![హైదరాబాద్ దర్శన్ పేరుతో సేవలు](https://static.v6velugu.com/uploads/2022/09/Special-buses-for-city-coach-tourists-in-Hyderabad_74m30HyOSj.jpg)
బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీని చూడటానికి వచ్చే టూరిస్టుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీలోని పర్యాటక ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా షెడ్యూల్ రెడీ చేసింది. టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ దర్శన్ పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను మంగళవారం సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధ న్, ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం శని, ఆదివారాల్లో మాత్రమే ఈ సేవలు కొనసాగుతాయని, ఆదరణ పెరిగితే మిగతా రోజుల్లో కూడా విస్తరిస్తామని తెలిపారు. ఈ ప్యాకేజీ టూర్ కోసం www.tsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని, మరింత సమాచారం కోసం 040 23450033, 040 69440000 సంప్రదించాలని వారు సూచించారు. కాగా, అంతకుముందు గత 100 రోజుల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన 650 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులను ఆర్టీసీ కళాభవన్‌లో బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్‌లు సన్మానించారు.
కార్మికులు, అధికారుల కృషితో ఆర్టీసీలో నష్టాలు తగ్గించుకుంటున్నామని గోవర్ధన్ అన్నారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమంపై కూడా తాము దృష్టి సారించామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో 60 శాతం ఆర్టీసీలు ప్రైవేట్ పరం అయ్యాయని, మన రాష్ట్రంలో సంస్థను బతికించుకోవాలనే ఆశతో అందరం కష్టపడుతున్నట్లు తెలిపారు. గత 6 నెలలుగా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతోందని ఎండీ సజ్జనార్ అన్నారు. రాఖీ పౌర్ణమి రోజున రూ.21 కోట్ల ఆదాయం సాధించి, రికార్డును నెలకొల్పామని చెప్పారు. ఈ విజయం సమష్టి కృషితోనే సాధ్యమైందని చెప్పారు. ఉద్యోగుల కోసం తార్నాక హాస్పిటల్‌ను కార్పొరేట్ తరహాలో రెనోవేషన్ చేశామని, వచ్చే నవంబర్‌లో హెల్త్ చెక్ అప్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.