రూ.468 కోట్ల స్పెషల్ గ్రాంట్
ఫైనాన్స్ కమిషన్ సిఫార్సును ఆమోదించిన కేంద్రం
ట్యాక్స్ హాలిడేతో 50 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు
పన్ను తగ్గింపుతో ఆనందంలో ఉద్యోగులు
బడ్జెట్‌లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌కు రూ.468 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌లో దాదాపు పదో వంతు ఫైనాన్స్ కమిషన్ నుంచి అందనుంది. రానున్న ఐదేళ్లలో రూ.2,340 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోకల్ బాడీలకు నిధులు కేటాయించడంతో శివారులోని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు డెవలప్ అవుతాయని భావిస్తున్నారు. ట్యాక్స్ హాలిడే ప్రకటించటంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్‌కు రూ.200–300 కోట్లు వస్తాయని పీసీబీ అధికారులు భావిస్తున్నారు. దేశంలోని అన్ని పీఎస్‌లను డిజిటల్ కనెక్టివిటీతో లింక్ చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో సిటీ పోలీస్ టెక్నాలజీకి మరో అడుగు ముందుకు పడినట్లయింది. పన్ను తగ్గించడంతో సిటీలోని 5 లక్షల మంది ఉద్యోగులకు నెలకు 30 నుంచి 50 వేల రూపాయలు సేవ్ కానుంది. మెడికల్ ఎక్విప్ మెంట్ పై సెస్ విధిస్తున్నట్లు చెప్పడంతో వైద్యం మరింత భారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బడ్జెట్‌తో నూతన విద్యావిధానం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌కు రూ.468 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌లో దాదాపు పదో వంతు మొత్తం ఫైనాన్స్ కమిషన్ నుంచి అందనుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రానున్న ఐదేళ్లలో రూ.2,340 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ఇక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రజల జీవన ప్రమణాలు మెరుగు పరిచేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నారు. గతంతో పోలిస్తే ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎక్కువ నిధులే వస్తున్నాయని అధికారులు తెలిపారు. సిటీలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, ట్రాన్స్‌పోర్ట్,ఫెసిలిటీస్‌ను మరింత మెరుగు పరిచేందుకు కేంద్ర సాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలకు మరో రూ.889 కోట్ల నిధులు కేటాయించేందుకు ఫైనాన్స్ కమిషన్ ఓకే చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ స్పెషల్ ప్లాన్ తరహాలోనే మున్సిపల్ స్పెషల్ ప్లాన్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ టైంలో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్‌తో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా యూఎల్‌బీలకు నిధులు ఇవ్వనుంది. మున్సిపాలిటీల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవపల్ చేయడానికి సాధ్యమవుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. 140 యూఎల్‌బీల్లో సిటీ శివారుల్లోనే 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సొంత ఆదాయంతో పాటు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్ డెవలప్‌మెంట్‌కు దోహదపడునుందని అధికారులు చెప్పారు.
కొంచెం.. పెంచారు
విద్యా రంగానికి చేసిన కేటాయింపులపై విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది బడ్జెట్‌లో రూ.94,853.64 కోట్లు కేటాయించారని ఈసారి(రూ 99,300 కోట్లు) అదనంగా కేటాయించింది రూ.4,446 కోట్లు మాత్రమేనన్నారు. నూతన విద్యా విధానానికి ఈ బడ్జెట్ఎలా సరిపోతుందనే ప్రశ్నలు ఉన్నాయి. అలాగే మెడికల్ ఎక్విప్ మెంట్ పై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికితోడు దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై సుంకం పెంచారు. ఈ ఎఫెక్ట్ రోగులపై పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రతి చికిత్సకు ముందు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం సాధారణమైపోయింది. వీటికి అత్యాధునిక వైద్య పరికరాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద వినియోగిస్తున్న మెడికల్ ఎక్విప్ మెంట్ లో 90% విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. వీటి ధరలు పెరిగితే హెల్త్ టెస్ట్ ల రేట్లు పెరగనున్నాయి.
చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు ఫుల్ ఖుషీ
కేంద్ర బడ్జెట్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించటంతో ఆయా సంస్థల యాజమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలు గ్రేటర్లో దాదాపు 50 వేల వరకు ఉన్నాయి. ఏడాది పాటు ఈ సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో సంస్థకు దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు ఆదా కానుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్యాక్స్ తో ఆదా అయిన డబ్బుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ఉద్యోగ కల్పన, వేతనాల పెంపు సాధ్యం కానుంది. గ్రేటర్ పరిధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనం పొందుతున్న వారు పది లక్షలకుపైగా ఉన్నారు. గతేడాది 3 వేలకు పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. ఎంతో మంది రోడ్డున పడ్డారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో కేంద్రం చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా ఏడాది పాటు ట్యాక్స్ హాలీడే ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించటం కూడా ఎంతో మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమే. నగరంలో కార్పొరేట్ కంపెనీలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఉపాధి కూడా పెరగనుంది.
పోలీస్ స్టేషన్స్‌లో మరింత టెక్నాలజీ
దేశంలోని అన్ని పీఎస్‌లకు డిజిటల్ కనెక్టివిటీ చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో సిటీ పోలీస్ టెక్నాలజీకి మరో ముందడుగు పడినట్లు అయ్యింది. పోలీస్ స్టేషన్ల డిజిటలైజేషన్ కు బడ్జెట్ కేటాయింపులు, విధివిధానాలు పరిశీలించిన తరువాత టెక్నాలజీపై దృష్టి పెడతామని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్, నెట్ వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) తో దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల డేటాను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. సిటీ సీపీ అంజనీకుమార్ ప్రకటించిన విజన్ 2020 పోలీసింగ్ లో భాగంగా ఇప్పటికే పోలీస్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా డిజిటలైజేషన్ జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయని ఐటీ సెల్ అధికారులు చెప్తున్నారు.
అలర్ట్‌తో బెనిఫిట్
ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది.10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పొల్యూషన్ తగ్గించేందుకు రూ.4,400 కోట్లను వినియోగిస్తామని ప్రకటించింది. దీంతో గ్రేటర్ లో పొల్యూషన్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు పొల్యూషన్‌ను నివారించటంలో పీసీబీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అడిగితే నిధుల సమస్యని చెబుతోంది. గత పదేళ్లలో పొల్యూషన్ 40 శాతం పెరిగింది. బడ్జెట్‌నుంచి హైదరాబాద్‌కు రూ.200–300 కోట్లు అందుతాయని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. 5 నుంచి 7.50 లక్షల రూపాయల ఇన్ కం ఉన్న ఉద్యోగులకు కొత్త శ్లాబ్ విధానం మేలు చేయనుంది. ఇది వరకు 5 నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 20 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు 7.5 లక్షల వరకు 10 శాతం, 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 15 శాతం ట్యాక్స్ కడితే సరిపోతుంది. అయితే పాత విధానం కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త శ్లాబ్ కు మారాలనుకున్న వారికి చాలా వరకు ఆదాయ పన్ను సేవ్ కానుంది. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఇన్ కం వచ్చే ఉద్యోగుల్లో 90% నగరంలోనే ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఏటా 7 నుంచి 15 లక్షల వరకు వేతనాలు పొందుతున్నారు. ఫార్మా, మెడిసిన్, బ్యాంకింగ్ ఇలా పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి కొత్త పన్ను విధానం మేలు చేయనుంది. ఒక్క హైదరాబాద్ లో 7 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాందించే ఉద్యోగులు 5 లక్షల వరకు ఉంటారని అంచనా. వారందరికీ పన్ను రూపంలో 30 నుంచి 50 వేల రూపాయలు సేవ్ కానుంది. అయితే 5 లక్షల లోపు ఆదాయం వచ్చే ఉద్యోగులకు పాత విధానాన్నే కొనసాగించారు. దీంతో సిటీలో బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న 15 లక్షల మంది ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.