6 ప్రాజెక్టులపై స్పెషల్​ ఫోకస్

6 ప్రాజెక్టులపై స్పెషల్​ ఫోకస్
  •  మార్చి నాటికి ఎస్సారెస్పీ స్టేజ్​ 2, పిప్రి, పాలెం వాగు, మత్తడివాగు,
  • సదర్మట్, నీల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్​ ఆదేశం
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం
  • ఆయువుపట్టులాంటి డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి 
  • ఆ ఆరింటికి రూ. 241 కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా 
  •  వాటిని అసంపూర్తిగా, నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న, గత సర్కారు నిర్లక్ష్యం వహించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్​రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించి రైతులకు మేలు చేసేలా 6 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు నిర్ణయించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అర్ధంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఇరిగేషన్​ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు.

 అందులో భాగంగా తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ఎస్సారెస్పీ స్టేజ్​ 2, పిప్రి, పాలెం వాగు, మత్తడివాగు, సదర్మట్, నీల్వాయి ప్రాజెక్టుల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయా ప్రాజెక్టుల పనులను వందకు వంద శాతం పూర్తి చేయాల్సిందిగా తేల్చిచెప్పారు. అందుకు తగ్గట్టు నిర్ణీత గడువును నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని  అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

 వీటి పనులను పూర్తి చేసేందుకు రూ. 241 కోట్లు ఖర్చవుతుందని, 48 వేల ఎకరాలకు నీరు అందుతుందని ఇరిగేషన్​ అధికారులు అంచనాలను రూపొందించారు. నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు వీలవుతుంది. 

ఆ ఆరింటి పరిస్థితి ఇదీ..!

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ స్టేజ్​ 2 పనులను 2002లోనే ప్రారంభించారు. కానీ, 20 ఏండ్లు గడుస్తున్నా  ఇప్పటికీ ఆ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా వర్ధన్నపేట, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో 4.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. రూ.1200 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా మరో 33 వేల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పెండింగ్​లో పడ్డాయి. 

కాకతీయ మెయిన్​ కెనాల్​లోని 284 కిలోమీటర్​ నుంచి 346 కిలోమీటర్​ మధ్య లైనింగ్​ను తవ్వి ఇందిరమ్మ వరద కాల్వను నిర్మించాలనుకున్నారు. మొత్తంగా 13 చిన్నాపెద్ద డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి ఉమ్మడి వరంగల్​, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీళ్లందించాల్సి ఉంది. ఎస్సారెస్పీ ఆధారంగా చేపడుతున్న మరో ప్రాజెక్టు పిప్రి ప్రాజెక్టు. నిర్మల్​ జిల్లా లోకేశ్వరంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2021లో రూ.59 కోట్ల శాంక్షన్​ ఇచ్చారు. 

అయితే, అధికారులు రూ.70 కోట్లు కావాలని నివేదికలు పంపినా నాటి సర్కార్​ రూ.59 కోట్లకే శాంక్షన్​ ఇచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్​లో రూ.203 కోట్ల అంచనా వ్యయంతో పాలెం వాగు ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. 2021 నాటికే పూర్తి చేయాల్సి ఉన్న ఈ ప్రాజెక్టు పనులు ఇంకా జరుగుతున్నాయి. 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్లాన్​ చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 7 వేల ఎకరాలకు నీళ్లందుతున్నాయి. మరో 3,200 ఎకరాలకు నీళ్లందించే పనులు చేయాల్సి ఉంది. 

ఆదిలాబాద్​ జిల్లా తాంసిలో రూ.65.16 కోట్ల అంచనా వ్యయంతో కడుతున్న మత్తడివాగు ప్రాజెక్టులో పలు పనులు పెండింగ్​లో ఉన్నాయి. 9,700 ఎకరాల ఆయకట్టులో మరో 1,200 ఎకరాలకు నీళ్లందించే పనులు పెండింగ్​లో ఉన్నాయి. నిర్మల్​ జిల్లా పొంకల్​లో సదర్మట్​ మోడర్నైజేషన్​ ప్రాజెక్టును 2021లో గత సర్కారు ప్రారంభించింది. రూ.597 కోట్ల అంచనా వ్యయంతో 13,120 ఎకరాలకు నీళ్లందించే ఉద్దేశంతో ప్రాజెక్టు పనులను మొదలు పెట్టారు. వీటి పనులు కూడా పెండింగ్​లో ఉన్నాయి. 

అప్పట్లో మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాంతంలో నీల్వాయి రిజర్వాయర్​ను నిర్మించాలని తలపెట్టారు. రూ.90 కోట్ల అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆటంకంగా మారాయి. 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని గత సర్కారు రూ. 250 కోట్లకు పెంచింది. అయితే, ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు కదలలేదు. అటవీ ప్రాంతంలో అనుమతుల్లేకుండా పనులు మొదలుపెట్టారన్న ఉద్దేశంతో నిరుడు నేషనల్​ వైల్డ్​ లైఫ్​ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

2017లో పర్యావరణ స్టేజ్​ 1 అనుమతులకు దరఖాస్తు చేసుకోగా.. కేంద్రం అనుమతులిచ్చింది. అయితే, ప్రాణహిత రక్షిత అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు చేపట్టారని ఆక్షేపించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నది. నిరుడు జూన్​ నాటికి పూర్తి చేయాలని గత సర్కార్​ భావించినా పనులు ఇంకా పూర్తి కాలేదు. 

డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి పెట్టండి

ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌస్​లకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలను నిర్మించకుండానే వదిలేసింది. 

అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన సీఎం.. తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.