భారత రాజ్యాంగ విశిష్టత

భారత జాతీయ శాసనమైన రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది. భారతీయుల బహుళ అవసరాలు తీర్చేలా రూపొందించిన ఈ రాజ్యాంగానికి ప్రజాస్వామిక స్వభావం ఉండటం వల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక అంశాలను సవరణల ద్వారా తనలో ఇముడ్చుకుంటుంది. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ మన రాజ్యాంగం ప్రత్యేకతను సంతరించుకుంది. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ఆధారంగా రూపొందించిన రాజ్యాంగ ప్రవేశిక మనం సాధించాల్సిన లక్ష్యాలను తెలుపుతుంది. 

లిఖిత, సుదీర్ఘ రాజ్యాంగం

భారతీయుల బహుళ అవసరాలు తీర్చేలా భారత రాజ్యాంగం రూపొందిందని తొలి ప్రధాని నెహ్రూ అభిప్రాయపడ్డారు. దేశ జాతీయ శాసనమైన రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింట్లో దివ్యమైందని ఐవర్​ జెన్నింగ్స్​ పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం భిన్నత్వానికి నిలయమైన దేశ ప్రజలందరి ప్రయోజనాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపర్చడమే. 395 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్లు, 22 భాగాలతో ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైందిగా భారత రాజ్యాంగం రూపొందింది. 105 సవరణ వల్ల ప్రస్తుతం 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 25 భాగాలకు పెరగడంతో రాజ్యాంగం మరింత విస్తృతంగా తయారైంది. మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరించుకునే ప్రజాస్వామిక స్వభావం రాజ్యాంగానికి ఉండటమే మన రాజ్యాంగాభివృద్ధికి ప్రధాన కారణం. 

రాజ్యాంగ ప్రవేశిక

1946, డిసెంబర్​13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు – ఆశయాల తీర్మానాన్ని 1947, జనవరి 22న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ప్రవేశికగా ఆమోదించింది. భారత రాజ్యాంగం తాత్విక పునాదులను గురించి తెలిపే రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు– ఆశయాలను తెలిపే రాజ్యాంగ దిక్సూచిగా పేర్కొంటారు. 

లౌఖిక రాజ్యాంగం

రాజ్యానికి, మతానికి మధ్య కచ్చితమైన ఏర్పాటును కలిగి ఉంది. 1947లో మన దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించే సందర్భంలో భారతదేశాన్ని మత ప్రాతిపదికపై భారత్, పాకిస్తాన్​లుగా విభజించింది. పాకిస్తాన్ తన రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికపైన రూపొందించుకున్నది. అంటే ముస్లింల పర్సనల్​ చట్టమైన షరియత్​ను అనుసరించి పరిపాలనను కొనసాగిస్తున్నారు. భారతదేశం మాత్రం లౌకిక విధానాన్ని అనుసరిస్తున్నది. అంటే మన దేశంలో అధికార మతం ఏదీ లేదు. ప్రతి పౌరునికి మత స్వేచ్ఛను కల్పించారు. 

ప్రాథమిక హక్కులు

భారత పౌరుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించి మన రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలోని మూడో భాగం ద్వారా పౌరులందరికీ ప్రాథమిక హక్కులను ప్రసాదించారు. ప్రతి వ్యక్తి తన శక్తిసామర్థ్యాలను ఆధారం చేసుకుని స్వేచ్ఛాయుతంగా ఉన్నతాభివృద్ధిని సాధించడానికి అవసరమైన అవకాశాలను ప్రాథమిక హక్కుల రూపంలో మన రాజ్యాంగం ప్రసాదిస్తున్నది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన్నప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా, 1978లో జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడంతో ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన ప్రజాస్వామిక జీవనానికి ప్రాథమిక హక్కులు పునాదిగా పనిచేస్తున్నాయి. 

ప్రాథమిక విధులు

ప్రారంభంలో మన రాజ్యాంగంలో కేవలం ప్రాథమిక హక్కులను మాత్రమే పొందుపర్చారు. ప్రాథమిక విధుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. హక్కులకు, విధులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపర్చారు. సర్ధార్​ స్వరణ్​ సింగ్​ కమిటీ సూచనను అనుసరించి పూర్వం సోవియట్​ యూనియన్​ నుంచి గ్రహించిన ప్రాథమిక విధుల భావనను రాజ్యాంగం నాలుగో భాగంలో ఏగా పొందుపర్చారు. 

