హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కుల గణన సర్వే ఇప్పటికే పూర్తి అయిన విషయం తెలిసిందే. ప్లానింగ్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి నివేదికను సిద్ధం చేసింది. ఈ తుది రిపోర్టును ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు దామోదర రాజ నర్సింహా, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కుల గణన నివేదికపై కమిటీ చర్చించనుంది.
ALSO READ | తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
అనంతరం ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశమై కులగణన రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. నివేదికపై చర్చ అనంతరం కుల గణన రిపోర్టుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కుల గణన నివేదికకు ఆమోదం లభించిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.