 for the upper caste poor in AP..Also Special corporations for the welfare of Jains and Sikhs as well_WKdugMECzV.jpg)
- శాఖ పరిధిలోకి రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కాపు, క్షత్రియ కార్పొరేషన్లు
- జైనులు, సిక్కుల సంక్షేమానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్లు
అమరావతి: ఆర్ధికంగా వెనుకబడిపోయిన అగ్రవర్ణాల్లోని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుక బడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలున్నారని, వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక కష్టాలుపడుతున్నారని వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలోనే ప్రస్తావించారు. వారిని ఆదుకునే విషయం ఆలోచిస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ఏం చేయాలనే విషయంపై ఉన్నతాధికారులతో అధ్యయనం చేయించారు. సూచనలు తీసుకుని సమాలోచనలు చేసి ఆచరణలోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.
లాంఛనాలన్నీ పూర్తి కావడంతో బుధవారం ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు తదితర కార్పొరేషన్లను తీసుకువచ్చారు. అలాగే వీరితోపాటు రాష్ట్రంలో జైనులు, సిక్కులు తరతరాలుగా ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. వారికి ఇక్కడే స్థిర నివాసాలు, వ్యాపార, ఉపాధి అవకాశాలు ఉండడంతో ఇక్కడే ఉండిపోయారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అల్ప సంఖ్యాక వర్గమైన వీరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జైనులు, సిక్కుల కోసం కూడా ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.