![కిచెన్ తెలంగాణ : మష్రూమా.. మజాకా!](https://static.v6velugu.com/uploads/2025/02/special-mushrooms-three-items_uxfjywsBiJ.jpg)
ఈ వారం స్పెషల్ మష్రూమ్స్.. అదేనండి పుట్టగొడుగులు. ఈ మధ్య కూరగాయలతో పాటు ఇవి కూడా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది వంటింట్లో కూడా కనిపిస్తుంటాయి. అయితే అందరూ అన్ని తినలేరు కానీ, కొందరికి వీటిని తినాలని ఉన్నా ఎలా వండాలో తెలియక వండుకోరు. అలాంటివాళ్ల కోసమే ఈ అదిరిపోయే రెసిపీలు. ముఖ్యంగా లంచ్ బాక్స్‌లకు పర్ఫెక్ట్గా సరిపోయే ఈ మూడు ఐటెమ్స్ వేటికవే సాటి. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ఫ్రైడ్ రైస్
కావాల్సినవి :
మష్రూమ్స్ – 200 గ్రాములు
ఆవాలు, కారం, ధనియాల పొడి – ఒక్కో టీస్పూన్
పచ్చిమిర్చి – రెండు
ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
కరివేపాకు – కొంచెం
అల్లం – వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
పసుపు – అర టీస్పూన్
క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు
కొత్తిమీర, ఉల్లికాడలు, నూనె – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
అన్నం – ఒకటిన్నర కప్పు
మిరియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేసి వేగించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత క్యాప్సికమ్ తరుగు, కొత్తిమీర కూడా వేసి మరోసారి కలపాలి. ఆపై నీళ్లు పోసి బాగా ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అన్నం, మిరియాలపొడి, కొత్తిమీర, ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్.. లంచ్ బాక్స్‌లకు పర్ఫెక్ట్ డిష్.
గ్రేవీ కర్రీ :
కావాల్సినవి :
మష్రూమ్స్ – 200 గ్రాములు
నూనె – ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
పుదీనా, కొత్తిమీర – కొంచెం
జీలకర్ర, కారం, మిరియాల పొడి, గరం మసాలా – ఒక్కోటి అర టీస్పూన్
అల్లం – వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
కశ్మీరీ కారం, ధనియాల పొడి, కసూరీ మేథి – ఒక్కో టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. కాసేపు చల్లారనిచ్చి వాటిని ఒక మిక్సీజార్‌లో వేయాలి. వాటితోపాటు పుదీనా, కొత్తిమీర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి వేగించాలి. అందులోనే గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కాసేపు వేగాక, కారం, కశ్మీరీ కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక పెరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో మష్రూమ్స్ వేసి కలపాలి. ఆపై నీళ్లు పోసి మూతపెట్టి మరికాసేపు ఉడికించాలి. చివరిగా కసూరీ మేథి వేసి కలపాలి.
పెప్పర్ ఫ్రై
కావాల్సినవి :
మష్రూమ్స్ – అర కిలో
ఉల్లిగడ్డలు – నాలుగు
పచ్చిమిర్చి – రెండు
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు – సరిపడా
ధనియాలపొడి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
గరం మసాలా – పావు టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు – కొంచెం
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేగించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. తర్వాత మష్రూమ్ ముక్కల్ని కూడా వేయాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. మూత తీసి, కలుపుతూ కాసేపు వేగించాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. మూతపెట్టి మరికాసేపు ఉడికిస్తే సరి. ఘుమఘుమలాడే మష్రూమ్ ఫ్రై తినడానికి రెడీ.