తెలుగు లోగిళ్ళలో ఉగాది ఆనందోత్సవం

తెలుగు లోగిళ్ళలో ఉగాది ఆనందోత్సవం

తెలుగు ప్రజల లోగిళ్ళలో ఆనంద ఉత్సవంతో,  సకల సంతోషాలతో  జరుపుకునే సంబురం ఉగాది.  నూతన  విశ్వావసు నామ సంవత్సరానికి హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుదాం. ఈ తెలుగు నూతన సంవత్సరాదినే తెలుగు ప్రజలు  ఉగాది  పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాలుగా 60 సంవత్సరాలను ఒక కాల చక్రంగా మన పూర్వీకులు  పరిగణించారు. ఇలాంటి  కాలచక్రాలు కొన్ని వందలసార్లు పరిభ్రమిస్తే ఒక యుగం పూర్తి అవుతుంది. 

 ప్రస్తుతం నడుస్తున్న కలియుగం 7200 చక్రాలను కలిగి ఉంది.  కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. సూర్య సంచారాన్ని అనుసరించి క్షణాలు, నిమిషాలు, గంటలు, పగలు, రాత్రి, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలుగా కాల గణన జరిగింది.శుభాకాంక్షలతో కాలస్వరూపుడైన ఆ పరమాత్ముని ధ్యానిస్తూ,  ఈ ‘యుగాది’రోజున కార్యక్రమాలను ఆరంభించడం శ్రేయోదాయకం అని మన పూర్వకాల చరిత్ర  చెపుతున్నది. 

నూతన సంవత్సర ఆరంభ వేళ ప్రారంభించే  ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని మన తెలుగువారి నమ్మకం. మంచి భావనతో,  మంచి సంకల్పంతో,  మంచి ఆకాంక్షలతో  ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ‘యుగాది’ అనేది సంస్కృత పదం ఇది కాల క్రమేణా ఇది 'ఉగాది’గా  రూపాంతరం చెందినది. 

ఉగాదినే కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు.  యుగ+ఆది అంటే యుగం ప్రారంభం అని దాన్నే యుగాది లేదా ఉగాది అని  కొందరు అంటారు.  కానీ, ఉగాది అంటే అసలు అర్థం అది కాదు.  ఉగ అంటే నక్షత్ర గమనం.  నక్షత్ర గమనానికి ప్రారంభం కాబట్టే ఉగ+ఆది = ఉగాది అయ్యింది.  అంటే సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది అంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాదిని జరుపుకోవాలి. 

కాల ప్రయాణం అనంతం

కాలం ఆద్యంతం రహితమైనది. అయినప్పటికీ  మన పూర్వీకులు కాల గణనను ఒక నిర్దిష్టమైన మార్గంలో చేశారు.  ధర్మం నడవడిక ఆధారంగా యుగాలను  4 భాగాలుగా విభజించారు. 1.కృతయుగం. 2.త్రేతాయుగం.  3.ద్వాపరయుగం. 4.కలియుగం.  ఈ నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహా యుగాలు 71 గడిస్తే అది ఒక మనువు పరిపాలనా కాలం క్రిందకు వస్తుంది. దానినే మనం ‘మన్వంతరం’ అంటాం.ఉగాది ప్రసాద శ్లోకం ఈ విధంగా ఉంటుంది. 

‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం’. ఉగాది నాడు ఈ శ్లోకం చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.  వేపపూతతో  కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ,  నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం. అదేవిధంగా  ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గూర్చి  ఒక  శ్లోకం ఉంది.  ‘అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేస్యా తద్వర్షం సౌఖ్యదాయకమ్’ ఉగాదినాడు  వేపపూత,  పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే కాలం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం. 

పంచాంగ శ్రవణం

వేదాలను హరించిన సోమకుడుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి.   చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను.  కనుక సృష్టి  ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటామని కూడా చెపుతారు.  

అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యేరోజు కనుక, కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారని ఉగాది రోజున తలంటు స్నానం చేసి, కొత్త సంవత్సరాది  స్తోత్రాన్ని పఠించి, ఉగాది పచ్చడి సేవించి, ధ్వజారోహణం  
( పూర్ణకుంభదానం) చేసి, ఆపై పంచాంగ శ్రవణంతో  పంచకృత్య నిర్వహణ చేయాలి.  ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లోనూ, పురాణాల్లోనూ పేర్కొననందున మీకు ఇష్టమైన దేవుడిని కొలుచుకోవచ్చు.  

ఉగాది పచ్చడి 

ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం ఉగాది పచ్చడి.  షడ్రుచుల మేళవింపు.  తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది.  తెలుగు ప్రజలు తరతరాలుగా ఈ సనాతన ధర్మంను నమ్ముతూ ప్రతి తెలుగు ఇల్లు నేడు ఉగాది పండుగను  ప్రతి ఏడు వచ్చే పండుగల్లో  తొలి పండుగగా భావిస్తారు.

అత్యంత భక్తిశ్రద్దలతో హైందవ ఆచార వ్యవహారంతో కుటుంబం అంతా సంతోషంతో ఈ పండుగను నిర్వహించడం శ్రేష్ఠమైన విషయం.  ముందు తరానికి తెలుగు ప్రజల గౌరవప్రదమైన ఆచార వ్యవహారాలు,  సంస్కృతీ సంప్రదాయాలను అందించడం ప్రతి ఏడు ఆనవాయితీగా వస్తున్నది.    విశ్వావసు నామ సంవత్సరం సందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.

-తిపిరిశెట్టి శ్రీనివాస్​ గోత్రాల, 
సీనియర్​ జర్నలిస్ట్​