యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.150 వీఐపీ టికెట్కొన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన కొత్త క్యూలైన్లను సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ధర్మదర్శన భక్తులు బస్ బే నుంచి, వీఐపీ టికెట్ భక్తులు తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లేవారు. అయితే, ధర్మదర్శన క్యూలైన్లకు మధ్యలో గ్రిల్స్ ఏర్పాటు చేసిన అధికారులు ఒక లైన్ను సాధారణ భక్తులకు, మరొక లైన్ను రూ.150 టికెట్లు కొన్న భక్తులకు కేటాయించారు.
దీంతో సోమవారం టికెట్లు కొన్న భక్తులు కొత్త క్యూలైన్ల నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్లు కొన్నవారు ధర్మదర్శన భక్తులతో పాటే మూడంతస్తుల క్యూకాంప్లెక్స్, గోల్డ్ క్యూలైన్లు, మాడవీధుల క్యూలైన్లు తిరుగుతూ ఆలయంలోకి వెళ్లారు. కేవలం కొండపైన బస్ బే దగ్గర ఎంట్రెన్స్ లో మాత్రమే ఉచిత, వీఐపీ భక్తులు వేర్వేరుగా క్యూలైన్లలోకి వెళ్లారు. లోపల వెళ్లాల్సిన దూరం మాత్రం అంతే ఉంది. దీంతో టికెట్లు కొన్న భక్తులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులకు తొందరగా దర్శనం అవుతుందని టికెట్లు కొంటే అన్ని లైన్లు తిప్పుతూ దర్శనానికి పంపించడం ఏమిటని మండిపడ్డారు.
పోలీసులు, ఆఫీసర్లతో వాగ్వాదం
కొందరు భక్తులు వీఐపీ టికెట్లు కొని పాత పద్ధతిలోనే దర్శనం ఉందనుకుని పొరబడి నేరుగా తూర్పు రాజగోపురం వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ ఆఫీసర్లు వారిని అనుమతించలేదు. దీంతో భక్తులు ఆలయ సిబ్బందితో గొడవకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా, కనీసం సూచిక బోర్డులు పెట్టకుండా కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయడమేంటని నిలదీశారు. అయినా ఆఫీసర్లు వినకపోవడంతో.. వీఐపీ టికెట్ల భక్తులు మళ్లీ బస్ బే వద్దకు చేరుకుని అక్కడి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.