స్టూడెంట్స్ ఆత్మహత్యలపై అన్నీ అనుమానాలే

 

  • సూసైడ్​ నోట్​లో మేడంను ఏమీ అనొద్దు అని ఎందుకు రాసినట్టు ? 
  • సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఎక్కడికెళ్లారు?   
  • ఆటో డ్రైవర్ ను మంచోడు అని చెప్పమన్నది ఎవరు  
  • విచారణ పూర్తయితేనే అన్ని విషయాలపై స్పష్టత వచ్చేది

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి ఎస్సీ హాస్టల్​లో ఇద్దరు టెన్త్​స్టూడెంట్స్​సూసైడ్​చేసుకున్న ఘటనపై అనుమానాలు తొలగిపోవడం లేదు. అసలు ఏం జరిగిందన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నెల 3న రాత్రి భువనగిరి ఎస్సీ హాస్టల్​లో ఎస్సెస్సీ చదువుతున్న స్టూడెంట్స్​కోడి భవ్య, గాదె వైష్ణవి ఆత్మహత్య చేసుకున్నారు. 3వ తారీఖున జూనియర్​స్టూడెంట్స్​తో భవ్య, వైష్ణవి మిస్​బిహేవ్​చేస్తే కౌన్సిలింగ్​ఇచ్చామని హాస్టల్​స్టాఫ్​చెప్పారు. అయితే, ఈ ఘటన 15 రోజుల ముందే జరిగితే ఆత్మహత్య చేసుకున్న రోజే జరిగిందని ఎందుకు చెప్పారో అర్థం కావడం లేదు. కౌన్సిలింగ్​ఇచ్చిన టైంలో వార్డెన్​, పీఈటీ ఉన్నారా లేక మరెవరైనా ఉన్నారా అన్నది తెలియడం లేదు. వార్డెన్​ మాత్రమే కౌన్సిలింగ్​ ఇచ్చి ఉంటే ఆత్మహత్య గురించి ఆలోచించే వారు కాదన్న వాదన వినిపిస్తోంది.

కౌన్సిలింగ్​తర్వాత సాయంత్రం వేళలో వార్డెన్​, పీఈటీ, స్టూడెంట్స్ వాహనంలో ఎక్కడికో వెళ్లారని అంటున్నారు. ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్​ ఆంజనేయులు వారితో ఉన్నారా? లేక వారు నలుగురే వెళ్లారా? అన్న దానిపై క్లారిటీ లేదు. సాయంత్రం ఐదు గంటలకు వెళ్లి రెండు గంటల తర్వాత అంటే ఏడు గంటలకు తిరిగి వచ్చారన్న విషయం ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఆ టైంలో ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు అన్నది తెలియరాలేదు.

అంతా పది నిమిషాల్లోనేనా..!

స్టూడెంట్స్​ఆత్మహత్య చేసుకున్న రోజు పది నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందని హాస్టల్ స్టాఫ్​ చెప్పారు. భోజనం చేయకుండా భవ్య, వైష్ణవి రూమ్​లోకి వెళ్లిపోయారని, క్లాస్​కు రాకపోవడం తోటి స్టూడెంట్స్​చూడగా యూనిఫారం చున్నీతో ఉరేసుకుని కనిపించారని చెప్పారు. గదికి వెళ్లిన పది నిమిషాల్లోనే సూసైడ్​నోట్​రాసి, ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. కానీ, ఇద్దరి డెడ్​బాడీలను హాస్పిటల్​కు తరలించిన తర్వాత రాత్రి 11 గంటల టైంలో సూసైడ్​నోట్​దొరికింది. 11 లైన్లలో రాసిన ఈ నోట్​లో రెండు చోట్ల నాలుగు లైన్లలో వార్డెన్​ శైలజ గురించి రాశారు. ‘మమ్ములను మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా శైలజ మేడంను ఎవరూ ఏమీ అనకండి. మా అమ్మవాళ్ల కంటే ఎక్కువగా చూసుకున్నారు’ అని అందులో ఉంది. అంటే వారు చనిపోతే శైలజ మేడంనే అందరూ అంటారని ఊహించి రాశారా? అన్నది తెలియడం లేదు.  

విచారణ షురూ 

ఎంక్వైరీ ఆఫీసర్​గా ఉన్న స్పెషల్​డిప్యూటీ కలెక్టర్ ​నాగలక్ష్మి బుధవారం నుంచి విచారణ మొదలుపెట్టారు. హాస్టల్​కు వెళ్లి స్టాఫ్​తో మాట్లాడారు. స్కూల్​కు వెళ్లి వివరాలు సేకరించారు. విచారణ తర్వాత కలెక్టర్​కు రిపోర్ట్ ​అందజేయనున్నట్టు తెలుస్తోంది.

 ఆటోడ్రైవర్ ​పాత్ర ఏంటి? 

స్టూడెంట్ల ఆత్మహత్య తర్వాత ఆటో డ్రైవర్​పాత్రపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆటో డ్రైవర్ ​ఆంజనేయులు హాస్టల్​కు సంబంధించిన సరుకుల రవాణా, ​విద్యార్థులను తీసుకువెళ్లడం, తీసుకురావడం చేస్తుంటాడు. ఇంతకుముందే హాస్టల్​లో వంట చేసే వ్యక్తితో ఆటో డ్రైవర్​కు సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఈ విషయం బయటపడడంతో కుక్​ను వేరే హాస్టల్​కు ట్రాన్స్​ఫర్​ చేశారని తెలుస్తోంది. ఆరోపణలున్నప్పుడు టెంపరరీ జాబ్​చేసే వారిని మారుస్తారు. కానీ, ఇక్కడ రివర్స్​జరిగింది. మరోవైపు ఆత్మహత్య తర్వాత విచారణకు వచ్చిన సోషల్​వెల్ఫేర్​ ఉద్యోగితో  ‘ఆటో డ్రైవర్​ మంచోడు' అని చెప్పాలని సిబ్బందిపై ఒకరు ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అలా ఎందుకు చెప్పమన్నారు? ఎవరు చెప్పమన్నారు అన్నది తేలాల్సి ఉంది.