హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడంలో కంపెనీల ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌ఓ) పాత్ర కీలకంగా ఉందని రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ పేర్కొన్నారు. రాష్ట్రాలు అందించే ఇన్సెంటివ్‌లను పరిశీలించే బాధ్యత వీరిదేనని అన్నారు. చాలా వరకు అన్ని రాష్ట్రాలు ఇన్సెంటివ్‌లను, ఆర్థిక ప్యాకేజిలను అందిస్తున్నాయని, తమ కంపెనీకి ఏ రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలు సరిపోతాయో సీఎఫ్‌ఓలు నిర్ణయిస్తారని బుధవారం జరిగిన సీఐఐ కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు.
ఈ కాన్‌క్లేవ్‌లో ‘కొత్త శకంలో సీఎఫ్‌ఓల పాత్ర’ పై నిపుణులు చర్చించారు. ఈ ఈవెంట్‌లో ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, సీఐఐ తెలంగాణ కన్వీనర్ ఎం వీ నరసింహం, సీఐఐ తెలంగాణ చైర్మన్ డీ సాయి ప్రసాద్, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ ఆర్‌ఎస్ రెడ్డి పాల్గొన్నారు.