హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ స్మగ్లింగ్, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. సర్కార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. డ్రగ్స్‌తో పాటు రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలని పోలీసులను సీఎం ఆదేశించారు.
‘‘గత ప్రభుత్వంలో డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి అధికారి వరకు రాజకీయ ఒత్తిడి, రాజకీయ ఆదేశాల మేరకు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. కానీ మా ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ వారి సమర్థతను బట్టి హోదా ఇచ్చాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా నియమాకాలు జరిపాం.
ఈ మధ్య నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు ఆర్థిక నేరాలు, హత్యలు, అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగిణించేవాళ్లం.కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్, డ్రగ్స్ భారీగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది అత్యంత తీవ్రమైన నేరంగా మారనుంది. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. బీటెక్, ఎంటెక్ చదివిన వారిని పిక్ చేసి వారిని డేటా అనాలసిస్ చేసే విధంగా అవసరమైన శిక్షణ ఇవ్వాలి.
మాదకద్రవ్యాలను నివారించేందుకు స్కూల్స్, కాలేజీల్లో అవగాహన గల టీచర్స్‌ను నియమించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలకు కూడా మాదకద్రవ్యాల నివారణపై బాధ్యత ఉండాలి. డ్రగ్స్ కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. డ్రగ్స్, సైబర్ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. ఆరు నెలల లోపే కోర్టులు తీర్పు వెల్లడించేలా ప్రణాళికలు రూపొందిస్తాం” అని తెలిపారు.
క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదు..
ఎవరైనా స్టేషన్ కు వచ్చి హడావిడి చేస్తే ఊరుకోవద్దని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు.. ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసులే.
అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనే వారు కూడా పోలీసులే. కొద్దిమంది పోలీసుల వ్యవహారం మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్‌తో కాదు.. పోలీస్ పేరు వినిపిస్తేనే క్రిమినల్స్ భయపడేలా చేయండి. కొంతమంది డాబూదర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చి హడావిడి చేస్తున్నారు. అలాంటి వారిని సక్కగ బొక్కల వెయ్యండి” అని ఆదేశించారు.