పన్నుల వసూళ్లపై.. గ్రేటర్‍ వరంగల్ ఆఫీసర్ల స్పెషల్‍ ఫోకస్

  •     వసూళ్లకు సపరేట్‍ టీంలు పెట్టిన్రు.. స్పెషల్‍ డ్రైవ్‍ చేస్తున్రు
  •     గతేడాది 77 శాతానికి తగ్గడంతో ఈసారి సీరియస్ 

వరంగల్, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్​లో   పన్ను  వసూళ్లపై  అధికారులు స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. గడిచిన 10 నుంచి 15 ఏండ్లుగా ఏటా 90 శాతం పన్నులు వసూలవగా గతేడాది మాత్రం 77 శాతానికే పరిమితమైంది. ఈసారి జనవరి ముగిసేవరకు కూడా కేవలం 46 శాతం మాత్రమే కావడంతో బల్దియా ఆఫీసర్లు ముందస్తు నజర్​ పెట్టారు. కలెక్షన్ల కోసం రెగ్యులర్‍ బిల్‍ కలెక్టర్లతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఆస్తి, నల్లా, ట్రేడ్‍ పన్నుల వారీగా జాబితాలు రెడీ చేశారు.

దీంట్లో భాగంగా కొత్తగా పన్నుల పరిష్కార మేళా ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారుల టాప్ 100 లిస్ట్‍ రెడీ చేసి వారికి రెడ్‍ నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నుల వసూలుకు చివరగా రెండు నెలల సమయం ఉండగా.. ఫిబ్రవరి 15 నాటికి మరో 20 శాతం కలెక్షన్‍ టార్గెట్‍ పెట్టారు.

రూ.300 కోట్ల స్పెషల్‍ ఫండ్స్ ఉత్తిమాటే

బీఆర్ఎస్‍ మొదటిసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గ్రేటర్ వరంగల్​లో పర్యటించారు. మూడు రోజులు ఇక్కడే ఉన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. గ్రేటర్‍ వరంగల్ కార్పొరేషన్‍కు సెంట్రల్, రెగ్యులర్‍ ఫండ్స్​తో సంబంధం లేకుండా ఏటా రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. కాగా..సీఎం కేసీఆర్‍ హామీపై నమ్మకంతో బల్దియా అధికారులు కార్పొరేషన్‍ బడ్జెట్లో రాష్ట్ర వాటాను పెంచుకున్నారు తప్పితే.. ఏనాడు ఆ నిధులు వచ్చిన దాఖలాలు కనిపించలేదు. అదే సమయంలో 15 ఏండ్లలో అటుఇటుగా 90 శాతం వసూలు ఉండగా.. గతేడాది అత్యల్పంగా 77 శాతం మాత్రమే వసూల్​ అయ్యాయి.

ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్‍ రూ.87.54 కోట్లు అవగా రూ.67.74 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈ లెక్కన ఆస్తి పన్ను రూ.19 కోట్ల 80 లక్షలకుతోడు నల్లా పన్ను రూ.26 కోట్ల 45 లక్షలు, చెత్త పన్ను రూ.6 కోట్ల 58 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. గ్రేటర్ ఇ–ఆఫీస్​ను  ఇక్కడినుంచి ఎత్తివేసి మున్సిపల్‍ శాఖ పర్యవేక్షణలో నడుస్తున్న సెంటర్ ఫర్‍ గుడ్ గవర్నన్స్​లోకి  డేటాను మార్చడం కూడా సమస్యకు ఓ కారణమైంది.

రూ.612 కోట్ల బడ్జెట్.. పన్నుల ఆదాయం రూ.213 కోట్లు

 కార్పొరేషన్ 2023–24 సంవత్సరానికి రూ.612 కోట్ల 29 లక్షలతో ముసాయిదా బడ్జెట్‍ను కౌన్సిల్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా రూ.300 కోట్ల స్పెషల్‍ ఫండ్స్ ఇవ్వకున్నా.. లెక్కలు చూపారు. ఇందులో రూ.213 కోట్ల 63 లక్షలు లోకల్‍గా సాధారణ పన్నుల రూపంలో, రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. ఇదికాస్తా దెబ్బతిన్నది. దీంతో నిధుల కోసం టాక్స్​లనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో జనవరి నెల ముగిసేవరకు కేవలం 46 శాతం మాత్రమే పన్నులు వసూలు అయ్యాయి. దీంతో రాబోయే 2 నెలల గడువులోగా ఏదేమైనా 100 శాతం సాధించేలా టార్గెట్లు పెట్టారు. 

రెడ్‍ నోటీసులు.. షాప్‍ క్లోజ్‍ వార్నింగులు 

సొంత ఆదాయం పెంచుకునే క్రమంలో ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ప్రస్తుతమున్న 46 శాతం పన్నుల వసూళ్లను ఫిబ్రవరి 15 నాటికి 66 శాతానికి టార్గెట్ఇచ్చారు. ట్రేడ్‍ వసూళ్ల టార్గెట్‍ రూ.9 కోట్లు ఉండగా..ఇప్పటివరకు కేవలం రూ.3 కోట్లు మాత్రమే కలెక్షన్ అయ్యాయి. ఈ క్రమంలో అధికారులు గ్రేటర్ ఆఫీసులో సరికొత్తగా 'పన్నుల పరిష్కార మేళా' ఏర్పాటు చేశారు.

ఇంటికి సంబంధించిన వివరాలు రికార్డుల్లో తప్పులుంటే సరిచేసి వెంటనే పన్నులు కట్టేలా ప్లాన్చేశారు. ఇందులో ప్రధానంగా ఇంటి నంబరు లేదంటే ఓనర్‍ పేరు మార్పు, టాక్స్‍ సవరణ వంటివి ఉండేలా చూశారు. ప్రతి బుధవారం ఈ మేళా పనిచేస్తుందని చెప్పారు. ట్రేడ్‍ లైసెన్స్ టాక్సుల్లో టాప్ 100 మొండి బకాయిల జాబితా తయారు చేసి హస్పిటల్స్, ఫంక్షన్‍ హాల్‍ వంటివారికి రెడ్‍ నోటీసులు జారీ చేస్తున్నారు. మున్సిపల్‍ చట్టం _2019 యాక్ట్ 264 ప్రకారం ట్రేడ్‍ చెల్లించని షాప్స్‍ సీజ్‍ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. బల్దియా కమిషనర్‍ స్వయంగా ఫీల్డ్‍ మీదకు వెళ్లి పన్నుల వసూలు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటరింగ్‍ చేస్తున్నారు. 

టాక్స్‍ కట్టని డిఫాల్టర్లకు రెడ్‍ నోటీసులు

గ్రేటర్‍ వరంగల్లో 100 శాతం పన్నుల వసూలే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ప్రత్యేక సిబ్బందిని నియమించాం. పన్నుల పరిష్కార మేళా నడిపిస్తున్నాం. గ్రేటర్‍ జనాలు ఆస్తి, నల్లా, ట్రేడ్‍ టాక్స్‍ త్వరగా చెల్లించాలి. కమర్షియల్‍ టాక్స్‍ పేమెంట్స్‍ పెండింగ్‍ ఉంటే రెడ్‍ నోటీసులు జారీ చేస్తాం. గడువు వరకు చూసి దుకాణాలు సీజ్‍ చేస్తాం. ఇదే సమాచారాన్ని ముందస్తుగా ప్రచారం చేస్తున్నాం. పన్నుల వసూళ్లకు అందరూ సహకరించాలి.
- షేక్‍ రిజ్వానా బాషా, గ్రేటర్ కమిషనర్