సెక్రటేరియెట్ భద్రత..మళ్లీ ఎస్పీఎఫ్ చేతికి

సెక్రటేరియెట్ భద్రత..మళ్లీ ఎస్పీఎఫ్ చేతికి
  • బాధ్యతల నుంచి టీజీఎస్పీని తొలగిస్తూ ఉత్తర్వులు
  • కానిస్టేబుళ్ల ధర్నాల నేపథ్యంలో సర్కారు నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వహించే సెక్యూరిటీని ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటేరియేట్ భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) నుంచి తప్పించి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్)కు అప్పగించింది. ‘‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్” విధానం అమలు చేయాలనే డిమాండ్‌‌తో తెలంగాణ పోలీస్ బెటాలియన్ (టీజీఎస్పీ) సిబ్బంది ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం టీజీఎస్పీ సిబ్బంది చూస్తున్న సెక్రటరియేట్ భద్రత బాధ్యతలను మళ్లీ ఎస్పీఎఫ్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. కొత్త సచివాలయం ప్రారంభం నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రతా విధులు నిర్వహిస్తూ వచ్చింది. సుమారు 600 మంది సిబ్బంది రోజువారి విధుల్లో ఉండేవారు. అయితే అంతకుముందు 25 ఏండ్లుగా సెక్రటేరియెట్ భద్రతను ఎస్పీఎఫ్ చూసుకునేది. గత సర్కార్ కొత్త సచివాలయ నిర్మాణం తరువాత ఆ బాధ్యతలను స్పెషల్ పోలీస్​కు అప్పగించింది. 

కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు, ధర్నాల నేపథ్యంలో.. ఇటీవల సచివాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ సిబ్బందికి సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది సోషల్ మీడియాలో చేసే పోస్టులపై జాగ్రత్తలు సూచించారు. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దని, లైక్, ఫార్వర్డ్​ చేయకూడదని పేర్కొన్నారు.