భద్రాచలం,వెలుగు : స్వర్ణ కవచధారి రామయ్యకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి స్వామికి సుప్రభాత సేవ చేసిన అనంతరం బంగారు కవచాలను అలంకరించి సీతారామచంద్రస్వామికి వేదమంత్రాల నడుమ హారతులు ఇచ్చారు. బాలబోగం నివేదించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, కుంకుమ, లక్ష్మీఅష్టోత్తరశతనామార్చనలు నిర్వహించారు.
కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం జరగ్గా 21 జంటలు కంకణాలు ధరించ క్రతువులో పాల్గొన్నాయి. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత స్వామికి రాజభోగం నివేదించారు. దర్బారు సేవ నిర్వహించి అద్దాల మండపంలో సీతారామచంద్రస్వామికి సంధ్యాహారతిని ఇచ్చారు.
రామదర్శనం చేసుకున్న వికారాబాద్ కలెక్టర్ దంపతులు
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ దంపతులు శుక్రవారం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు పరివట్టం కట్టి ఆలయంలోకి స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన వారికి లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.