- రేపటితో ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం
- స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత కరువు
- ఉమ్మడి జిల్లాలో 570 మంది ఎంపీటీసీలు, 66 మంది జడ్పీటీసీలు
- ఇప్పటికే ముగిసిన సర్పంచ్ల పాలన
ఆదిలాబాద్/భైంసా, వెలుగు: జిల్లా, మండల పరిషత్‌లలో త్వరలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇక జులై 4న జడ్పీటీసీ, 5న ఎంపీటీసీల పదవీకాలమూ ముగియనుండడంతో ప్రత్యేక పాలన అనివార్యంకానుంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీగా కార్యక్రమాల కోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.
ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు ప్రత్యేక పాలనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలంటే రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పాలకమండళ్ల పదవీ కాలం పొడిగించకుండా ప్రత్యేక అధికారుల పాలన తీసుకురానుంది. ఈ పాలన 6 నెలల పాటు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేలా కనిపించడం లేదు.
రేపటితో ముగియనున్న పదవీకాలం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 66 జడ్పీటీసీ, 570 ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. రేపటితో వీరి పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గ్రామ పంచాయతీ సర్పంచ్ల పాలన ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చారు. ఇప్పుడు పరిషత్‌లో సైతం రెండు మూడు రోజుల్లో ప్రత్యేక పాలన రానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో పంచాయతీల తరహాలోనే ప్రత్యేకాధికారుల పాలన అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
జిల్లా పరిషత్‌లకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాలకు ఏదో ఒక శాఖ జిల్లాస్థాయి అధికారి మండల ప్రత్యేకాధికారిగా ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారినే మండల పరిషత్‌కు కూడా నియమిస్తారా? లేక మరో జిల్లా స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
రిజర్వేషన్లు, కుల గణన తేలాకే..
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్, మండల, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. బీసీ కుల గణన ఆధారంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధమైనప్పటికీ నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం ఉండదు. రిజర్వేషన్లు, ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికే కనీసం రెండు నెలల సమయం పడుతుంది. 2018లో పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పదేండ్ల పాటు ఒకే రిజర్వేషన్ కొనసాగేలా చట్టం తీసుకొచ్చింది.
దాని ప్రకారమే 2019లో ఎన్నికలు నిర్వహించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సర్కారు ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక చట్టసవరణతో కొత్త రిజర్వేషన్లను ప్రకటిస్తుందా? అనేదానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో పక్క బీసీ కులగణనకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఇటు కులగణన, అటు రిజర్వేషన్ల ప్రక్రియ లాంటి కారణాలతో పరిషత్ ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.