- తొలిరోజు కమిషనర్లతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. పాలక వర్గాల టర్మ్ ముగియడంతో 3 కార్పొరేషన్లకు కలెక్టర్లను, ఇతర కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లను, మున్పిపాలిటీలకు ఆర్డీవోలు, జీహెచ్ఎంసీ, మూసీ, సీడీఎంఏ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా ఆదివారం ప్రభుత్వం నియమించింది.
కాగా, సోమవారం ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వెళ్లి స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. తొలిరోజు కమిషనర్లతో సమావేశమయ్యారు. కలెక్టరర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఆయా కమిషనర్లు వచ్చి రిపోర్ట్ చేశారు.
పలు రికార్డులను పరిశీలించారు. ఒకే అధికారికి 4,5 మున్సిపాలిటీలు ఇచ్చిన దగ్గర రోజుకు ఒక మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్లు వెళ్లనున్నారు. ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్, ఎస్ హెచ్ జీ ల్లో కొత్తగా మహిళలను చేర్పించాలని కమిషనర్లను స్పెషల్ ఆఫీసర్లు ఆదేశించారు.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించిన జీహెచ్ఎంసీ, మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు, సీడీఎంఏ అధికారులు మున్సిపాలిటీలకు వెళ్లారు. కాగా, 3 నెలలపాటు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుందని, ఏప్రిల్ లేదా మే లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే చాన్స్ఉందని అధికారులు చెబుతున్నారు.