కాలుష్య నియంత్రణ చట్టాల అమలుకు ఏర్పాటు ఆయిన ప్రత్యేక యంత్రాంగం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలులు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా, రాష్ట్ర స్థాయి సంస్థలకే అధికారాలు ఉన్నాయి. నీటి చట్టం 1974 కింద ఇవి ఏర్పాటు చేయబడినప్పటికీ, కాలక్రమేణా వాటి అధికారం నీటి కాలుష్య సమస్యలను దాటి గణనీయంగా విస్తరించింది. వాయు, శబ్ద కాలుష్యం, వ్యర్థాలు, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం కూడా వాటి బాధ్యత. నీటి చట్టం, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981, పర్యావరణ (రక్షణ) చట్టం 1986 ప్రకారం, ఈ బోర్డులు వివిధ నియమాల కింద నాలుగు విస్తృత విధులను నిర్వహిస్తాయి.
1. పరిశ్రమను స్థాపించడం, నిర్వహించడం కొరకు అనుమతులను ఇవ్వడం, 2. కాలుష్య ఉద్గారాలు, వ్యర్థాలకు ప్రమాణాలను నిర్దారించడం 3. ఈ ప్రమాణాల మేరకు పరిశ్రమల కాలుష్యాన్ని పర్యవేక్షించడం 4. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రమాణాలను అమలు చేయడం. అయితే కాలుష్య నియంత్రణ మండలులు సరిగ్గా, ఆశించిన మేరకు పని చేయడం లేదు. అవినీతికి ఆలవాలం అయినాయి. రాజకీయ నాయకులకు, అధికారులకు కాసులు కురిపించే అస్త్రాల అమ్ములపొది అయింది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.
హైదరాబాద్ నగరం చుట్టూ, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గుట్టలను విధ్వంసం చేస్తుంటే టీఎస్పీసీబీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. కొన్ని వందల స్టోన్ క్రషింగ్ యూనిట్లు చట్ట వ్యతిరేకంగా పని చేస్తూ టన్నుల కొద్దీ ధూళిని వెదజల్లుతుంటే, టీఎస్పీసీబీ స్పందించటం లేదు. కోర్టులో స్వయంగా ఒప్పుకున్నాక కూడా అక్రమ పరిశ్రమల మీద చర్యలు లేకపోవడం స్పష్టంగా రాజకీయ, అధికార అవినీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల అని రుజువు అవుతున్నది.
ప్రతి ఎమ్మెల్యే కనుసన్నలలో ప్రకృతి వనరులు విధ్వంసం చేస్తూ, కోట్ల రూపాయలను కొందరు ఆర్జిస్తుంటే, టీఎస్పీసీబీ పని చేయడం లేదు. ఫిర్యాదు చేస్తున్న ప్రజలకు అండగా నిలిచే బదులు, అక్రమ మైనింగ్ యూనిట్లకు అనుకూలంగా విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫార్మా ఇంకా ఇతర కాలుష్య పరిశ్రమల మీద అయితే అసలు చర్యలు లేవు. కోర్టు తీర్పులు ఉన్నా చర్యలు లేవు. కోర్టు తీర్పుల అమలు లేదు. కోర్టు ధిక్కారానికి కూడా వెరవకుండా పరిశ్రమలను కాపాడుతున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక మరింత దిగజారింది
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. ప్రజలు వివిధ కోర్టులలో వేస్తున్న కేసుల తీర్పుల వల్ల కూడా నిధులు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పని తీరు ఇంకా దిగజారింది. ప్రస్తుతం వీరి పని చాల అధ్వాన్నంగా ఉన్నది. ప్రజలు నిత్యం తాము ఎదురుకుంటున్న సమస్యలు లిఖితపూర్వకంగా, ఇంకా అనేక రూపాలలో టీఎస్పీసీబీ దృష్టికి తెస్తున్నా ఫలితం లేదు.
