బుద్ధుడు ఎనలైట్మెంట్ పొందిన బిహార్లోఆధునిక కాలంలో మరొక ఉపాలి జన్మించాడు. అతడే 'జననాయక్ కర్పూరి ఠాకూర్. వర్గ, కుల అసమానతలతో నిండిన ప్రపంచాన్ని మార్చి, దుఃఖరహిత సమాజాన్ని నిర్మించడానికి ఆ మహనీయుడు తన జీవితాన్ని అంకితం చేశాడు. జనవరి 24, 1924లో బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా పితౌజి గ్రామం (నేటి కర్పూరి గ్రామ్ ) నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుంచే దేశభక్తిని చాటి
చెప్పాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీ, రామ్ మనోహర్ లోహియా, ఎం ఎన్ రాయ్ లాంటి జాతీయ నేతలతో కలిసి పోరాడాడు. స్వాత్రంత్ర్యం సిద్ధించిన అనంతరం దేశసేవకే తన జీవితాన్ని సమర్పించాడు పేద, అణగారిన వర్గాలకు అనేక విధాల సేవలందించి, ఆత్మగౌరవ విలువను, నిజాయతీగా జీవించటంలోని ఔన్నత్యాన్ని ప్రబోధించాడు. అందుకే కర్పూరి ఠాకూర్ దేశమంతా “జననాయక్” అని కీర్తించింది. ఆయన రెఫెరెన్సుతో మన సమకాలీన పరిస్థితులను విశ్లేషించుకోవాలి. ఆయన వ్యక్తిత్వం నుంచి నేటి పాలకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సామాజిక నేపథ్యం ఒక శాపంగా వెంటాడే దుస్థితి నేటికీ వుంది. సాంఘిక పరిస్థితులు సహకరించకపోయినా కూడా, అయన విద్యను ఒక సాధనంగా చేసుకుని ఎదిగాడు. సోషలిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, పేద ప్రజలెదుర్కొంటున్న సమస్యల మూలాలను తెలుసుకొన్నాడు. కర్పూరి ఠాకూర్ జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న కాలంలో కుల సమస్యల మీద బాబా సాహెబ్ అంబేద్కర్, ఉత్తరాదిలో మంగురామ్, అచ్యుతానంద్ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతున్నాయి. కర్పూరి ఠాకూర్ లోహియాకు సన్నిహితుడయ్యాడు.
కర్పూరి ఫార్ములా
స్వాతంత్ర్యానంతరం భారతదేశం మీద కర్పూరిఠాకూర్ ప్రభావం ఎంతవుంది. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఒక హక్కుగా ఇవ్వబడ్డాయి. అయితే, చాలా రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్స్ కల్పించడానికి సిద్ధంగా లేని రోజులవి. 1950లోనే బీసీ రిజర్వేషన్స్ విషయమై మొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పటికీ, ఒక్క తమిళనాడు తప్ప మరే రాష్ట్రంలో బీసీలకు విద్యా , ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించలేదు. కానీ, 1977లో కర్పూరీ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక బిహార్లో బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేశాడు. మహిళా రిజర్వేషన్స్ అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి ఆయన. కర్పూరి ఆలోచనను ‘కర్పూరి ఫార్ములా’ అని రాజకీయవేత్తలంతా ప్రశంసించారు.
అంటే , రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇరవై ఐదు యేండ్ల తర్వాత బిహార్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయి. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నపుడు విద్య, ఉద్యోగ కల్పన మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. వేలాది మంది ఇంజినీరింగ్ పట్టభద్రులకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పించాడు. బిహార్లో నిజమైన రాజకీయ ప్రగతి సాధించడానికిగాను బీసీ కులాల నుంచి నాయకులను తయారు చేశాడు . జయప్రకాశ్ నారాయణ్ తో కలిసి పని చేసే రోజుల్లో విద్యార్థి నాయకులుగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి వాళ్ళను నాయకులుగా తయారు చేశాడు.
