మహిళల ఓట్లే కీలకం..వారిని ప్రసన్నం చేసుకునేందుకుపార్టీల పాట్లు

  •     ప్రచారంలోకి  మహిళా నేతలు

మెదక్, వెలుగు : జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించడం లో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన   పార్టీలు మహిళల ఓట్లపై  ప్రత్యేక దృష్టి పెట్టాయి.  మ్యానిఫెస్టోలో మహిళలకోసం ఇచ్చిన హామీలపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. 

మహిళా నేతలలో ప్రచారం...

మెదక్, నర్సాపూర్​  అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​  అభ్యర్థులు ఇద్దరు మహిళలే. మెదక్​ అభ్యర్థి పద్మా దేవేందర్​రెడ్డి, నర్సాపూర్​ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ​ఇంటింటికి వెళ్లి  పలకరిస్తున్నారు.  మెదక్​ అసెంబ్లీ  స్థానంలో కాంగ్రెస్​  అభ్యర్థి మైనంపల్లి రోహిత్​కు మద్దతుగా ఆయన భార్య శివాణీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ మహిళా విభాగం  సభ్యులతో  వార్డుల్లో, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే నర్సాపూర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి భార్య శైలజా రెడ్డి మండలాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 

మహిళల ఓట్లు ఇలా

జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4.40 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళా ఓటర్లు 2.27 లక్షల మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,13,089 మంది మహిళా ఓటర్లు ఉండగా, నర్సాపూర్​ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,14,346 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 

ఎస్​హెచ్​జీ, మెప్మా గ్రూపులపై ఫోకస్​

మెదక్​ నియోజకవర్గ పరిధిలోని మెదక్​, హవేలి ఘనపూర్​, చిన్నశంకరంపేట, రామాయంపేట, నార్సింగి, నిజాంపేట, పాపన్నపేట మండలాల్లో మొత్తం 4,210 సెల్ఫ్​ హెల్ప్​ గ్రూపులు ఉండగా వాటిల్లో మొత్తం 44,795 మంది మహిళలు మెంబర్​లుగా ఉన్నారు. అలాగే మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 814 మెప్మా సంఘాల్లో 7,476 మంది, రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 311 సంఘాల్లో 3,055 మంది మహిళలు మెంబర్​లు ఉన్నారు. నర్సాపూర్​ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్​,  హత్నూర, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలప్​చెడ్​ మండలాల్లో మొత్తం 5,353 సంఘాల్లో 56,808 మంది మహిళలు మెంబర్లు ఉండగా,

నర్సాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 290 మెప్మా సంఘాల్లో 2,472 మంది మహిళలు మెంబర్​లుగా ఉన్నారు. ఈ మేరకు అధికార బీఆర్ఎస్​ పార్టీతోపాటు,   కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లోని సెల్ప్​ హెల్ప్​ గ్రూప్​లు, మెప్మా గ్రూపులలో మెంబర్లుగా ఉన్న మహిళల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రూప్​లలో  ఉన్నమహిళలకు నెలకు రూ.3 వేల జీవన భృతి ఇస్తామని అధికార బీఆర్​ఎస్​ పార్టీ చెబుతుండగా, సౌభాగ్య లక్ష్మీ స్కీం కింద నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ చెబుతోంది.

ALSO READ : ఐటీ సోదాల్లో రెండు చిప్పలు దొరికినయ్.. ఒకటి కేసీఆర్​కు, ఇంకోటి బాల్క సుమన్​కు : సరోజా వివేక్

అలాగే గ్యాస్​ సిలిండర్​ ను రూ.500కే ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ చెబుతుండగా, తాము రూ.400కే సిలిండర్​ ఇస్తామని బీఆర్ఎస్​ పార్టీ చెబుతోంది.  తమ పార్టీ అధికారంలోకి వస్తేచదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్​ స్కూటీలు ఫ్రీగా అందజేస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇస్తోంది. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.