అవకాశం వచ్చిందంటే సిద్ధాంతాలను తుంగలో తొక్కి, పేద ప్రజల పక్షాన కొట్లాడే స్ఫూర్తిని గాలికొదిలి, అధికారం కోసం అర్రులు చాచే నాయకులను ఎంతో మందిని చూస్తున్నాం. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, శ్రమజీవుల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడే నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో రావి నారాయణ రెడ్డి ఒకరు. నిజాం ప్రభుత్వ అరాచక, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ గ్రామీణ రైతులలో, శ్రమజీవులలో చైతన్యం కలిగించిన ప్రజానాయకుడు ఆయన. తెలంగాణ ప్రాంత స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. రజాకార్ల వెన్నులో వణుకుపుట్టించిన ధీరుడు. ఆయన సంఘ సంస్కర్త, ప్రజాస్వామికవాది కూడా. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు, నిర్మాణానికి నారాయణ రెడ్డి గణనీయమైన కృషి చేశారు. నల్గొండ జిల్లాలోని బొల్లెపల్లి అనే గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో1908 జూన్4న పుట్టిన నారాయణ రెడ్డి, హైదరాబాద్‌లోని చాదర్ఘాట్ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, నిజాం కాలేజీలో చదువుకున్నారు.
హరిజన సేవా సంఘం
కాలేజీ రోజుల్లో ‘మాస్కో డైలాగ్స్’, ‘సోషలిజం ఎందుకు’ లాంటి గ్రంథాలు చదివిన నారాయణ రెడ్డి స్టూడెంట్లీడర్ గా ఎదిగారు. 1927–28 మధ్యకాలంలో ప్రజల నుంచి పెత్తందార్లు చేసే బలవంతపు వసూళ్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతుగా కాకినాడ వెళ్లి, అక్కడి సత్యాగ్రహ శిబిరంలో తన వంతు సహకారం అందించాడు. 1931లో ‘హరిజన సేవా సంఘం’ స్థాపంచి, దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లో గాంధీజీతో కలిసి ధనికుల నుంచి జన సేవా సంఘ నిధులు సమకూర్చారు. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో నెలకొల్పిన ఆ సంస్థ ద్వారా సంస్థానంలో అస్పృశ్యత నివారణ, హరిజన పాఠశాలలు నిర్వహణ, వసతి గృహాల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
ఆంధ్రమహాసభ నాయకుడిగా..
1938లో హైదరాబాద్సంస్థానంలో రాష్ట్ర కాంగ్రెస్‌పై నిషేధం తొలించాలని డిమాండ్‌చేస్తూ, ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి సత్యాగ్రహం చేసిన వారిలో నారాయణ రెడ్డి ఒకరు. జైలుకెళ్లిన తొలివ్యక్తిగానూ ఆయన గుర్తింపు పొందారు. 1941లో నల్గొండ జిల్లాలో ఎనిమిదో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆయన అధ్యక్షుడిగా ఉండగానే ఆంధ్రమహాసభ నియమావళిలో అనేక మార్పులు జరిగాయి.1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. ఈ మహాసభలోనే అతివాద, మితవాద వర్గాల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రావి నారాయణ రెడ్డి ఆంధ్రమహాసభ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన గ్రామ గ్రామాన పర్యటిస్తూ ఒక గొప్ప విస్తృతమైన రాజకీయ వేదికగా దాన్ని తీర్చిదిద్దారు.
నేటికీ అసమానతలు
1946లో నిజాం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బావుటాలెగురవేసి సాధారణ ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజానాయకుడు రావి నారాయణ రెడ్డి. నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించగా, అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటం చేశారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 1957లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ‘‘వీర తెలంగాణ నా అనుభవాలు– జ్ఞాపకాలు’ అనే గ్రంథాన్ని 1976లో ప్రచురించారు. దేశ ప్రజలకు ఉత్తమ స్థాయి జీవితం, సమన్యాయం, ప్రజాస్వామ్య పాలన, సోషలిస్టు సమాజం ఏర్పడాలని జీవితాంతం పోరాడిన నారాయణ రెడ్డి 1991 సెప్టెంబర్7న తుదిశ్వాస వదిలారు. ఆర్థిక, సామాజిక అసమానతలు ఇంకా తొలగిపోలేదు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- గంటా జలంధర్‌రెడ్డి,అధ్యక్షులు, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి