- 14 నుంచి షురూ చేసేందుకు బల్దియా ప్లాన్
- ప్రతి వార్డుకు రెండు వాహనాలు కేటాయింపు
- 20 రోజుల పాటు కొనసాగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న వేస్టేజీని తరలించేందుకు జీహెచ్ఎంసీ ఈ నెల14 నుంచి స్పెషల్ డ్రైవ్మొదలుపెట్టబోతోంది. 20 రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇండ్లలో పాడైన సోఫాలు, పరుపులు, వాడిపారేసిన టైర్లు ఇతర వస్తువులను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఇందుకోసం గ్రేటర్ లోని 150 వార్డుల్లో 300 వెహికల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా కాలనీలకు వచ్చే ముందు స్థానిక శానిటేషన్ కార్మికులతో సమాచారం ఇస్తారు.
వరద సాఫీగా వెళ్లకపోవడంతో..
పనికిరాని వస్తులను కొందరు నాలాలతో, కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. దీనివల్ల వానల టైంలో వరద నీరు సాఫీగా వెళ్లక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్‌డ్రైవ్ ప్లాన్చేసింది. మొన్న నిర్వహించిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెత్త సమస్యపై సీరియస్ అయ్యారు.
దీంతో ఎవరూ రోడ్లపై చెత్త వేయవద్దని, అందరూ ఇంటింటికి వచ్చే స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే వేయాలని అధికారులు కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై వేస్తున్న చెత్తను మధ్యాహ్నం కూడా తరలిస్తున్నారు. తాజాగా రెగ్యులర్యాక్టివిటీస్తోపాటు స్పెషల్ డ్రైవ్ తో పెద్ద ఎత్తున చెత్తను తరలించాలని ప్లాన్చేశారు.