- ఆర్టీసీపై రివ్యూ మీటింగ్లో ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామన్నారు. శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఎండీ వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం, శబరిమల యాత్ర, మహిళలకు ఫ్రీ బస్సు తదితర అంశాలపై చర్చించారు. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలకు, శబరిమలకు భక్తులు ఎక్కువగా వెళతారని తెలిపారు. అందువల్ల వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.