
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో పాస్ పర్సెంటేజీ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇటీవల రిలీజైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రత్యేక క్లాసులు ప్రారంభం కాగా.. త్వరలోనే అన్ని కాలేజీల్లో మొదలు కానున్నాయి. కొందరు లెక్చరర్లు ఆన్‌లైన్‌లో క్లాసులు తీస్కుంటున్నారు.
పేద విద్యార్థులను ప్రోత్సహించేలా..
ఇంటర్ ఫలితాల్లో సర్కారు జూనియర్ కాలేజీల్లోనే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. జనరల్ కేటగిరీలో ఫస్టియర్‌లో 68,100 మంది పరీక్షలు రాస్తే 28,937 (42.49%) మంది మాత్రమే పాస్ కాగా, సెకండియర్‌లో 74,161 మందికి 39,630 (53.44%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ లెక్కన ఫస్టియర్‌లో దాదాపు 57శాతం, సెకండియర్‌లో 42శాతం మంది ఫెయిల్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునేవారికి ప్రత్యేకంగా తర్పీదు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇంటర్మీడియెట్ అధికారులు సర్కారు కాలేజీల ప్రిన్సిపల్స్‌తో సమావేశమై, స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. పేద విద్యార్థులు పాస్ అయ్యేలా వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో ఫెయిలైన విద్యార్థులకు, ఇంప్రూవ్ మెంట్ రాసే స్టూడెంట్లకు
స్పెషల్ క్లాసులు ప్రారంభించారు.
ఒక సబ్జెక్టు ఫెయిలైనవాళ్లపై మరింత ఫోకస్
అధికారులు ప్రధానంగా సెకండియర్ స్టూడెంట్లపై ఫోకస్ పెట్టారు. అందులోనూ ఒకే సబ్జెక్టు ఫెయిలైనవాళ్లను స్పెషల్ క్లాసులు వినేలా చూస్కోవాలని ఇంటర్ కమిషరేట్ అధికారులు కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో లెక్చరర్లు వారిని వచ్చే నెల 22 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.
ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను.. ఆయా సబ్జెక్టు లెక్చరర్లు ఫాలో అప్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీఐఈవోలు ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలిచ్చారు. పలు కాలేజీల్లో ఉదయం నుంచి మధ్యాహ్నందాకా క్లాసులు నిర్వహిస్తుండగా, కొన్ని కాలేజీలు సాయంత్రంవరకు తీస్కుంటున్నాయి. మరోపక్క అందుబాటులో లెక్చరర్లు లేకపోతే జూమ్‌లో, వర్చువల్ ద్వారా స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. పలు కాలేజీల్లో మాత్రం ఇంటర్మీడియెట్ కమిషనరేట్ నుంచి ఇప్పటికీ అధికారికంగా ఉత్తర్వులు రాలేదని, దీంతో క్లాసులు ప్రారంభించలేదని చెప్తున్నారు.