బీసీలకు, స్త్రీలకు రిజర్వేషన్లు
1977లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక సమన్యాయ ఆలోచనలకు కార్యరూపం తెచ్చాడు . బీసీలకు, స్త్రీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాడు. 1978లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ రిజర్వేషన్ల పట్ల తన పార్టీలోని అగ్రకుల నాయకులు వ్యతికేకించినా, వాళ్ల అసంతృప్తిని లెక్కచేయకుండా తన వర్గ ప్రజల కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకు ఆయన పదవి కూడా కోల్పోయాడు. ముఖ్యమంత్రి పదవి పోయినా విచారించలేదు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆచరించి బతికాడు. సుదీర్ఘకాలంపాటు బిహార్ రాజకీయాలను, దేశరాజకీయాలను ప్రభావితం చేశాడు. సమర్థవంతుడైన పాలకుడిగా, ప్రజాహిత పాలకుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందాడు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని గౌరవించటమే ఇందుకు సాక్ష్యం. అధికార దుర్వినియోగానికి ఎప్పుడూ పాల్పడలేదు. అవినీతి మచ్చలేని గొప్పనాయకుడు. దేశానికి ఎంతో సేవ చేసినా కూడా కనీస గౌరవం దక్కని బహుజనులకు గొప్ప గౌరవాన్ని , ఆత్మాభిమానాన్ని , రాజకీయ చైతన్యాన్ని కర్పూరి కల్పించాడు. రాజకీయ క్షేత్రంలో విశేషమైన కీర్తిని కల్గించాడు. సమాజాన్ని ప్రభావితం చేసిన కర్పూరి ఠాకూర్‌ను, ఆయన సేవలను గౌరవించాలి.
జననాయక్ కర్పూరి ఠాకూర్
కర్పూరి ఠాకూర్‌ను "జననాయక్ " అని పిలుచుకోవడానికి ప్రజలతో ఆయనకుండే సన్నిహిత సంబంధాలే కారణం. సామాన్యులతో సామాన్యుడిగా వుండే జీవితం ఆయనది. ఆయన్ని కలవడానికి ప్రజలు తన ఇంటికి వస్తూనే ఉండేవాళ్లు . పోలీసుల కాపలా , పర్సనల్ సెక్రటరీల ప్రమేయం ఉండేదికాదు. రాత్రుళ్లు ఆయనకోసం ఎదురు చూస్తూ , అయన ఇంట్లోనే వండుకొని తిని అయన పడుకొనే గదిలోని మంచంమీదే సామాన్య ప్రజలు నిద్రపోయేవాళ్లు. మీటింగ్‌లు అటెండ్ చేసి ఇంటికొచ్చిన ఆయన తన గదిలో మంచం మీద పడుకున్నవాళ్లను లేపకుండా వేరేగదిలో పడుకునేవారు.
ఈ విషయం కళ్ళారా చూసిన యశ్వంత్ సిన్హా.. కర్పూరి నిరాడంబర జీవితాన్ని పొగిడాడు. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో యశ్వంత్ సిన్హా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకోవడానికి సామాన్య ప్రజలను దాటి వెళ్లడం ఆయనకు చాలా కష్టంగా ఉండేదని, కర్పూరిని రహస్య ప్రాంతంలో ఉంచి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకొనే ప్రయత్నం చేసినా, అక్కడికి కూడా ప్రజలు తెలుసుకొని వచ్చే వాళ్ళని యశ్వంత్ సిన్హా ఒక వ్యాసంలో రాశాడు. ఆ తర్వాత యశ్వంత్ సిన్హా రాజకీయాల్లోకి రావడానికి కర్పూరి ఠాకూర్ ప్రేరణ కారణమని కూడా ఆయన రాశాడు.
- డా. కె. లక్ష్మణ్, ఎంపీ ( రాజ్యసభ )