ఇదివరకు ప్రజల నుంచి సమాచారం వస్తే దాని మీద అధికారులు స్పందించేవారు. పరిశ్రమలను సంజాయిషీ అడిగేవారు. స్వయంగా పరిశోధించి, తగు చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు అట్లాంటి స్పందన కొరవడింది. పైగా, కంప్లైంట్ ఇస్తున్న సామాన్యుల మీద టీఎస్పీసీబీ అధికారులు రుసరుసలాడుతూ, బెదిరిస్తూ వారిని భయపెడుతున్నారు. అనేకులు విధి లేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఖర్చు పెడుతున్నా కూడా అక్కడ కూడా కాలుష్య బాధితులకు న్యాయం జరగడం లేదు. కొన్ని వందల కేసులు ఇటు తెలంగాణా హై కోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులో ఉన్నాయి. చట్టాలున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.
ఒక నివేదిక ప్రకారం 2018 నుండి 2021 వరకు, దాదాపు అన్ని కాలుష్య నియంత్రణ బోర్డులలో మిగులు నిధులు ఉన్నాయి. చాలా బోర్డులు తాము వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేయలేదని, మిగులు నిధులను బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుకున్నారు. దీనిని బట్టి ఆర్థిక వనరుల లేమి అనేది వట్టి మాట. అసలు టీఎస్పీసీబీ నిధుల మీద ఆడిట్ జరుగలేదు. తెలంగాణా శాసన సభలో ఈ సంస్థ మీద చర్చ జరుగలేదు. వీళ్ళ దగ్గర ఉన్న నిధులు మీద, వాటిని ఖర్చు చేస్తున్న పద్ధతి మీద ప్రజల నిఘా లేదు. వార్షిక నివేదికలు ప్రజలకు అందుబాటులో లేవు.
అవినీతి ఆయుధం పీసీబీ
ప్రకృతి వనరులను దోచుకోవడం, కలుషితం చేసే వ్యవస్థ పట్ల రాజకీయ పార్టీలకు సానుభూతి ఒక వ్యసనంగా మారింది. అది వారికి వ్యక్తిగతంగా కూడా మారింది. ఎందుకంటే అందులో పెట్టుబడిదారులు వాళ్ళే, లాభాలు తీసుకునేది వాళ్ళే. వాళ్ళ వ్యాపారాల కొరకు నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. అధికార నియంత్రణ ప్రక్రియలను నిర్వీర్యం చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు.
ఇటువంటి అరాచక వ్యవస్థలో వారు వాడుకుంటున్న ఆయుధం కాలుష్య నియంత్రణ మండలి. ఈ ఆయుధం ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. కొందరిని ఏడిపిస్తున్నారు. కొందరిని నడిపిస్తున్నారు. ఒకప్పుడు, తెలంగాణా ఉద్యమంలో తెలంగాణా ప్రకృతి వనరుల కాలుష్యం పట్ల ఒక బలమైన అభిప్రాయం ఉండేది. వలస వచ్చిన పెట్టుబడిదారులు ఇక్కడి ప్రకృతి వనరులను దోచుకుని, స్థానిక, అమాయక తెలంగాణా ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే తెలంగాణ రాష్ట్రం ద్వారా సాధ్యం అనుకునేవారు.
దురదృష్టం ఏమిటంటే, తెలంగాణా వచ్చినాక అంతకు ముందు జరుగుతున్న ప్రకృతి వనరుల దోపిడీ అప్పటి పెట్టుబడిదారులతో కలిసి స్థానిక పెట్టుబడి దారులు ఇంకా విస్తృతం చేశారు. తెలంగాణా వాసుల జీవనోపాధులు ఇంకా ఆగం అయినాయి. అనేక గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. హైదరాబాద్ లో కాలుష్యం ఇంకా పెరిగింది. కాలుష్య నియంత్రణ ఎన్నికల్లో ప్రధాన అంశం అయితే తప్ప కాలుష్యానికి, ప్రకృతి వనరుల విధ్వంసానికి ఊతం ఇచ్చే ఈ రాజకీయ, ఆర్థిక, అధికార వ్యవస్థకు బుద్ధి రాదు. వాళ్ళు మారాలంటే ప్రజలు కాలుష్యం మీద, ప్రకృతి వనరుల దోపిడీ మీద ప్రతి అభ్యర్ధిని ప్రశ్నించాలి.
