- యాదాద్రికి 15 స్పెషల్ బస్సుల్లో
- వెయ్యిమందిని తరలించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
- నేరుగా గుట్టపైకి వాహనాలు.. వీఐపీ దర్శనాలు
యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టీఆర్ఎస్ నానా ప్రయత్నాలు చేస్తున్నది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఇన్చార్జ్గా ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాదాపు వెయ్యి మంది ఓటర్లను ప్రత్యేక బస్సుల్లో యాదాద్రికి తీసుకెళ్లి.. స్పెషల్ దర్శనాలు చేయించారు. రూల్స్‌ను బ్రేక్ చేసి నేరుగా కొండపైకి ఆ బస్సులను తరలించారు. జీవన్‌రెడ్డి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతున్నది. దండు మల్కాపురం గ్రామంలో 2 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 1,000 మందిని యాదగిరిగుట్టకు తరలించడానికి హయత్‌నగర్ డిపోకు చెందిన 15 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుక్ చేశారు. ఓటర్లకు ఏర్పాట్ల కోసం ఓ పార్చున్ వెహికల్‌ను ఎస్కార్ట్‌గా పెట్టారు. గురువారం ఉదయం గ్రామంలో ఓటర్లను బస్సుల్లో ఎక్కించి.. వారితో జీవన్‌రెడ్డి ఫొటోలు కూడా దిగారు.
నిబంధనల ప్రకారం యాదగిరి గుట్టకు వచ్చిన భక్తులు స్థానికంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సుల్లోనే కొండపైకి వెళ్లాలి. కానీ, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఓటర్లతో వచ్చిన బస్సులు మాత్రం నేరుగా కొండపైకి వెళ్లాయి. దాదాపు వెయ్యి మందిని 150 రూపాయల వీఐపీ లైన్లో తీసుకెళ్లి.. స్పెషల్ దర్శనాలు చేయించారు. దర్శనం అనంతరం అందరికీ అన్నదాన సత్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నదానం జరుగుతున్న ప్రాంతానికి మీడియా ప్రతినిధులు వెళ్లి ఫొటోలు తీస్తుండగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డే ఇక్కడికి తీసుకువచ్చారని పలువురు ఓటర్లు మీడియాకు తెలిపారు.