రాజ్యాంగ విధాన ఆదేశిక సూత్రాలు

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆధునిక ప్రపంచాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన సిద్ధాంతం సంక్షేమ రాజ్య భావన. భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం ఐర్లాండ్​ నుంచి గ్రహించిన ఆదేశిక సూత్రాలు అనే భావనను రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపర్చారు. 36 నుంచి 51 వరకు గల అధికరణంలో పొందుపర్చిన నిర్దేశిక నియమాలు సమాజ సమష్టి ప్రయోజనం కోసం ఉద్దేశించినవి. 

దృఢ, అదృఢ లక్షణాల కలయిక

భారత రాజ్యాంగం మనదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక సజీవ సాధనం. మారుతున్న దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అలాగే ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించే బాధ్యతను మన రాజ్యాంగమే భారత పార్లమెంట్​కు అప్పగించింది. రాజ్యాంగాన్ని పార్లమెంట్​ మూడు పద్ధతుల ద్వారా సవరిస్తుంది. కొన్ని అంశాలను పార్లమెంట్​ సాధారణ చట్టం లాగే సాధారణ మెజారిటీతో సులభంగా సవరిస్తుంది. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంట్​ 2/3వ వంతు మెజారిటీతో పాటు దేశంలో 1/2 వ వంతు రాష్ట్రాల ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. అందువల్లనే మన రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ లక్షణాల కలయికగా పేర్కొంటారు. 

సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాల కలయిక

1919 మాంటేగ్​ చెమ్స్​ఫర్డ్​ సంస్కరణల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు విభజించారు. కేంద్రానికి 47 అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 అంశాలపై, అధికారాఈలు కల్పించారు. ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్​ కమిషన్​ దేశానికి సమాఖ్య ప్రభుత్వం ఉత్తమమైందని పేర్కొన్నది. సైమన్​ కమిషన్ నివేదికపై 1930 నుంచి 1932 వరకు లండన్​లో మూడు రౌండ్​ టేబుల్​ సమావేశాలు నిర్వహించారు. భారతీయుల అభిప్రాయాల ద్వారా 1935 చట్టంలో ఫెడరల్​ వ్యవస్థ ఏర్పాటు చేశారు. మన రాజ్యాంగానికి ప్రధాన మూలా ఆధారం 1935 చట్టం. దేశంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల సమాఖ్య లక్షణాలతో కూడిన ఏక కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. 


పార్లమెంటరీ ప్రభుత్వ విధానం

1853 చార్టర్​ చట్టం ద్వారా లెజిస్లేటివ్​ కౌన్సిల్​కు ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్ బాధ్యత వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి నాందిగా పేర్కొనవచ్చు. ప్రపంచ పార్లమెంటరీ మాతగా పేర్కొనే బ్రిటీష్ పార్లమెంట్​ మన దేశ పార్లమెంట్​ నిర్మాణానికి తోడ్పడింది. 1919 చట్టం ప్రవేశికలో భారత్​లో బాధ్యతాయుత ప్రభుత్వం ప్రవేశపెట్టడమే తమ లక్ష్యంగా ఆంగ్లేయులు పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని అమలు చేశారు. రిజర్వ్​ జాబితాలోని అంశాలు బ్రిటీష్​ గవర్నర్​కు, ట్రాన్స్​ఫర్డ్ జాబితాలోని అంశాలను భారతీయ మంత్రులకు అప్పగించారు. దీంతో శాసనసభ ద్వారా ఏర్పడే మంత్రి మండలి సభ్యులు బదిలీ శాఖల పాలనా విషయంలో శాసనశాఖకు సమష్టి బాధ్యత వహించారు. ఈ విధానం దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి బలమైన పునాదులు వేసింది. 1935 చట్టం ద్వారా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానానికి బలమైన పునాదులు వేసింది. 

రాజ్యాంగ ఆధిక్యత

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి రాజ్యాంగం ద్వారానే అధికారాలు పొందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధికి లోబడి తమ అధికారాలను నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిని అతిక్రమించినప్పుడు సుప్రీంకోర్టు ఆ అంశాన్ని సమీక్షించి తీర్పునిస్తుంది. సుప్రీంకోర్టు కూడా తన అధికారాలను రాజ్యాంగ పరిధికి లోబడే నిర్వహిస్తుంది. మన దేశంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాల్సి ఉండటంతో మన దేశంలో రాజ్యాంగాధిక్యత ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్​కు ఉన్నా సవరించిన రాజ్యాంగానికైనా పార్లమెంట్​ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంట్​కు లేదు. అమెరికాలో న్యాయవ్యవస్థ ఆధిక్యత కొనసాగుతుండగా, బ్రిటన్ పార్లమెంట్ ఆధిక్యత ఉంది. కానీ మన దేశంలో రాజ్యాంగ ఆధిక్యత మాత్రమే ఉంది.