- టైగర్స్ సంరక్షణకు మహారాష్ట్ర మాదిరి ఏర్పాట్లు
- రాబోయే ఐదేండ్ల కాలానికి అటవీ అధికారుల ప్రణాళికలు
- కాగజ్‌నగర్ అడవుల్లో పోడుసాగు బంద్ పెట్టాలని నిర్ణయం
- ఇటికెలపహాడ్ స్ఫూర్తితో విరివిగా ప్లాంటేషన్ చేయాలని ప్లాన్
- మేటింగ్ జరగడం వల్లే టైగర్ దూకుడు తగ్గిందన ప్రచారం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి వచ్చే పులులకు కారిడార్‌గా మారిన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ అడవులను ఇకపై పులులకు శాశ్వత నివాస ప్రాంతంగా మార్చాలని అటవీ అధికారులు నిర్ణయించారు. టైగర్స్ సంరక్షణతో పాటు, వాటి సంఖ్యను పెంచే ఉద్దేశంతో రానున్న ఐదేండ్ల కాలానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోడు సాగును బంద్ చేయడంతో పాటు, ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పులి సంచారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా రూట్ క్లియర్ చేసే పనిలో తలమునకలయ్యారు. వీలైతే టైగర్ బ్రీడింగ్ జోన్‌గా మార్చడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అందేరీ టైగర్ రిజర్వ్‌లో అవలంబిస్తున్న విధానాలను ఇక్కడా అమలుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను మహారాష్ట్ర పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక పోడుకు ఫుల్ స్టాప్ !
అడవులకు నష్టం చేస్తున్న పోడు సాగును ముందునుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పట్టాలు ఇచ్చినా వాటి హద్దులు ఫిక్స్ చేయడం, సాగు నీటి విషయంలో అడ్డుపడుతున్నారు. ఫారెస్ట్ భూములు వదిలేందుకు సిద్ధంగా లేని ఆఫీసర్లు డీఫారెస్ట్‌ను రీఫారెస్ట్‌గా మార్చేందుకు నర్సరీలు ఏర్పాటు చేయడం, ప్లాంటేషన్, గ్రాస్‌ల్యాండ్‌గా మార్చేందుకు ప్రపోజల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పులి స్థిర నివాసం కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా మహారాష్ట్ర విధానాలను అమలుచేయాలని భావిస్తున్నారు.
మహారాష్ట్రలో అడవుల సంరక్షణ విషయంలో అక్కడి ప్రభుత్వంతో పాటు అటవీ శాఖ కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. అక్కడ అడవిలో విరిగిపడిన కట్టెలను తెచ్చుకునేందుకు సైతం అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో పోడు వ్యవసాయం, వాటికి పట్టాలు ఇవ్వడం అనే ముచ్చటే లేదు. దీంతో అటవీ భూముల ఆక్రమణకు ఆస్కారం లేకుండా పోయింది. పులుల సంరక్షణా చర్యల్లో భాగంగా తెలంగాణలోనూ పోడు వ్యవసాయం, వాటికి పట్టాలు ఇవ్వడాన్ని ఆపేసేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు శాఖాపరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ భూములు స్వాధీనం చేసుకునే యోచన
కాగజ్‌నగర్‌తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అడవికి ఆనుకుని, అడవి మధ్యలో కొన్ని చోట్ల రెవెన్యూ భూములు ఉన్నాయి. చుట్టూ అడవి, మధ్యలో రెవెన్యూ భూములు ఉండడంతో సాగు, కూలీ పనుల కోసం వెళ్తున్న వారు పులి దాడికి గురవుతున్నారు. ఈ పరిణామాలు అటు పులికి, ఇటు రైతులకు, ఆఫీసర్లకు ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితి మార్చేందుకు అడవికి ఆనుకుని, పులి సంచారం ఉన్న మార్గంలో గల రెవెన్యూ భూములను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు బదలాయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ALSO READ : ఏజెన్సీలో డుమ్మా టీచర్లకు చెక్ .. స్కూళ్లలో టీచర్ల ఫొటోలు, వారి వివరాలతో డిస్ ప్లే
వాటికి ప్రత్యామ్నాయంగా వేరే భూములను గానీ, పరిహారం చెల్లించేందుకుగానీ అటవీ శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు అడవికి అత్యంత దగ్గరగా, పులి సంచార ప్రాంతంలో ఉన్న ఇండ్లను సైతం ఖాళీ చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. పులికి ఇబ్బందిగా, ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను మాత్రమే ఖాళీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ ఈలూ సింగ్ మేరు ఫీల్డ్ విజిట్ చేసి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు.
ఇటికలపహాడ్ ప్లాంటేషన్ స్ఫూర్తిగా...
పులి సంరక్షణ చర్యల్లో భాగంగా సిర్పూర్ (టి) రేంజ్‌లోని ఇటికెలపహాడ్ ప్లాంటేషన్‌ను ఫారెస్ట్ ఆఫీసర్లు మోడల్‌గా తీసుకున్నారు. అయిదేళ్ల కిందటి వరకు ఇక్కడ వందలాది ఎకరాలు రైతుల కబ్జాలో ఉండేవి. ఫారెస్ట్ ఆఫీసర్లు రైతులను ఒప్పించి సుమారు 600 ఎకరాల్లో ప్లాంటేషన్ చేశారు. పులి మహారాష్ట్రలోని తాడోబా నుంచి రాకపోకలకు ఈ ప్లాంటేషన్ కీలక ప్రాంతంగా మారింది. ఇక్కడ కొన్నేళ్లుగా పులి సంచారం రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల తిరుగుతోంది. దీంతో తాము చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని ఆనందంలో ఉన్నారు. ఈ ప్లాంటేషన్ స్ఫూర్తిగానే మిగతా ఫారెస్ట్‌లో ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తగ్గిన టైగర్ దూకుడు
ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి దూకుడు ప్రస్తుతం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఆడ పులి తోడు కోసం తిరుగుతున్న మగ పులి కొన్ని రోజుల కిందట ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతంలోనే కలిసినట్లు తెలుస్తోంది. మేటింగ్ పూర్తి కావడం వల్లే పులి అగ్రెసివ్ మోడ్‌లోంచి రిలాక్స్ మోడ్‌కి వచ్చినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఆఫీసర్లు ఇంట్రస్ట్ చూపడం లేదు. పులి తన టెరిటోరియల్‌లో రోజూ 40 కిలోమీటర్లు తిరుగుతుందని, ఆడ పులి వాసనను
50 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టే శక్తి దానికి ఉంటుందని చెబుతున్నారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నం
పులుల సంరక్షణ, ఆవాసం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నం. కాగజ్‌నగర్ డివిజన్‌లో అటవీ భూముల అక్రమణ ఎక్కువగా ఉంది. పులి రాకపోకలు, నివాసానికి సిర్పూర్ (టి) రేంజ్‌లోని చీలపల్లి, ఇటికెలపహాడ్ కీలకం. ఇక్కడ అక్రమణకు గురైన భూములను తమ పరిధిలోని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహారాష్ట్రలో పులుల సంరక్షణకు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు జిల్లా నుంచి ఓ టీంను పంపించనున్నాము.
– నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్‌వో-