హిందువులకు చాలా మంది దేవుళ్లు ఉన్నారు. ఎవరి ఆచారాలకు.. ఆ ప్రాంత పరిస్థితులను బట్టి ఆ ప్రాంత ప్రజలు వివిధ రకాలైన దేవుళ్లను కొలుస్తారు. కాని ప్రతి ప్రాంతంలో ఆంజనేయ స్వామి.. హనుమాన్ అంటే చాలు.. వారిలో భక్తి ఉప్పొంగుతుంది. జైశ్రీరామ్ ... జై హనుమాన్.. అంటూ ఆ ప్రాంతం మారిమ్రోగుతుంది. దాదాపు అన్ని దేవుళ్లు తలపెట్టిన కార్యక్రమాల్లో హనుమంతుడి పాత్ర కీలకంగా ఉంటుంది. కృత యుగం నుంచి ఇప్పుడు ప్రామాణికంలో ఉన్న కలియుగం వరకు ఆంజనేయస్వామిని అందరూ ఏదో ఒక సాయం అడిగిన వారే.. అయితే పురాణాల ప్రకారం.. కొన్ని పనులను ఆంజనేయుడు మాత్రమే చేశాడని... మిగతా ఎవరూ కూడా ఆపనులను చేయలేకపోయారని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 23న ఆంజనేయస్వామి పుట్టిన రోజు సందర్భంగా.. ఆ పనుల గురించి తెలుసుకుందాం. .
హనుమంతుడు.. శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీ రాముడు ...మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్ధం, ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివ పురాణం చెబుతుంది. రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దలు చెబుతుంటారు. పూర్వం తాతమ్మలు.. తాతయ్యలు కూడా ఆంజనేయుడి గురించి పిల్లలకు కథలు వివరించేవారు.
భారీ సముద్రాన్ని దాటడం
హనుమంతుడు, అంగధుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు. వారు సముద్రం తీవ్ర రూపాన్ని, పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. వీరిలో ఏ ఒక్కరికీ సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు. కానీ హనుమంతుని శక్తి యుక్తులపై నమ్మకం ఉన్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్లి, తిరిగిరాగల సమర్దునిగా సూచించాడు. క్రమంగా హనుమంతుడు తన సామర్ధ్యాలను అర్థం చేసుకున్నాడు. మొదట్లో తన సామర్ధ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్నా.... జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగి, సీత జాడను కనిపెట్టగలిగాడు హనుమంతుడు.
సీతా దేవిని కనుగొనడం
హనుమంతుడు సీతా దేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు, రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న లంకిణీ అనే రాక్షసితో తలపడవలసి వచ్చింది. హనుమంతుడు దైవ బలాన్ని కలిగి ఉండడం చేత, లంకిణీ తలవంచక తప్పలేదు. హనుమంతుడు తప్ప ఎవరు కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు. ఈ పోరాటంలో హనుమంతుడు, తన మానసిక.... శారీరక బలాన్ని సరైన స్థాయిలో ఉపయోగించి లంకిణీని ఓడించాడు. ఓటమిని అంగీకరించిన లంకిణీ, సీతాదేవి ఆచూకిని చెప్పగా, అశోకవనంలో సీతాదేవిని గుర్తించడం జరిగింది. సీతాదేవి లక్ష్మిదేవి అవతారము కావడం చేత, సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు హనుమంతునికి. నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికీ సాధ్యంకాని అంశం... లంకలోని రాక్షసులను ఎదుర్కొని సీత జాడ తెలుసుకోవడం.
అక్షయ కుమారుని సంహరణ
శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తర్వాత, హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు. రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుడిని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా.... హనుమంతుడు .. అక్షయ కుమారుడితో యుద్దం చేసి సునాయాసంగా చంపాడు. ఇదే రావణ రాజ్యంలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి, తోకను నిప్పు అంటించగా అక్కడనుండి వెళ్ళిన హనుమంతుడు లంకా సామ్రాజ్యాన్ని దహనం చేశాడు. రాముడి పరాక్రమాలను రాక్షస రావణుడికి తెలిసేందుకే ఇలాంటి చర్యలకు హనుమంతుడు ఒడిగట్టాడు. హనుమంతుడు మాత్రమే సమర్ధవంతంగా చేయగలిగిన అంశాలలో ఇది కూడా ఒకటి.
విభీషణుని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం
హనుమంతుడు, ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకొంటున్నట్లుగా గ్రహించాడు. క్రమంగా అతనికడకు వెళ్ళిన హనుమంతుడు, అతన్ని రావణాసురుని తమ్ముడు విభీషణునిగా గుర్తించి, అతన్ని రాముడి అనుయూయుడిగా తెలుసుకున్నాడు. శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగిఉన్నట్లుగా తెలుపడంతో, ఎవ్వరూ అంగీకరించకపోయినా కూడా హనుమంతుడు... విభీషణుని మీద గల నమ్మకంతో రాముని కడకు తీసుకుని వెళ్ళాడు. క్రమంగా ఈ చర్యే సగం రామ – రావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించుటకు కారణమైంది.
సంజీవని పర్వతాన్ని తీసుకుని రావడం
శ్రీరాముడికి... రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో, రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్ ... లక్ష్మణునిపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించగా.. బ్రహ్మ అస్త్రాన్ని గౌరవించిన లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోయాడు. దీనికి సంజీవని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో, హిమాలయాలలో సూచించిన పర్వతంనందు, సంజీవని గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్నే పెకలించుకుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు. ఈ పని ఏ ఇతరులూ చేయలేని అంశాలలో ఒకటిగా ఉంది.
మొదటిసారి రావణుని ఓడించిన హనుమంతుడు
యుద్ధ సమయంలో హనుమంతుడు అనేకమంది రాక్షసులను సంహరించాడు. దుమ్రాక్ష్, అంక్పన్, దేవాంతక్, త్రిసుర, నికుక్భ్ వంటి రాక్షసులు ప్రధానంగా ఇందులో ఉన్నారు. ఈక్రమంలో హనుమంతుడు, రావణునికి మద్య కూడా భీకరయుద్ధం జరిగింది. రావణుని ఓడించిన హనుమంతుడు, చంపకుండా విడిచిపెట్టాడు. దీనికి కారణం, రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన. హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా రుజువేముంటుంది.
అంతటి అఘటిత ఘటనా చతురుడు, అతి వీర పరాక్రముడు అయినందువలనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఒక్కసారి హనుమంతుని తలచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకుని, పరిస్థితులను అధిగమించే శక్తిని పొందగలరని భక్తులు విశ్వసిస్తుంటారు.