చాలామందికి మిల్లెట్స్ తినాలనే ఆశ ఉంటుంది. కానీ, రొటీన్‌గా కాకుండా ఎలా వండుకుని తింటే గుంటుందో తెలియక వాటి జోలికి వెళ్లరు. ఇంకొందరికి ఆకు కూరలంటే అస్సలు పడదు. ఈ రెండు రకాల వాళ్లకు నచ్చేలా... నోటికి రుచిని ఇచ్చి, ఒంటిని ఆరోగ్యంగా ఉంచే ది బెస్ట్ రెసిపీలు ఇవి. మిల్లెట్స్, ఆకుకూరల కాంబినేషన్‌తో అదిరిపోయే వంటలు ఈవారం స్పెషల్.
అరికెలు - గోంగూర పులిహోర
కావాల్సినవి :
అరికెలు - ఒక కప్పు, నీళ్లు - రెండు కప్పులు
గోంగూర - ఒక కప్పు, చింతపండు గుజ్జు - అర కప్పు
రసం పొడి - మూడు టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
తాటి బెల్లం సిరప్ (రెడీమేడ్) - ఐదు టీస్పూన్లు
ఇంగువ - చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
నూనె - ఒక టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
ఆవాలు, నువ్వులు, మిరియాలు, శనగపప్పు - ఒక్కో టీస్పూన్
పల్లీలు - పావు కప్పు, పచ్చిమిర్చి - మూడు
తయారీ : అరికెల్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఎనిమిది గంటలసేపు నానబెట్టాలి. వంటచేసే ముందు నానబెట్టిన అరికెల్లో ఒక స్పూన్ నూనె వేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టిన మిల్లెట్స్‌ని ఉడికించాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి గోంగూరని ఉడికించాలి. అది కాస్త ఉడికాక పసుపు వేసి చింతపండు గుజ్జు పోసి కలపాలి. అందులో నీళ్లు పోసి ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రసం పొడి వేసి కలపాలి. తాటి బెల్లం సిరప్, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మిశ్రమం దగ్గర పడేవరకు ఉడికించాలి. (ఈ మిశ్రమం నెల రోజులు నిల్వ ఉంటుంది.)ఒక పాన్‌లో నువ్వులు, మిరియాలు విడివిడిగా వేగించాలి. చల్లారాక రెండింటినీ కలిపి పొడి చేయాలి. తర్వాత అదే పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. ఉడికించిన మిల్లెట్స్‌లో తయారుచేసిన గోంగూర మిశ్రమం కలిపి తాలింపు వేయాలి. ఉప్పు సరిపడా వేసుకుని బాగా కలిపితే అరికెలతో గోంగూర పులిహోర రెడీ.
తోటకూర - మిల్లెట్ పకోడి
కావాల్సినవి :
ఉల్లిగడ్డ తరుగు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
వాము, ఉప్పు, కారం - ఒక్కో టీస్పూన్
తోటకూర - రెండు కప్పులు
సామల పిండి - ముప్పావు కప్పు
శనగపిండి - పావు కప్పు
తయారీ : ఒక గిన్నెలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, వాము, ఉప్పు, కారం వేసి కలపాలి. అందులో తోటకూర, సామల పిండి, శనగపిండి వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. అందులో నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ పకోడీ పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి కలిపిన పిండితో పకోడీలుగా వేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తే పకోడీలు రెడీ.
జొన్న – పాలకూర క్యూబ్స్
కావాల్సినవి :
పెసరపప్పు - ఒక కప్పు
శనగపప్పు - అర కప్పు
పచ్చిమిర్చి - ఎనిమిది
అల్లం - ఒక ముక్క, వెల్లుల్లి రెబ్బలు - పదిహేను
కరివేపాకు - కొంచెం, జీలకర్ర - ఒక టీస్పూన్
ఉప్పు - సరిపడా, పాలకూర - రెండు కప్పులు
కొత్తిమీర - ఒక కప్పు, వాము - అర టీస్పూన్
ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో పెసరపప్పు, శనగ పప్పు వేసి కడిగి, నీళ్లు పోసి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో వాము, పాలకూర, కొత్తిమీర తరుగు, ఎండుమిర్చి తునకలు, పసుపు వేసి కలపాలి. అవన్నీ కలిశాక, అందులోనే జొన్న పిండి కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న ప్లేట్లోకి తీసి సమంగా పరిచి ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి. అది ఉడికాక, బయటకు తీసి క్యూబ్స్‌లా కట్ చేయాలి. ఆ క్యూబ్స్‌ని నూనె పూసిన పెనం మీద వేగించాలి.
రాగి - గ్రీన్ రొట్టె
కావాల్సినవి :
రాగి పిండి - రెండు కప్పులు
జీలకర్ర, నువ్వులు - ఒక టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - సరిపడా
పాలకూర, మెంతికూర, దిల్ ఆకులు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, నీళ్లు - ఒక్కోటి అర కప్పు చొప్పున
తయారీ : రాగిపిండి, జీలకర్ర, నువ్వులు, ఇంగువ, ఉప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగులను ఒక గిన్నెలో వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మరోసారి కలపాలి. పాన్‌లో నీళ్లు పోసి వేడిచేయాలి. ఆ నీళ్లను రాగిపిండి మిశ్రమంలో పోసి ముద్దగా కలపాలి. ఆ ముద్దను చిన్న ఉండల్లా చేయాలి. నూనె పూసిన బటర్ లేదా ప్లాస్టిక్ పేపర్ మీద ఉండను పెట్టి రొట్టెలా చేత్తో అదమాలి. ఆ రొట్టెకు అక్కడక్కడా చిన్న రంధ్రాలు చేయాలి. పాన్ వేడి చేసి దానిపై రొట్టె వేసి రెండువైపులా నూనెతో బాగా కాల్చాలి.
మునగాకు - మిల్లెట్ బిర్యానీ
కావాల్సినవి :
కొర్రలు, మునగాకు - ఒక్కో కప్పు చొప్పున
నీళ్లు - రెండు కప్పులు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
లవంగాలు - మూడు
దాల్చిన చెక్క - ఒకటి
యాలకులు - రెండు
షాజీరా - పావు టీస్పూన్
ఉల్లిగడ్డ, టొమాటో, క్యారెట్ - ఒక్కోటి
అల్లం- వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - మూడు
పుదీనా - కొంచెం
ఉప్పు - సరిపడా
పసుపు - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
బిర్యానీ ఆకు - ఒకటి
నిమ్మరసం - ఒక టీస్పూన్
తయారీ : కొర్రల్ని శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి నాలుగ్గంటలు నానబెట్టాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేగించాలి. అందులో పొడవుగా కట్ చేసి ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, మునగాకు ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. మునగాకు ఉడికాక అందులో టొమాటో, క్యారెట్ తరుగు, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి కలపాలి. చివరిగా నానబెట్టిన కొర్రల్ని నీళ్లతో సహా వేసి కలపాలి. ఉడికేటప్పుడు నిమ్మరసం చల్లాలి. మూతపెట్టి తక్కువ మంట మీద పదినిమిషాలు ఉంచితే వేడి వేడి మునగాకు–మిల్లెట్ బిర్యానీ తినేందుకు రెడీ.