సమిష్టి బాధ్యతతోనే మానవ హక్కులకు రక్షణ

ఈ సమస్త సృష్టిలో అన్ని జీవరాశులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అయితే ఇతర జీవుల కంటే భిన్నంగా, సక్రమమైన పద్ధతిలో జీవించాలనే ధ్యేయంతో మనిషి కొన్ని నిబంధనలు  ఏర్పరచుకున్నాడు. ఈ నిబంధనల వల్ల మానవ సమాజంలో  తోటి మనుషులు ఇబ్బంది పడకుండా మనుగడ సాగిస్తున్నాడు. మానవుడు సంఘ జీవి, సమాజంతో సంబంధం లేకుండా మనుగడ సాగించడం దుస్సాధ్యం. స్వేచ్ఛగా జీవించడం, ఒకరి స్వేచ్ఛ మరొకరికి ఇబ్బందికరంగా మారకుండా ప్రవర్తించడానికి వివిధ దేశాలు ఆయా దేశాలకు అనుగుణమైన రాజ్యాంగాలు  రూపొందించారు. అయితే  కొన్ని దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఉగ్రవాదం పేరుతో కొన్ని సంస్థలు, ప్రజల్లో తిరుగుబాటును అణచి వేయడానికి కొన్ని ప్రభుత్వాలు మానవ హక్కులను హరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మారాలి. మనిషి జీవించడానికి ఉన్న అన్ని హక్కులను పరిరక్షించాలి. ప్రతీ వ్యక్తికి జన్మతః కొన్ని హక్కులు సహజంగా ప్రాప్తిస్తాయి. వాటిని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ప్రతీ ఒక్కరికీ రంగు, జాతి, కుల, మత, దేశ, ప్రాంత, భాష, లింగభేదం లేకుండా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ఇతరులకు ఇబ్బంది లేకుండా జీవించే హక్కులున్నాయి. ఇవే మానవ హక్కులు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ విశ్వ మానవ హక్కుల తీర్మానాన్ని1948 డిసెంబర్10న ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదించిన డిసెంబర్10 వ తేదీని ‘అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం’గా ఏటా జరుపుకుంటున్నాం.

ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం

అసమానతలు తగ్గించి, సకల మానవ హక్కులతో, సమానత్వంతో జనజీవన స్రవంతిలో మమేకమై జీవించడమే మానవ హక్కుల దినోత్సవ ప్రధాన ఉద్దేశం. భారత దేశంలో1994 నుంచి మానవ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లో ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను కాపాడగలిగితే అదే నిజమైన మానవ హక్కుల పరిరక్షణగా భావించవచ్చు. మానవ హక్కులతో కూడిన ఆర్థిక వ్యవస్థ పేదరిక నిర్మూలనకు నిజమైన మార్గం. సమాజంలో ఉండే ప్రతీ ఒక్కరు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో జీవించినప్పుడే మానవ జీవితాలకు సార్థకత. స్వేచ్ఛ అనేది కేవలం వ్యక్తిగతమైనదే కాదు, సంఘంతో ముడి పడి ఉన్న అంశం కూడా. మన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఇతరులకు ఇబ్బందిగా మారితే అలాంటి స్వేచ్ఛకు అర్థం లేదు. అలాంటి స్వేచ్ఛ సమాజానికే గొడ్డలి పెట్టు లాంటిది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం, హక్కుల కోసం దేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. వాటి ఫలితంగానే  భారతదేశం లాంటి అనేక దేశాలు పరాయి దేశాల పీడన నుంచి విముక్తి చెందాయి. ప్రతీ దేశం తమ దేశంలోని ప్రజల మనోభీష్టాలకు, సక్రమ పాలనకు అనుగుణంగా రాజ్యాంగ రూపంలో కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయి. 

ఐక్యరాజ్య సమితి తీరు ఇలాగేనా?

