- సాక్షిగా చక్రధర్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసిన సిట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ఇన్వెస్టిగేషన్టీమ్(సిట్) దర్యాప్తు కొనసాగుతున్నది. ఎంక్వైరీలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుల ట్యాపింగ్ లిస్ట్ నుంచి సేకరించిన నంబర్స్‌లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్‌కు చెందిన రెండు ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో చక్రధర్ గౌడ్ స్టేట్‌మెంట్‌ను సిట్ సోమవారం రికార్డ్ చేసింది.
జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో చక్రధర్‌గౌడ్ ఫోన్‌నంబర్ ఆధారంగా వివరాలు అడిగి తెలిసుకున్నారు. ట్యాప్‌చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తన ఫోన్ ట్యాప్‌చేస్తున్నారని గతంలో చక్రధర్‌గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు చక్రధర్‌గౌడ్ నుంచి సమాచారం సేకరించారు.
హారీశ్ కు సరెండర్ కావాలని బెదిరింపులు: చక్రధర్ గౌడ్
పోలీసుల విచారణ అనంతరం చక్రధర్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన అన్యాయాలు, అక్రమాలపై తాను పోరాడానని చెప్పారు. దీంతో తన ఫోన్ ట్యాప్‌చేసి ప్రతి కదలిక తెలుసుకున్నారని అన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు.
ఏడు కేసులు పెట్టారని.. నాలుగు సార్లు జైలుకు పంపించారని తెలిపారు. ఇప్పటికే పోలీసులు రెండు సార్లు తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు గతంలో బెదిరింపులకు దిగాడని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీశ్ రావుకు సరెండర్ కావాలని బెదిరించినట్లు చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని వెల్లడించారు.