జనవరి 27 నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన

జనవరి 27 నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన
  • మున్సిపల్  శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దాన కిశోర్  ఉత్తర్వులు
  • 3 కార్పొరేషన్లకు స్పెషల్  ఆఫీసర్లుగా కలెక్టర్లు
  • మిగతా కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లుగా అడిషనల్  కలెక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో టర్మ్  ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు అడిషనల్  కలెక్టర్లు, ఆర్డీవోలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దాన కిశోర్  ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్  కార్పొరేషన్  టర్మ్ ఈనెల 28న ముగియనుంది.  కరీంనగర్ తప్ప మిగతా మున్సిపాలిటీల్లో  సోమవారం నుంచి స్పెషల్  ఆఫీసర్ పాలన షురూ కానుంది.  స్పెషల్  ఆఫీసర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించారు. కొంత మంది అడిషనల్  కలెక్టర్లకు ఒకే మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించగా మరి కొంతమందికి 5 మున్సిపాలిటీలు అప్పగించారు. ఇందులో జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు అడిషనల్  కలెక్టర్ ను నియమించారు. నస్పూర్   మున్సిపాలిటీ మంచిర్యాల కార్పొరేషన్ లో, కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్  మున్సిపల్  కార్పొరేషన్ లో విలీనంకాగా 128 మున్సిపాలిటీలకు స్పెషల్  ఆఫీసర్లను నియమించారు. రాష్ర్టంలో మొత్తం 142 మున్సిపాలిటీలు ఉండగా ప్రభుత్వం ఇటీవల 12 కొత్తవాటిని ఏర్పాటు చేసింది.

దీంతో మున్సిపాలిటీల సంఖ్య 154కి చేరింది. 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.  2021 లో జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, గ్రేటర్  వరంగల్, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, జడ్చర్లలో మున్సిపల్  ఎన్నికలు జరిగాయి. వీటి టర్మ్  మరో ఏడాది ఉంది. మరో నాలుగు మున్సిపాలిటీలకు (పాల్వంచ, మందమర్రి, మణుగూరు, జహీరాబాద్) ఎన్నికలు జరగలేదు. జీహెచ్ఎంసీ, గ్రేటర్  వరంగల్, ఖమ్మం మినహా మిగతా కార్పొరేషన్లకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ ఆఫీసర్లను, సీడీఎంఏ (కమిషనర్  డైరెక్టర్  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) లో జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, మూసీ రివర్ ఫ్రంట్  అధికారులను ప్రభుత్వం నియమించింది.