ఉగ్రవాదుల బెడదతో నిరంతరం బాధపడుతున్న భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితి గానీ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు గానీ ఏనాడు సరిగా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా మానవహక్కులను కాలరాస్తున్నారంటూ చాలా కాలం మానవ హక్కుల సంఘాలు భారత్ పై విమర్శలు చేశాయి. అగ్రరాజ్యాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఐక్యరాజ్య సమితి స్పందన పేలవంగా ఉంటున్నది. అగ్రరాజ్యాల నిధులతో మనుగడ సాగించాలనే దృక్పథం వల్లో, భయం వల్లో అది వాటి జోలికి పెద్దగా పోవడం లేదు. కొన్ని దేశాల గుప్పిట్లో ఐక్యరాజ్యసమితి కీలుబొమ్మగా మారడం దురదృష్టకరం. ప్రతీ ఒక్కరూ చట్టాలను గౌరవించాలి. లేదంటే సమాంతర ప్రభుత్వాలు పుడతాయి. అలాంటి పరిస్థితి చాలా ప్రమాదకరం. చట్టపరిధిలోనే, రాజ్యాంగానికి లోబడి అన్ని సమస్యలు పరిష్కరింపబడాలి. న్యాయం కోసం సుదీర్ఘ నిరీక్షణ మంచిది కాదు. కాలయాపన వల్ల ప్రజల్లో ఓపిక నశించి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. చట్టవిరుద్ధ చర్యల వల్ల అమాయకులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల ప్రతీ సమస్యకు రాజ్యాంగ పరిధికి లోబడి ఆమోదయోగ్యమైన ముగింపు పలకాలి. తక్షణ పరిష్కారం  చట్టపరిధిలోనే  జరగాలి. 

హక్కులను కాపాడని ఆర్భాటాలు వృథా..

మానవ హక్కుల సందేశాలు, అనునయన వాక్యాలు బాధిత హృదయాలకు సాంత్వన చేకూర్చలేవు. బాధితులకు సకాలంలో న్యాయం అందినప్పుడే చట్టాలపట్ల ప్రజలకు గౌరవం పెరుగుతుంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలు మానవ హక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత ‘ఆంగ్ సాన్ సూకీ’ కి  నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించడం మానవ హక్కుల భక్షణకు నిదర్శనం. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఇలాంటి చర్యలను నిలువరించకుండా మానవ హక్కుల దినోత్సవాల పేరిట చేసే ఆర్భాటాలు ప్రహసనప్రాయంగా మారతాయి. అఫ్ఘాన్ లో తాలిబాన్ల పాలనకు చరమగీతం పాడాలి. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం పరిసమాప్తి కావాలి. యుద్ధాల వల్ల మానవ హక్కులు హరించబడుతున్నాయి. ప్రపంచ ప్రజలంతా వారికి ఉన్న హక్కులతో స్వేచ్ఛగా జీవించే వాతావరణం నెలకొల్పాలి.

అణచివేత వల్ల హక్కులకు భంగం

భారతదేశం లాంటి భిన్న వైరుధ్యాలు గల దేశాల్లో రాజ్యాంగం నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కొంత కష్టతరమైన పనే. అయినప్పటికీ మన దేశంలోని మేధావుల వలన, ప్రాచీన కాలం నుంచీ వస్తున్న సంస్కారం, సహనం వంటి భావాల వల్ల రాజ్యాంగం చాలా వరకు సరిగానే అమలు అవుతున్నది. దేశంలో కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. భిన్నమతాలు, భిన్న కులాలు, విభిన్న సంస్కృతుల సమాహారమైన దేశంలో స్వల్ప సంఘర్షణలు సహజం. అనేక దేశాల్లో యుద్ధం, నేరాలు, రాజ్యహింస, రాజకీయ కక్షల వల్ల చాలా మంది వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోతున్నారు. అణచివేత, లింగవివక్ష, అవిద్య, అనాగరిక పద్ధతుల వల్ల, మూర్ఖ భావజాలం వల్ల కూడా చాలా మంది తమకున్న హక్కులను కోల్పోతున్నారు. 

సుంకవల్లి సత్తిరాజు,
సోషల్ ​ఎనలిస్ట్