- ఆర్థిక క్రమశిక్షణతో డ్యూటీలు చేయాలి
- ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లోఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ అనిల్‌కుమార్
నిజామాబాద్, వెలుగు: పోలీసు విధులను సమాజం నిరంతరం గమనిస్తూ ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేయాలని స్పెషల్ పోలీస్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీ డాక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖకు దేశంలో మంచి గుర్తింపు ఉందని, దానిని నిరంతరం కాపాడాలన్నారు. గురువారం జిల్లాలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్ క్యాంప్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 250 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ప్రసంగించారు.
డిగ్రీ, పీజీ ఉన్నత విద్యార్హతలు గల వారు కానిస్టేబుల్ జాబ్స్‌కు రావడంతో సమాజానికి మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఏ స్థాయిలో ఉన్నా జాతీయ సమగ్రత ధ్యేయంగా పనిచేయాలని, ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన మంచిదికాదని, ఆర్థిక క్రమశిక్షణతో ఆదర్శవంతమైన జీవితాలు గడపాలన్నారు.
ప్రతిష్ట పెంచేలా..
రాష్ట్రంలోని 16 ట్రైనింగ్ సెంటర్ల నుంచి ఒకేరోజు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నామని డీజీ అనిల్‌కుమార్ తెలిపారు. ఇది గొప్ప మైలురాయి అని అభివర్ణించారు. సత్ప్రవర్తన, వ్యవహారశైలితో పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచాలని ఆక్షాంక్షించారు.
కొత్త చట్టాలపై అవగాహన, ఫైరింగ్, దేహదారుఢ్యం, ఆత్మస్థైర్యంపై టైనింగ్ ఇచ్చి కానిస్టేబుల్స్‌గా తీర్చిదిద్దామని, పోలీస్ శాఖలోకి తమ పిల్లలను చేర్చిన పేరెంట్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్రైనింగ్‌లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన కానిస్టేబుల్స్‌కు బహుమతులు ప్రదానం చేశారు. ఇన్చార్జ్ సీహెచ్ సింధూశర్మ, సీటీసీ వైస్ ప్రిన్సిపాల్సయ్యద్ మస్తాన్అలీ పాల్గొన్నారు.