సత్తుపల్లి, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మహిళల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతతో ఉన్నారని ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వశక్తి మహిళా సంఘాలు చిన్న, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే శిక్షణను అందిస్తామన్నారు. ఉత్పత్తుల మార్కెటిం గ్‌కు చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ మేరకు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సత్తుపల్లిలో మహిళలతో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుకు త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. స్థానిక రైతులకు ఉపయోగపడే వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఇప్పటికే పామాయిల్‌తో పాటు కోకో, కొబ్బరి, అరటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, ఆ దిశగా పరిశ్రమల స్థాపన జరిగితే ఉపాధి కల్పించవచ్చన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ ముకామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.