
పాత్రికేయ రంగంలోనే కాదు.. చిత్ర పరిశ్రమలోనూ రామోజీరావుకు సుస్థిర స్థానం ఉంది. అనేక రంగాల్లో విజయాలను చూసిన ఆయన 1983లో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించి అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. బ్యానర్ లోగోతో పాటు వచ్చే ‘ఉషా కిరణాలు’ అనే పాట ఎంతో పాపులర్. ఆ పాటలోని లిరిక్స్ తరహాలోనే ఆయన నిర్మించిన చిత్రాలు ఎంతోమందిని చైతన్యపరిచాయి. ఎందరో కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ జీవితాలకు బంగారు బాట వేశాయి. కథకు ప్రాధాన్యతను ఇచ్చే చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు రామోజీరావు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ బాషల్లో 87 చిత్రాలను నిర్మించారు రామోజీరావు. 1984లో వచ్చిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంతో నిర్మాతగా ఆయన తొలిఅడుగు వేశారు. ఈ చిత్రంతో నరేష్‌ను హీరోగా పరిచయం చేశారు. జంధ్యాల దర్శకత్వంలో ‘ప్రేమ లేఖ’ అనే నవలను సినిమాగా రూపొందించారు. లవ్, రొమాన్స్, కామెడీ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. అలాగే అప్పటివరకు ఎక్కువగా హాస్య క్యారెక్టర్స్ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ను ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
ఎంతోమందికి గోల్డెన్ హ్యాండ్
జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. వి ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు ఈ మూవీని నిర్మించారు. ప్రేమికురాలి కోసం ఎంతదూరమైనా వెళ్లే ప్రేమికుడిగా ఇందులో ఎన్టీఆర్ నటన అందర్నీ ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్‌ను కూడా హీరోగా పరిచయం చేసింది ఆయనే. ‘తొలి చూపులోనే’ చిత్రంతో కళ్యాణ్ రామ్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు.
ఈ చిత్రానికి కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా పరుచూరి బ్రదర్స్ కథతో పాటు డైలాగ్స్‌ను అందించారు. రామోజీరావు టాలీవుడ్‌కు పరిచయం చేసిన చాలామంది హీరోయిన్స్‌లో జెనీ లియా, శ్రేయా ఉన్నారు. ‘ఇష్టం’ మూవీతో శ్రేయాను తెలుగు తెరకు పరిచయం చేయగా, ‘నువ్వే కావాలి’ హిందీ రీమేక్ ‘తుజే మేరీ కసమ్’ చిత్రంతో జెనీలియాను హిందీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే చిత్రంతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను కూడా రామోజీరావు పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత రితేష్, జెనీలియా పెళ్లి చేసుకున్నారు.
కొత్తవారికి బాసటగా..
అనుకుంటే స్టార్ హీరోలతోనూ రామోజీరావు చిత్రాలను నిర్మించగలరు. కానీ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ.. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనుకునేవారు రామోజీరావు. తరుణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. యువతను ఆకట్టుకునే కథాంశంతో ‘నువ్వే కావాలి’ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. ఉదయ్ కిరణ్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో రామోజీరావు మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు.
అంతా కొత్త వారితో నిర్మించిన ఈ చిత్రానికి రామోజీరావు మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. ఆకాష్‌ను హీరోగా పరిచయం చేసిన చిత్రం ‘ఆనందం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం అప్పట్లో డీసెంట్ హిట్ అందుకుంది. ఆకాష్‌ను ఓవర్ నైట్ స్టార్‌ను చేసిందీ ఈ చిత్రం. విజయ్ దేవరకొండను ఫస్ట్ తెరపై చూపించిన చిత్రం ‘నువ్విలా’. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రాన్ని రవి బాబు డైరెక్ట్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న తనీష్‌ను ‘నచ్చావులే’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు.
చైతన్య దీపాలు..
తొలిచిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఘన విజయం తర్వాత కాంచన గంగ, సుందరి సుబ్బారావు అనే చిత్రాలు నిర్మించిన రామోజీరావు.. ‘మయూరి’ చిత్రంతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో ఉషా కిరణ్ మూవీస్ ముందుంటుందని ప్రూవ్ చేశారు. డ్యాన్సర్ సుధా చంద్రన్ జీవిత కథను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుని ‘మయూరి’ చిత్రాన్ని నిర్మించారు. యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయి, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించారామె. ఆ పాత్రను సుధా చంద్రన్‌తోనే చేయించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. నిజ జీవిత కథలను కూడా సినిమా తీసి సూపర్ సక్సెస్ చేయొచ్చని ఈ చిత్రం నిరూపించింది.
తిమిర సంహరణాలు
‘ప్రతిఘటన’ లాంటి సందేశాత్మక చిత్రాన్ని కూడా ఖర్చుకు వెనుకాడకుండా తీసి కమర్షియల్ హిట్ అందుకున్నారు రామోజీరావు. ఈ చిత్రంలోని విజయశాంతి పాత్ర ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రౌడీయిజాన్ని ఎదిరించే లెక్చరర్ పాత్రలో విజయశాంతి నటించిన తీరు, టి.కృష్ణ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని విజయ పథంవైపు తీసుకెళ్లింది. 1985లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మలయాళ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేశారు. ‘మయూరి’ తరహాలో మరో రియల్ లైఫ్ స్టోరీ ‘మౌన పోరాటం’. ఒడిశాలో జరిగిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ పోరాటాన్ని ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు. అశ్వని బయోగ్రఫీగా రూపొందించిన చిత్రం ‘అశ్వని’. ఈ చిత్రంలో అశ్వనినే మెయిన్ లీడ్‌గా నటించేలా ఒప్పించారు రామోజీరావు. అథ్లెట్‌గా ఉన్న అశ్వినీ నాచప్పను నటిగా వెండితెరపై వెలిగేలా చేశారు. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది.
దర్శకధీరుడి ప్రస్థానం
సినిమాలతో పాటు ఎన్నో డైలీ సీరియల్స్‌ను నిర్మించారు రామోజీరావు. సీరియల్స్‌తోనూ ఎంతోమంది టాలెంట్‌ను టీవీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన అవకాశం అందించిన వారిలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఉన్నారు. ఈటీవీ కోసం రాఘవేంద్రరావు నిర్మించిన ‘శాంతి నివాసం’ అనే తెలుగు డైలీ సీరియల్‌ను రాజమౌళి డైరెక్ట్ చేశారు.తేజ, పీపుల్స్ ఎన్‌కౌంటర్, మెకానిక్ మామయ్య, ఆకాశ వీధిలో, మూడుముక్కలాట, వీధి, బెట్టింగ్ బంగార్రాజు లాంటి అనేక చిత్రాలను రామోజీరావు నిర్మించారు. ఇక ఆయన చివరిగా 2015లో ‘దాగుడుమూత దండాకోర్’ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్‌లో పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఆర్ కె మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు.
కొత్త టాలెంట్‌కు కేరాఫ్
నటీనటులను మాత్రమే కాదు ఆయన బ్యానర్ ద్వారా, షోల ద్వారా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్ట ర్లు, సింగ ర్స్‌ను కూడా టాలీవుడ్‌లోకి తీసుకొచ్చారు రామోజీ రావు. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న కీరవాణి.. ముందుగా ఉషాకిరణ్ మూవీస్‌లోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతే కాకుండా దర్శకుడు తేజను నమ్మి ఆయనను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు ఆయన సినిమాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మించారు. ‘పాడుతా తీయగా’ అనే షో ద్వారా దాదాపు 24 ఏళ్ల నుంచి ఎంతో మంది సింగర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేశారు.