న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెల్లో గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు పెరిగాయి. పోయిన బడ్జెట్లో రూ. 1.57 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకంటే 12 శాతం అధికంగా రూ. 1.77 లక్షల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలకేట్ చేశారు. అయితే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పోయినసారి కేటాయించిన బడ్జెట్ రూ. 1.71 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే.. తాజాగా 3.7 శాతం మాత్రమే నిధులు పెరిగినట్టు అయింది.
ఇక గ్రామీణాభివృద్ధికి చేసిన కేటాయింపుల్లో ఉపాధి హామీ పథకం అమలు కోసం అత్యధికంగా రూ. 86 వేల కోట్లను ఇచ్చారు. నిరుటి బడ్జెట్ (రూ. 60 వేల కోట్లు)తో పోలిస్తే ఈసారి ఏకంగా 43% అధికంగా నిధులు కేటాయించారు. పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ) కింద పేదలకు 2 కోట్ల ఇండ్లను నిర్మించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్నట్టు నిర్మల వెల్లడించారు.
ఇందుకోసం కేంద్రం వాటాగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 54,500 కోట్లను కేటాయించినట్టు ప్రకటించారు. అదేవిధంగా 25 వేల గ్రామీణ ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం పీఎం గ్రామ సడక్ యోజన నాలుగో దశను ప్రారంభిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందుకోసం రూ. 12 వేల కోట్లను ప్రకటించారు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్– అజీవిక కింద రూ. 15 వేల కోట్లను ప్రతిపాదించారు.
ALSO READ : గుడ్ న్యూస్ : రూ.4 వేలు తగ్గిన గోల్డ్ రేటు
గ్రామాల అభివృద్ధికి దోహదం: శివరాజ్ సింగ్
బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖకు నిధుల పెంపుతో గ్రామీణ ప్రాంతాల అీభివృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. లైవ్లీహుడ్ మిషన్తో మహిళలు సాధికారత సాధించేందుకు వీలవుతుందన్నారు.