యాదగిరిగుట్ట/నార్కట్‌పల్లి/మేళ్లచెరువు, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన శివాలయంలో బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అర్చనలు, పారాయణాలు, శ్రీదేవీ మూలమంత్ర జపాలు, సహస్రనామార్చన, నవావరణ పూజ, మంత్రపుష్పాలు జరిపరు. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పారాయణాలు, గాయత్రీ జపాలు, సహస్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. అలాగే మేళ్లచెరువులోని వనదుర్గాదేవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతర శతచంఢీయాగాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంలో మాలధారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంతోష్, కిశోర్, నాగరాజు, గణేశ్, నితిన్, తరుణ్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
మిర్యాలగూడ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆలగడప ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం గిరిజన గురుకుల స్కూల్‌లో బుధవారం ప్రారంభించారు. పోటీలను ఉప సర్పంచ్ పెనుమూడి నాగరాజు ప్రారంభించారు. ఫస్ట్ ప్రైజ్ కింద రూ. 30,116, సెకండ్ ప్రైజ్ రూ. 25,116, థర్డ్ రూ. 20,116, ఫోర్త్ ప్రైజ్ కింద రూ. 15,116ను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు పాతకోటి వెంకట్, వట్టెపు నాగరాజు, కిరణ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
మఠంపల్లి/హుజూర్‌నగర్, వెలుగు : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేకే ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. బుధవారం జరిగిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఎంపీపీ పార్వతీ కొండానాయక్, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు.
సీఎంఆర్ ఇవ్వకుంటే బ్లాక్ లిస్ట్‌లో పెడుతాం
హాలియా, వెలుగు : కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీని స్పీడప్ చేయాలని నల్గొండ అడిషనల్ కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు ఆదేశించారు. నిర్లక్ష్యం చేసే మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడుతామని హెచ్చరించారు. సివిల్ సప్లై ఆఫీసర్లు, మిల్లర్లతో బుధవారం నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటివరకు 80 శాతం, రబీలో 13 శాతం బియ్యం డెలివరీ అయిందన్నారు. మిగతా బియ్యాన్ని త్వరగా అందజేయాలని సూచించారు. ఖరీఫ్ బియ్యం డెలివరీ పూర్తి చేసిన వారికి మాత్రమే మళ్లీ వడ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. సమావేశంలో సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ నాగేశ్వరరావు, ప్రేమ్‌చంద్ర, అనుముల తహసీల్దార్ మంగ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, జనరల్ సెక్రటరీ రేపాల భద్రాద్రి రాములు పాల్గొన్నారు.
హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటు అభినందనీయం
మునగాల, వెలుగు : గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయం అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. నడిగూడెం మండలం ఎక్లాస్‌పేటలో బుధవారం ఏర్పాటు చేసిన హెల్త్‌క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామానికి చెందిన శేఖర్‌ను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకు రావాలని సూచించారు. చర్చి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మునగాల మండలం గణపవరంలో పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేసి సీసీ రోడ్డు పనులు, కొండపల్లి రవికుమార్ జ్ఞాపకార్థం ఆసరా భవన్‌కు శంకుస్థాపన చేశారు.
కార్యకర్తలను కాపాడుకుంటాం
యాదగిరిగుట్ట, వెలుగు : కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం తండా, ఖాజీపేటలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన టీఆర్‌ఎస్ లీడర్లు రమావత్ రాములు, బాసరం నాగరాజు ఫ్యామిలీలకు టీఆర్‌ఎస్ సభ్యత్వ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కులను బుధవారం ఆమె అందజేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాల్‌నర్సయ్య, నాగినేనిపల్లి సర్పంచ్ బీరప్ప పాల్గొన్నారు.
యాదాద్రి కలెక్టరేట్‌లో అపాయింట్‌మెంట్, అపాలజీ పంచాయితీ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని అగ్రికల్చర్ ఆఫీసర్లు, కలెక్టరేట్ సీసీ మధ్య అపాయింట్‌మెంట్, అపాలజీ పంచాయతీ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి ఈ కేవీసీ చేయడంలో వెనుకబడ్డారని జిల్లాలోని 13 మంది ఏవోలకు ఈ నెల రెండో వారంలో అడిషనల్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఏవోలు అడిషనల్ కలెక్టర్‌ను కలిసి ఈ కేవైసీ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీసీ సోమేశ్వర్‌ను కోరారు. వరుసగా మూడు రోజుల పాటు ఏవోలు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా అపాయింట్‌మెంట్ దొరకలేదు.
