మిషన్​భగీరథపై స్పెషల్ డ్రైవ్..వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు

మిషన్​భగీరథపై స్పెషల్ డ్రైవ్..వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు
  • డీపీవో నుంచి నీటి సహాయకుల దాకా పది రోజులు ఫీల్డ్​లోనే! 
  • సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
  • భగీరథ నీళ్లు అందని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • బ‌‌‌‌ల్క్ నీటి స‌‌‌‌ప్లై బాధ్యతలు గ్రిడ్  ఇంజినీర్లకు..
  • ఇంటింటికీ న‌‌‌‌ల్లానీటి స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా బాధ్యత ఇంట్రా ఇంజినీర్లకు
  • ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తవద్దని మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. క్షేత్ర స్థాయిలో మిషన్  భగీరథ స్కీంలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, మిషన్  భగీరథ లేని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనే రెండు లక్ష్యాలతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్  డ్రైవ్​ చేపడ్తున్నారు. 

ఈ నెల 10 వరకు పది రోజుల పాటు కొనసాగనున్న ఈ స్పెషల్​ డ్రైవ్ లో భాగంగా డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలు, విలేజ్ సెక్రటరీలు, సీఈలు, ఏఈఈలు, గ్రామస్థాయిలో కార్యదర్శులు, నీటి సహాయకులు ట్రంక్ లైన్లతో పాటు ట్యాంకులు, ఇంట్రా విలేజీ పైపులైన్లను తనిఖీ చేస్తారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య గుర్తిస్తే అక్కడిక్కడే పరిష్కరిస్తారు. 

ఎక్కడైనా పెద్ద సమస్య ఉన్నా, భగీరథ సిస్టమే లేకున్నా ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు. గ్రామ స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో పాటు భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

దీంతోపాటు రాష్ట్రంలో మిషన్​ భగీరథ నీళ్లు ఎన్ని ఆవాసాలకు చేరుతున్నాయి? ఎంతమంది ఆ నీళ్లు తాగుతున్నారు?  ఇంకా నల్లా కనెక్షన్​ లేని ఆవాసాలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ మిషన్​ భగీరథ నీళ్లు అందని పక్షంలో గ్రామాల్లో ప్రత్యమ్నాయంగా తాగునీరు అందించేందుకు ఎన్ని బోర్లు ఉన్నాయి? 

అందులో పనిచేస్తున్నవి ఎన్ని? ప్రైవేట్ బోర్లు, వ్యవసాయ బోర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే వివరాలు కూడా లెక్కతీస్తున్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే  ప్రభుత్వం సమ్మర్​ డ్రింకింగ్​ ప్లాన్​ రూపొందిస్తుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

భగీరథ లేని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24,459 ఆవాసాలకు భగీరథ నీరు సరఫరా అవుతోంది. మరో 1,059 ఆవాసాల్లో మిష‌‌‌‌న్  భ‌‌‌‌గీర‌‌‌‌థ‌‌‌‌ వ్యవస్థ  లేదు. ప్రస్తుతం 861 హాబిటేషన్స్​కు పొరుగు గ్రామాల నుంచి,  ప్రైవేటు బోర్ల నుంచి వాటర్​ సప్లై చేస్తున్నారు. మిగిలిన 198 హాబిటేషన్స్ లో  కొత్త బోర్లు వేయాలని ప్లాన్​చేస్తున్నారు. అప్పటిదాకా ట్యాంక‌‌‌‌ర్ల తో నీటిని త‌‌‌‌ర‌‌‌‌లించాలని భావిస్తున్నారు. 

మిషన్​ భగీరథతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 57,601 హ్యాండ్ పంపులు, 47,126 సింగ‌‌‌‌ల్  ఫేస్ మోట‌‌‌‌ర్లు, 7,354 ఓపెన్  వెల్స్  అందుబాటులో ఉన్నాయి. గత సర్కారు వీటన్నింటినీ పక్కనపెట్టగా, కాంగ్రెస్​ సర్కారు వచ్చాక గతేడాది నుంచి హ్యాండ్​పంపులు, ఓపెన్​వెల్స్​కు రిపేర్లు చేయిస్తూ అందుబాటులోకి తెస్తోంది.

తాజాగా వాటి పరిస్థితిపై  రిపోర్ట్​ తీసుకుంటోంది. ఆ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేసి రిపేర్లు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు భగీర‌‌‌‌థ సోర్స్ పాయింట్లు, రిజ‌‌‌‌ర్వాయర్లలో నీటి నిల్వలను నిరంత‌‌‌‌రం ప‌‌‌‌ర్యవేక్షించేలా ఆఫీసర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తోంది. 

ప్రతీ గ్రామానికి బ‌‌‌‌ల్క్ నీటి స‌‌‌‌ప్లై బాధ్యతలను గ్రిడ్ ఇంజినీర్లు, ఇంటింటికీ న‌‌‌‌ల్లానీరు స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేసే బాధ్యతను ఇంట్రా ఇంజినీర్లు పర్యవేక్షించాలని ఆదేశించింది. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే గతేడాదిలాగే ప్రైవేట్ బోర్లను కూడా అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో గతంలో రెంట్​కు తీసుకున్న బావులు, బోర్ల యజమానులతో ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. 

 తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు..

వేసవిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. ఇప్పటికే అధికారులతో పలుమార్లు రివ్యూ నిర్వహించాం. పది రోజుల పాటు భగీరథపై సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. 

గ్రామాల్లో అధికారులు పర్యటించి తాగు నీటి సమస్యలు తెలుసుకోవడంతో పాటు మిషన్  భగీరథ నీళ్లపై నమ్మకం కలిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. భగీరథ నీళ్లు వెళ్లని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 

- సీతక్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి