బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు.. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశాలు

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు.. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై విచారించేందుకు ఐజీ ఎం రమేష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఎం.రమేష్తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్లో కేసులు నమోదు కావడం గమనార్హం.

25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్ టీవీ యాంకర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రెండు కేసులను కూడా సిట్కు బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్కు డీజీపీ డెడ్ లైన్ విధించారు. ఆన్ లైన్ బెట్టింగ్కు సంబంధించి సిట్కు బదిలీ చేసిన కేసులను అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వానికి సిట్ సూచించనుంది. పేమెంట్లకు సంబంధించిన వ్యవహారాలపై RBIకి సిట్ సూచనలు చేయనుంది.

బెట్టింగ్ యాప్స్ కేసు పూర్వాపరాలివి..
బెట్టింగ్ యాప్స్‌‌ వ్యవహారంలో యాప్స్‌‌ను ప్రమోట్ చేసినోళ్లలో పలువురు సినీ స్టార్లు కూడా ఉన్నారు. వాళ్లపై సైబరాబాద్ కమిషనరేట్‌‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.

వీరిలో సినీ సెలబ్రెటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. వీళ్లపై 318(4),112 రెడ్‌‌ విత్ 49 బీఎన్‌‌ఎస్‌‌3,3(ఏ), 4 తెలంగాణ స్టేట్‌‌ గేమింగ్ యాక్ట్‌‌, 66-డి ఐటీ యాక్ట్‌‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌‌ను ప్రమోట్​చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ 11 మందిపైనా మియాపూర్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో కేసులు నమోదు చేశారు.