నవంబర్​ 9,10న ఓటర్ల నమోదుకు స్పెషల్​ క్యాంపెయిన్​

నవంబర్​ 9,10న ఓటర్ల నమోదుకు  స్పెషల్​ క్యాంపెయిన్​
  • డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం 3.34 కోట్ల ఓటర్లు
  • 4.14 లక్షల ఓటర్లు తొలగింపు 
  • 8 లక్షల కొత్త ఓటర్లు నమోదు: సీఈఓ

ఓటర్ల నమోదుకు ఈ నెల 9,10న స్పెషల్  క్యాంపెయిన్  నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి తెలిపారు. గత నెల 29న డ్రాఫ్ట్  ఓటర్ల జాబితా రిలీజ్​ చేశామని, దీని ప్రకారం రాష్ట్రంలో 3.34 కోట్ల ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. డ్రాఫ్ట్​ ఓటర్ల జాబితాపై ఈ నెల 28 వరకు  అభ్యంతరాలను స్వీకరిస్తామని, జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.  బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్ లలో అందుబాటులో ఉండాలని సూచించారు.  శనివారం బీఆర్ కే  భవన్ లో మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.

 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 4.14 లక్షల ఓట్లను తొలగించామని, అదే సమయంలో 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని, ప్రస్తుతం 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.  టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటుహక్కు లేదని స్పష్టం చేశారు. 
    
హైదరాబాద్ లో అత్యధిక తొలగింపులు...

ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ఓట్లను హైదరాబాద్  జిల్లాలో తొలగించారు. ఈ జిల్లాలో 1,29,880 ఓట్లను తొలగించారు. ఇందులో 7,730 మంది చనిపోయారని.. 22,677 ఓటర్లు 2అంతకన్నా ఎక్కువసార్లు ఓటర్లుగా ఉన్నారని, మరో 99,379 మంది షిప్ట్  అయ్యారని ఎన్నికల సంఘం వెల్లడించింది. 

రంగారెడ్డి జిల్లాలో 58,120, మేడ్చల్ లో 34,680, కరీంనగర్ జిల్లాలో 21,463, నల్గొండ జిల్లాలో 12,956 ఓట్లను తొలగించారు. కొత్త ఓట్ల నమోదులోనూ హైదరాబాద్  జిల్లా ముందుంది. ఈ జిల్లాలో 1.81లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయ్యారు. రంగా రెడ్డి జిల్లాలో 1.18 లక్షల మంది, మేడ్చల్  జిల్లాలో 99,696 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.