మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో విశ్వ బ్రాహ్మణులకు స్పెషల్ కోర్సు ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విశ్వకర్మల శ్రమ లేకుండా విశ్వంలో ఏ పనీ జరగదన్నారు. స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెడతామని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. కరీంనగర్ లోనూ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలం గుర్తించాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
టీ ఫైబర్ నెట్వర్క్ ను విస్తరిస్తాం..
రాష్ట్రంలోని 8 వేల గ్రామాలకు టీ ఫైబర్ నెట్ వర్క్ పూర్తయిందని, మరో 3 వేల గ్రామాలకు విస్తరించాల్సి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ దీని కోసం రూ.529 కోట్లు రాష్ట్ర సర్కారు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక లోపాలను గుర్తించి అన్ని గ్రామాలకు విస్తరిస్తామని తెలిపారు. దేశంలో సాంకేతికతను తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీ భర్తగా ఆయన విగ్రహం ఏర్పాటు చేశామని, విగ్రహం అక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. అమిత్ షా మెప్పు కోసం బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రాతో రాష్ట్ర వనరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.