
- కార్మికులు హక్కులతోపాటు బాధ్యతలు తెలుసుకోవాలి
- స్టేట్ లేబర్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్
బషీర్బాగ్, వెలుగు: ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించి, ప్రమాదాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కర్మాగారాల శాఖ, తెలంగాణ జాతీయ భద్రతా కౌన్సిల్ చాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన జాతీయ భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాణం, విద్యుత్, ఉత్పత్తి తదితర రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు హక్కులతో పాటు భద్రతాపరమైన బాధ్యతలు కూడా తెలుసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ కర్మాగారాల ప్రతినిధులు, సిబ్బందితో భద్రతా ప్రమాణం చేయించారు. వివిధ సంస్థలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రాష్ట్ర కర్మాగారాల శాఖ డైరెక్టర్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ చైర్మన్ బి. రాజ్ గోపాల్ రావుతో కలిసి అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. అలాగే వ్యాస రచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రమాదాలు, భద్రతపై కార్మికుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది .