజ్(ఎన్టీఆర్) క్షిపణుల పరీక్షా కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు.
అప్పికో ఉద్యమం
ఇది చిప్కో ఉద్యమం తరహాలో అడవుల సంరక్షణ కోసం కర్ణాటకలోని ఉత్తర కన్న జిల్లా సాల్కానిలో 1983లో ప్రారంభమైంది. పాండురంగ హెగ్డే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కన్నడంలో అప్పికో అంటే హత్తుకోవడం అని అర్థం.
నవధాన్య ఉద్యమం
ఈ ఉద్యమాన్ని వందనా శివ 1982లో ప్రారంభించారు. జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ ఉద్యమ లక్ష్యం.
డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్: ఆర్థిక, సామాజిక, పర్యావరణ సుస్థిరత కోసం 1983లో అశోక్ ఖోస్లా అనే వ్యక్తి ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాలను అందించారు.
బిష్ణోయి ఉద్యమం
ఇది భారతదేశంలో జరిగిన తొలి పర్యావరణ ఉద్యమంగా చరిత్రకెక్కింది. 1730లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఖెజార్లీ లేదా ఖెజాడ్లి గ్రామానికి చెందిన అమృతాదేవి నాయకత్వంలో 363 మంది ఖేజ్రి అనే వృక్షాలను రక్షించడం కోసం ప్రాణాలను అర్పించారు. బిష్ణోయి కమ్యూనిటీ ప్రజలకు ఖేజ్రీ వృక్షాలు ఎంతో పవిత్రమైనవి. అయితే, అప్పటి మార్వాడ్ నాయకత్వంలోని బిష్ణోయి ప్రజలు చెట్లను నరకకుండా వాటిని కౌగిలించుకుని అడ్డుకున్నారు. ఆగ్రహించిన సైనికులు అమృతాదేవి, ఆమె ముగ్గురు కూతుళ్లతోపాటు 363 మందిని నరికి చంపారు. ఈ ఘటనతో నిశ్చేష్టులైన మార్వాడ్ పాలకుడు అభయ్‌సింగ్ అప్పటి నుంచి బిష్ణోయి గ్రామాల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధించారు. ఈ ఉద్యమం భారతదేశంలో జరిగిన మొదటి చిప్కో ఉద్యమంగా పేరుగాంచింది.
నర్మదా బచావో ఆందోళన
ఈ ఉద్యమాన్ని 1989లో మేధా పాట్కర్ ప్రారంభించారు. నర్మదా నదిపై గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ అనే బహుళార్థ సాధక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్నది. నర్మదా నది గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రవహిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని కలిగిస్తూ ఈ నదిపై చేపట్టే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్నది. మేధాపాట్కర్తోపాటు బాబా ఆమ్టే, అరుంధతీరాయ్ వంటి ప్రముఖులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు.
చిప్కో ఉద్యమం
ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రారంభమైంది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ప్రారంభమైన చిప్కో ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. చిప్కో అంటే కౌగిలించుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతకు నిరసనగా, వృక్షాలను కౌగిలించుకుని కాపాడుకున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ఉద్యమంలో ప్రముఖ నాయకులు సుందర్‌లాల్ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్ భట్ పాల్గొన్నారు.
జంగిల్ బచావ్ ఆందోళన్
ఇది 1980లో బిహార్‌లో ప్రారంభమై జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించింది. బిహార్ ప్రభుత్వం అడవుల్లో ఉండే సాలు వృక్షాల స్థానంలో టేకు వృక్షాలను నాటాలని ప్రయత్నించడంతో సింగ్భమ్ జిల్లాకు చెందిన గిరిజనులు సాలు వృక్షాలను నరకకుండా వాటిని హత్తుకుని, నిరసన తెలిపి ఉద్యమం ప్రారంభించారు.
అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమాలు
తమిళనాడు తీర ప్రాంతంలో రష్యా సహకారంతో నిర్మించిన కుడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2002లో తమిళనాడు రాష్ట్రంలోని తరునల్వేలి జిల్లాలో ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తమిళనాడు,
కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు అందిస్తారు.
కారణాలు
- ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అణు విపత్తులు సంభవించినప్పుడు అక్కడి పరిసర ప్రాంతాల్లోని స్థానికులను తరలించడం చాలా కష్టం. అక్కడి మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోతారు.
- అణు వ్యర్థాలను నిర్వహించే పద్ధతి వాతావరణ కాలుష్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ కారణాల వల్ల పర్యావరణవాదులు, స్థానికులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ పీపుల్స్ మూవ్మెంట్ అగెనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ(పీఎంఏఎన్‌ఈ).
- ఈ సంస్థ కన్వీనర్ ఎస్.పి.ఉదయ్ కుమార్.
- కుడంకులం అణు విద్యుత్ కేంద్రంలో భద్రతా చర్యలను స్వతంత్రంగా అధ్యయనం చేయాలని అంతవరకు ఈ ప్రాజెక్టులో అణువిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని 2011లో సుప్రీంకోర్టులో పిల్ వేశారు. కానీ సుప్రీంకోర్టు ప్రజా అవసరాల దృష్ట్యా కుడంకులం ప్రాజెక్టులో అణువిద్యుత్ ఉత్పత్తి జరపాలని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 2013లో అణువిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
- గంగా పరిరక్షణ ఉద్యమం : స్వచ్ఛమైన గంగా నది కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు, సాధువులు, సామాజిక కార్యకర్తలు ప్రారంభించిన ఉద్యమం. ఈ ఉద్యమానికి గంగా సేవా అభియాన్ వంటి సంస్థలు మద్దతుగా ఉన్నాయి.