ఇటీవల ఏవోలు కలెక్టరేట్‌కు రాగానే కలెక్టర్ పమేలా సత్పతి కనిపించడంతో సీసీని కలవకుండానే ఇద్దరు ఏవోలు డైరెక్ట్‌గా ఆమె వద్దకు వెళ్లి తమ సమస్యను వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్ సాధ్యమైనంత త్వరగా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అయితే తనను సంప్రదించకుండా నేరుగా కలెక్టర్‌ను కలవడంతో సీసీ సోమేశ్వర్ ఏవోలపై సీరియస్ కావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీసీ కలెక్టర్‌ను కలిసి ఏవోలు తన డ్యూటీకి ఆటంకం కలిగించారని, తనపై దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీసీకి ఏవోలు ‘సారీ’ చెప్పాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఏవోలు ఓ ఉద్యోగ సంఘం నాయకుడిని ఆశ్రయించారు. ఈ విషయంపై తాను మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. సుమారు 15 రోజులుగా నడుస్తున్న ఈ వివాదం ప్రస్తుతం బయటకు పొక్కడంతో చర్చనీయాంశంగా మారింది.
చినమల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తమ్
నేరేడుచర్ల (పాలకవీడు), వెలుగు : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ ఎంపీపీ అందె చినమల్లయ్య విగ్రహాన్ని బుధవారం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి మల్లయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, పాలకవీడు జడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, ఎంపీపీ భూక్యా గోపాల్‌నాయక్, మండల అధ్యక్షుడు ఎన్‌వీ.సుబ్బారావు, కొనతం చినవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు
మునుగోడు, వెలుగు : దళితుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దళితుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో 12 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికి దశలవారీగా దళితబంధు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, నెమ్మాని భిక్షం, మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, నకిరేకంటి స్వామి, బొడ్డు నాగరాజు పాల్గొన్నారు.
దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి
మునుగోడు, వెలుగు : దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం జమస్తాన్‌పల్లిలో దళితబంధుపై ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆఫీసర్లు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. నల్గొండ జిల్లాకు 517 దళిత బంధు యూనిట్లు మంజూరు అయినట్లు చెప్పారు. లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ పంతంగి పద్మా స్వామిగౌడ్, కార్యదర్శి సరిత, ఆర్‌ఐ దుర్గా మహేశ్వరి పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలవడం ఖాయం
చౌటుప్పల్, వెలుగు : గడపగడపకు కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జి దండం రాంరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, బత్తుల శ్రీహరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రాచకొండ భార్గవ్, బోయ రామచంద్రం పాల్గొన్నారు.
మహిళలు ఆనందంగా ఉండాలనే చీరల పంపిణీ
నార్కట్‌పల్లి, వెలుగు : బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందజేస్తోందని నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి చెప్పారు. నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు, బాజకుంట, చిన్నతుమ్మలగూడెం గ్రామాల్లో బుధవారం బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో యాదగిరిగౌడ్, సర్పంచ్‌లు బద్దం వరమ్మ రాంరెడ్డి, ఈదునూరి సరిత రవీందర్‌రెడ్డి, దాసరి రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సైదులు పాల్గొన్నారు.
చెర్వుగట్టు హుండీ లెక్కింపు
నార్కట్‌పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. మొత్తం 59 రోజులకు సంబంధించిన హుండీని లెక్కించగా రూ. 39,38, 860 ఇన్‌కం వచ్చినట్లు ఈవో నవీన్, ఆలయ చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి చెప్పారు. ఎంపీటీసీ మేకల రాజురెడ్డి, ప్రధానార్చకుడు రామలింగేశ్వరశర్మ, డైరెక్టర్లు కల్లూరి శీను, పసునూరు శీను, రాధారపు భిక్షపతి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
చండూరు, వెలుగు : మునుగోడులో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి షబ్బీర్ అలీ సూచించారు. నల్గొండ జిల్లా చండూరులో బుధవారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తన స్వార్ధం కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో క్యాండిడేట్ పాల్వాయి స్రవంతి, నాయకులు ఎర్రవర్తి అనిల్, వంశీకృష్ణ, రాంరెడ్డి, పున్న కైలాశ్ నేత, పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
చండూరు (మర్రిగూడ), వెలుగు : ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెరుకు శిరీష (21), అదే గ్రామానికి చెందిన విక్రమ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వీరి పెళ్లికి విక్రమ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో శిరీష 10 రోజుల క్రితం విక్రమ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం ఉదయం చనిపోయింది. మృతురాలి అన్న నర్సింహ ఫిర్యాదుతో విక్రమ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదాబాబా తెలిపారు.
నకిరేకల్ హాస్పిటల్ తనిఖీ
నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్‌ను బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగుల కేస్ షీట్‌లో ట్రీట్‌మెంట్ వివరాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ నకిరేకల్‌లో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి పర్మిషన్ వచ్చిందని, 2, 3 రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట డీసీహెచ్ మాతృనాయక్, నకిరేకల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనాథ్‌నాయుడు ఉన్నారు.