హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ పోలీస్ఆఫీసర్ల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ఇప్పుడు నేతల వైపు మళ్లింది. బీఆర్ఎస్ లీడర్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలంటూ 8వ తేదీనే నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో పేర్కొన్న మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉండగా చిరుమర్తి లింగయ్య రాలేదు.
మధ్యాహ్నం 2:30 గంటల వరకు వస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత మాట మార్చారు. అనారోగ్యం కారణంగా విచారణకు రాలేకపోతున్నానని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 14వ తేదీన విచారణకు వస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లింగయ్య వినతి మేరకు ఏసీపీ అందుకు అనుమతి ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాగా, సిట్ విచారణ ఒక్క లింగయ్యతోనే ఆగేలా కనిపించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింకులు ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
తిరుపతన్నకు నెంబర్లు చేరవేత..
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య.. ఆ తర్వాత ఆరు నెలలకే బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి తన జిల్లా, నియోకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు సహా ఇతర ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల కదలికలపై నిఘా పెట్టి.. వారి కదలికలను బీఆర్‌ఎస్ పెద్దలకు అందించారని లింగయ్యపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడు, ఎస్‌ఐబీలో అడిషనల్ ఎస్పీగా పని చేసిన తిరుపతన్న.. గతంలో చాలాకాలం నల్గొండ జిల్లాలో పని చేశారు.
ఈ క్రమంలోనే ఆయనతో చిరుమర్తి లింగయ్యకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ హైకమాండ్ఆదేశాల మేరకు చిరుమర్తి లింగయ్య తన ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలు, బీఆర్‌ఎస్‌లోని అనుమానిత లీడర్ల ఫోన్ నెంబర్లను ఎప్పటికప్పుడు తిరుపతన్నకు అందించేవారని తెలిసింది. ఇలా సేకరించిన ఫోన్ నెంబర్స్‌ను ఎస్‌ఐబీ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్(ఎస్‌వోటీ) లాగర్ రూమ్ నుంచి తిరుపతన్న ట్యాపింగ్ చేయించేవాడని సిట్నిర్ధారణకు వచ్చింది.
100కు పైగా ఫోన్ నెంబర్లు..
గతంలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు పోయినేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ప్రతిపక్ష నేతల నెంబర్లను చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న టీమ్‌తో ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్టు ఆధారాలు సేకరించారు. తిరుపతన్న, లింగయ్య కాంటాక్ట్స్‌తో లింక్ అయిన దాదాపు 100కు పైగా ఫోన్ నెంబఒర్స్‌ను సిట్ సేకరించినట్టు తెలిసింది. ఆయా నెంబర్స్ కు సంబంధించిన వ్యక్తుల నుంచి సిట్ అధికారులు ఇప్పటికే స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ నెంబర్స్ కు సంబంధించిన ట్యాపింగ్ డేటాను కూడా సిట్ సేకరించింది. లింగయ్య అందించిన ఫోన్ నెంబర్స్ ఆధారంగా ఆయా వ్యక్తుల కదలిలను ప్రణీత్‌రావు టీమ్ గుర్తించేదని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బు తరలిస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని పట్టుకున్నారని సిట్ప్రాథమికంగా నిర్ధారించింది.
త్వరలో మరికొందరికి?
ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగా ప్రణీత్‌రావు టీమ్.. హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్స్, వరంగల్‌లోని పర్వతానగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మాజీ మంత్రి ఇంట్లోనే వార్‌రూమ్ ఏర్పాటు చేశారని.. ఇందుకు స్థానిక విజిలెన్స్ అధికారి, ఓ ఇన్‌స్పెక్టర్ సహకారం అందించారని విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్‌కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన దాదాపు 28 మంది పోలీసులతో సీక్రెట్ వార్ రూమ్ ఆపరేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఎస్ఐబీ లాగర్ రూమ్ నుంచి ప్రణీత్‌రావు అందించే సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని వార్‌రూమ్స్ ద్వారా సేకరించేవారని.. ప్రత్యర్థుల ఫోన్ కాల్స్ ఆధారంగా స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించేవారని బయటపడింది.
ఎన్నికల టైమ్ లో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా డబ్బులు సీజ్ చేసిన ప్రణీత్‌రావు టీమ్.. స్థానిక బీఆర్‌ఎస్ నేతల డబ్బును మాత్రం పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించినట్టు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. వరంగల్ జిల్లా సహా ఇతర వార్‌రూమ్స్‌లో పని చేసిన ఇంటెలిజన్స్ అధికారులను ఇప్పటికే సిట్ విచారించింది. ఆయా జిల్లాల్లోని వార్ రూమ్స్ కు సంబంధించి లింకులు ఉన్న నేతలను త్వరలో విచారించనున్నట్టు తెలిసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న తొలి నేత చిరుమర్తి లింగయ్య కాగా, నెక్ట్స్ ఎవరనే దానిపై చర్చ జరుగుతున్నది.