ఖమ్మం టౌన్, వెలుగు : ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఖమ్మం నగరంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను గురువారం ఆయన మీడియాకు చూపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించిన వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధిస్తున్నామని చెప్పారు. లైసెన్సు లేకుండా వెహికల్ నడిపినా, నంబర్ ప్లేట్ సరిగా లేకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మోహన్ బాబు, ఎస్సై రవి, సాగర్ పాల్గొన్నారు.