పర్యావరణ నివేదికలు లేవు
ప్రజలకు పరిశ్రమల ఏర్పాటు నిర్ణయంలో పాల్గొనే అవకాశం పబ్లిక్ హియరింగ్ ద్వారా వస్తున్నది. కాని ఈ ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చేసింది టీఎస్పీసీబీ. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కొందరు వ్యక్తులను స్వచ్చంద సంస్థ ప్రతినిధులుగా ప్రవేశ పెట్టి వారితోటి పరిశ్రమ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడించటం చేస్తున్నారు. వీరు ప్రయాణానికి కారు, టీఏ, డీఏ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదిత పరిశ్రమలు కూడా ‘అద్దెకు’ మందిని తీసుకువచ్చి స్థానిక ప్రజల హక్కులను, నిర్ణయాలను మకిలి చేస్తున్నారు. ప్రజలకు పరిశ్రమ ప్రతిపాదనకు సంబంధించి ముందస్తుగా సాంకేతిక, పర్యావరణ ప్రభావం అంచనా నివేదికలు ఇవ్వడం లేదు.
అసలు ప్రజాభిప్రాయ సేకరణ నోటీసు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదు. నివేదికల్లో ఘోరమైన అబద్దాలు, తప్పిదాలు ఉన్నా టీఎస్పీసీబీ నుంచి చర్యలు శూన్యం. ఒకప్పుడు అనుమతుల ప్రక్రియలో వివిధ కమిటీలలో శాస్త్రవేత్తలు, నిపుణులు, సమాజ సేవకులు ఉండేవారు. ఇప్పుడు కూడా కొన్ని కమిటీల్లో ఉన్నా, వారు ఉత్సవ విగ్రహాల మాదిరి పని చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో 350 పైగా పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి అంటే, ఈ ప్రక్రియలో నిబద్దత లేమి, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనపడుతున్నది.
శాస్త్రవేత్తలు ఈ విధంగా అధికారం ముందు మోకరిల్లి ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా పని చేయడం జుగుప్సాకరం. టీఎస్పీసీబీకి గత తొమ్మిది ఏండ్లుగా ఒకే వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు. మెంబర్ సెక్రెటరీ ఇటీవల మారినా, అంతకు ముందు అధికారికి మూడు శాఖల బాధ్యతలు ఉండేవి. ఎన్నికల నేపథ్యంలో నిధుల సేకరణకు ముఖ్య అధికారిని మార్చినట్టు ఉన్నారు కానీ, టీఎస్పీసీబీ పని తీరు ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగపడాలి అంటే ఇంకా తీవ్ర మార్పులు రావాలి. పరిశ్రమలు ప్రమాదకరమైన వ్యర్ధ జలాలను, ఘన వ్యర్ధాలను, వాయువులను ఇష్టానుసారం విడుదల చేస్తున్నా చర్యలు తీసుకునే ధైర్యం అధికారులకు లేదు.
అధ్యయనాల ద్వార వెల్లడైంది
వివిధ చట్టాల ప్రకారం తమకు అప్పగించిన విధులను నిర్వహించడానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద వనరులు లేవని, సామర్థ్యం లోపించింది అని తెలుస్తున్నది. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ముఖ్యంగా టెక్నికల్ పోస్టుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటం, సరైన శిక్షణ లేకపోవడం, కాలుష్య పర్యవేక్షణ, నివారణ పరికరాలు లేకపోవడం, సాంకేతికంగా సమర్థ నాయకత్వం లేకపోవడం, దీర్ఘకాలిక అమలు యంత్రాంగాలు లేకపోవటం, తగినంత నిధులు లేకపోవడం, అసమర్థ వ్యయం వంటి వివిధ కారణాల వల్ల కాలుష్య నియంత్రణ మండలి సామర్థ్యం లోపించింది అని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి వాస్తవమే అయినా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ నాయకులకు కాలుష్య నియంత్రణ పట్ల చిత్తశుద్ధి లేకపోవటం ప్రధాన కారణం.
- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్