కేంద్ర పాలిత ప్రాంతాల‌లో.. ఢిల్లీకి ప్రత్యేకావకాశాలు

కేంద్ర పాలిత ప్రాంతాల‌లో..  ఢిల్లీకి ప్రత్యేకావకాశాలు

1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఫజల్​ అలీ కమిషన్ రాజ్యాంగంలోని 8, 9 భాగాల్లో పేర్కొనని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే మన దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడిన హిమాచల్​ప్రదేశ్, మణిపూర్, త్రిపురలు  ఆ తర్వాత కాలంలో రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. 1961లో మన దేశంలో విలీనమైన గోవా కూడా 1987లో రాష్ట్రంగా ఏర్పడింది. 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్​ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్​ నికోబార్ దీవులు, దాద్రానగర్​ హవేలి అండ్​ డయ్యూడామన్​, లక్షద్వీప్​, చంఢీఘర్, జమ్మూకశ్మీర్, లఢక్​ ఉన్నాయి. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్​ల్లో మాత్రమే 
ప్రత్యేక శాసనసభలు ఉన్నాయి. 

1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా 239ఏఏ అధికరణం చేర్చి ఢిల్లీని జాతీయ రాజధాని ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 69వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన అనంతరం జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంత పాలకుడిగా లెఫ్టినెంట్​ గవర్నర్​గా పేర్కొంటున్నారు. ఢిల్లీ రాజధాని ప్రాంతానికి ఒక శాసనసభను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎన్నుకునే శాసనసభ ఢిల్లీ పరిపాలనకు అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది. ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, షెడ్యూల్డ్​ కులాలకు కల్పించే రిజర్వేన్స్​కు సంబంధించి పార్లమెంట్​ చట్టాలను రూపొందిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్​ రూపొందిస్తుంది. కానీ, భూమి, శాంతిభద్రతలు, పోలీసు​లకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం ఢిల్లీ శాసనసభకు లేదు. పార్లమెంట్ శాసన అధికారానికి విరుద్ధంగా శాసనాలు చేసే అధికారం ఢిల్లీ శాసనసభకు లేదు. రాజ్యాంగపరంగా కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా పార్లమెంట్​ శాసనాలు చేయడానికి ఎలాంటి ఆటంకం లేదు. ఢిల్లీ శాసనసభ ఏర్పడటానికి ముందు గానీ ఏర్పడటానికి తర్వాత గానీ పార్లమెంట్​ చేసిన చట్టాలకు విరుద్ధమైన చట్టాలను ఢిల్లీ శాసనసభ రూపొందించినట్లయితే డాక్ట్రిన్​ ఆఫ్ రెపగ్నెన్సీ సిద్ధాంతాన్ని అనుసరించి పార్లమెంట్​ చట్టాలు మాత్రమే అమల్లో ఉంటాయి. ఒకవేళ ఢిల్లీ శాసనసభ రూపొందించిన చట్టాలు రాష్ట్రపతి పరిశీలనకు పంపి వారి ఆమోదం పొందినట్లయితే ఢిల్లీ శాసనసభ చట్టాలే అమల్లో ఉంటాయి. రాష్ట్రపతి అనుమతితో ఢిల్లీ శాసనసభ చేసిన చట్టాలకు విరుద్ధంగా పార్లమెంట్​ కొత్త చట్టాలను రూపొందించాలంటే పార్లమెంట్ ఆ విధంగా ప్రత్యేక చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. 

రాష్ట్రపతిచే ముఖ్యమంత్రి నియామకం

ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్యలో (70)లో 10 శాతానికి మించకుండా ముఖ్యమంత్రితో కూడిన మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. పరిపాలనలో లెఫ్టినెంట్ గవర్నర్​కు సలహాలు ఇచ్చే ఢిల్లీ మంత్రి మండలి శాసనసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. ఢిల్లీ మంత్రి మండలి నిర్ణయాలతో లెఫ్టినెంట్​గవర్నర్ విభేదించినప్పుడు ఆ అంశాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా లెఫ్టినెంట్​ గవర్నర్​ వ్యవహరిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్​లో పెట్టినప్పుడు పరిపాలనాపరంగా అత్యవసరం ఏర్పడితే లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. ఢిల్లీ పరిపాలన రాజ్యాంగంలోని 239ఏఏ ప్రకారం గానీ లేదా 239 అధికరణ ప్రకారం గానీ కొనసాగే పరిస్థితి లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ ఒక నివేదికను రాష్ట్రపతికి పంపినప్పుడు 239ఏఏ అధికరణ ద్వారా ఢిల్లీ పరిపాలనకు కల్పించిన అన్ని అంశాలను రాష్ట్రపతి సస్పెండ్​ చేయవచ్చు. కాలపరిమితి కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. 

ఢిల్లీ సర్వీస్​ బిల్లు –2023

ఢిల్లీ వర్సెస్​ యూనియన్ ఆఫ్​ ఇండియా వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రి మండలి సలహా మేరకు ఢిల్లీలో అధికారుల బదిలీ, నియామకాలు చేయాలని పేర్కొంటూ ఢిల్లీ అనేది పూర్తిస్థాయి రాష్ట్రం కాదని దానికి కొన్ని పరిమితులు ఉంటాయని ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా  2019లో ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్​ చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యులతో కూడిన డి.వై.చంద్రచూడ్​ 
నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి శాసన, కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయని, అధికారుల నియామకంలో సంపూర్ణ అధికారం ఉంటుందని 2023, మే 23న తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్​ జారీ చేస్తూ అధికారుల నియామకంలో లెఫ్టినెంట్​ గవర్నర్​కు సంపూర్ణ అధికారం కట్టబెట్టింది. ఈ బిల్లును 2023, ఆగస్టు 3న లోక్​సభ, ఆగస్టు 7న రాజ్యసభ ఆమోదించాయి. 
    
నేషనల్​ క్యాపిటల్​​ టెరిటరీ ఆఫ్​ ఢిల్లీ యాక్ట్​కు సవరణ చేశారు. దాని స్థానంలో నేషనల్ క్యాపిటల్​ సివిల్​ సర్వీసెస్​ అథారిటీ ఏర్పాటు చేశారు. ఇది లెఫ్టినెంట్​ గవర్నర్​కు నియామకాలు, బదిలీలు, విజిలెన్స్​ అంశాలు, గ్రూప్​– ఎ ఆఫీసర్లకు సంబంధించిన అంశాలు, డిసిప్లనరీ యాక్షన్లకు సంబంధించి సిఫారసులు చేస్తుంది. 
    
నేషనల్​ క్యాపిటల్​ సివిల్​ సర్వీసెస్​ అథారిటీ చైర్మన్​గా ఢిల్లీ ముఖ్యమంత్రి, సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోం సెక్రటరీలు ఉంటారు. వీరిలో 2/3వ వంతు కోరంగా ఉంటుంది. 
    
ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులను లెఫ్టినెంట్​ గవర్నర్ తిరిగి పంపడం అవసరమైతే పక్కన పెట్టవచ్చు. దీంతోపాటు ఢిల్లీలోని మంత్రుల దగ్గర ఉన్న అంశాలను అవసరమైతే లెఫ్టినెంట్​ గవర్నర్​కు పంపించాలి.
    
ఢిల్లీలోని డిపార్టమెంట్​ సెక్రటరీలు అందరూ వివాదాస్పదమైన అంశాల విషయంలో లెఫ్టినెంట్​ గవర్నర్ అనుమతి తీసుకోవాలి.