గడ్డి కాల్చుడు ఆపుడెట్ల
కమిటీని నియమించిన సుప్రీం కోర్టు
రిటైర్డ్ సుప్రీం జడ్జి జస్టిస్ లోకూర్ నేతృత్వంలో ఏర్పాటు
సొలిసిటర్ జనరల్ అభ్యంతరం.. తోసిపుచ్చిన కోర్టు
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పంట పొలాల్లో గడ్డి కాల్చివేతను ఆపడానికి సుప్రీంకోర్టు వన్ మ్యాన్ ప్యానెల్ ను నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. గడ్డి కాల్చివేతను గుర్తించడంలో కమిటీకి నేషనల్ క్యాడెట్ కోర్, నేషనల్ సర్వీస్ స్కీమ్, భారత్ స్కౌట్స్ బృందాలు సాయం చేయాలంది. కోర్టు అపాయింట్చేసిన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీతో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు లోకూర్ ప్యానెల్‌కు ఫీల్డ్ విజిట్‌కు సహకరించాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకోసారి కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. పొల్యూషన్ లేని గాలిని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల జనం పీల్చుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పింది. స్టబుల్ బర్నింగ్‌పై ఆదిత్యా దుబే అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఢిల్లీ గాలి కాలుష్యానికి 40శాతం పంట వ్యర్థాల కాల్చివేతే కారణమని పిటిషనర్ చెప్పారు. ఎయిర్‌పొల్యూషన్ వల్ల కరోనా ఎక్కువవుతుందని హార్వర్డ్ వర్సిటీ చేసిన స్టడీని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. కమిటీని నియమించింది. కమిటీ ఏర్పాటుపై కేంద్రం, రాష్ట్రాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. మెహతా కామెంట్స్‌ను కోర్టు తోసిపుచ్చింది. కమిటీకి తాము మరీ ఎక్కువ అధికారాలేం ఇవ్వలేదని చెప్పింది. సంబంధిత రాష్ట్రాలు లోకూర్‌కు సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టు, ఇతర సెక్రటేరియల్ వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈపీసీఏతో పాటు మిగతా అధికారులు లోకూర్‌కు రిపోర్టు అందించాలంది. తీర్పును అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది.
For More News..